జల వివాదం మరింత జఠిలం.. రెండు రాష్ట్రాల మధ్య సస్పెన్స్!
పోలవరం-నల్లమల సాగర్‌ను అడ్డుకోవాలంటూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటికే విచారించిన కోర్టు.. సోమవారం(12న) మరోసారి విచారించనుంది.
By: Garuda Media | 12 Jan 2026 11:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు మరింత జఠిలంగా మారుతున్నాయా? ఒకవైపు చర్చలకు సిద్ధం అంటూనే రెండు తెలుగు రాష్ట్రాలు.. పోరుకు రెడీ అవుతున్నాయా? అంటే.. తెరవెనుక-బయట జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా.. గోదావరి నుంచి సముద్రంలో కలిసే వెయ్యి టీఎంసీలకు పైగా నీటిలో కనీసం 200 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నది ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన. అయితే.. అసలు కేటాయించని నీటిని ఎందుకు వినియోగిస్తారన్నది తెలంగాణ అభ్యంతరం.
ఇదే.. ఇరు రాష్ట్రాల మధ్య గత మూడు మాసాలుగా వివాదాన్ని రాజేసింది. అటు కోర్టులు, ఇటు రాజకీయాల్లోనూ ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చకు వచ్చింది. అయితే.. అటు తెలంగాణ ముఖ్యమంత్రి, ఇటు ఏపీ సీఎం ఇద్దరూ కూడా గొడవలు వద్దు.. కూర్చుని మాట్లాడుకుని పరిస్థితిని సర్దుబాటు చేసుకుని ముందుకు సాగాలని భావిస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. ఇరువురు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. కానీ.. ఒకవైపు వారి వ్యాఖ్యలకు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మధ్య ఎక్కడా పొంతన చిక్కడం లేదు.
ఏం జరుగుతోంది?
పోలవరం-నల్లమల సాగర్‌ను అడ్డుకోవాలంటూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటికే విచారించిన కోర్టు.. సోమవారం(12న) మరోసారి విచారించనుంది. కానీ, గత విచారణ సమయంలో సుప్రీంకోర్టు మేలైన సూచన చేసింది. ఇరువురు చర్చించుకుంటే బెటర్ అని వ్యాఖ్యానించింది. దీంతోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కానీ, ఇంతలోనే.. తెలంగాణ ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టేలా బలంగా వాదనలు వినిపించేందుకు ఏపీ సర్కారు ఆదివారం ప్రత్యేకంగా న్యాయవాదులతో భేటీ అయింది.
ఇక, ఏపీ వాదనలను తిప్పికొట్టాలంటూ.. తెలంగాణ జలవనరుల మంత్రి ఉత్తమ్‌కుమార్ సైతం ఆదివారం.. తమ తరఫు న్యాయవాదులో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. అంటే.. సుప్రీంకోర్టులోనే ఈ వివాదాన్ని తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. మరోవైపు.. పోలవరం-నల్లమల ప్రాజెక్టు పూర్తిచేసేందుకు నిధులు ఇవ్వాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి నివేదిక ఇచ్చారు. ఇక, ఇదేసమయంలో కేంద్ర జలశక్తి మంత్రిని శుక్రవారం కలిసిన తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును నిలువరించాలని కోరారు. ఇలా.. పరస్పర విరుద్ధంగా..జల వివాదాలపై రెండు రాష్ట్రాలు స్పందిస్తుండడం అసలు ఈ వివాదాన్ని ఏ దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారన్న చర్చ తెరమీదికి వచ్చింది.
