Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి స్థానిక సమరం.. కొత్త ఏడాదిలో మారనున్న లెక్కలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల మేఘాలు కమ్ముకొస్తున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పటికే సై అంటోంది.

By:  Tupaki Political Desk   |   23 Nov 2025 10:00 PM IST
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి స్థానిక సమరం.. కొత్త ఏడాదిలో మారనున్న లెక్కలు
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల మేఘాలు కమ్ముకొస్తున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పటికే సై అంటోంది. ఏపీలో కూడా ఎన్నికల సంఘం నుంచి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తెలంగాణలో ఆదివారమే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారుచేస్తుండగా, ఏపీలో 175 నియోజకవర్గాల నుంచి ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సేకరించింది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేసింది. దీంతో కొద్దిరోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో స్థానిక సమరంపై సైరన్ మోగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ప్రభుత్వం గతంలో భావించింది. ఆ మేరకు జీవో జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే రిజర్వేషన్ల పెంపును కోర్టు తోసిపుచ్చడంతో ఎన్నికల నోటిఫికేషన్ రద్దైపోయింది. ఇక ఇప్పట్లో పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న ఆలోచనకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. 2018 నాటి పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సర్కారు సూచనలతో ఆదివారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారులు ప్రకటన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఏపీలో కూడా ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం సంకేతాలిస్తోంది. ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయడమే ఆలస్యమని, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అంటూ ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఏపీ ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉండటంతో ఏ క్షణంలో అయినా ఎన్నికల రిజర్వేషన్లపై ఆదేశాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు ఎప్పుడో గడువు ముగిసింది. ఏపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీలకు, మార్చిలో మున్సిపాలిటీలకు గడువు ముగియనుంది. మూడు నెలల ముందుగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో ప్రభుత్వం భావించింది. ఆ మేరకు డిసెంబరులో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం జనవరి తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా సమాయుత్తమైనా కేడర్ ను సన్నద్ధం చేయాల్సివుందని ప్రభుత్వం ఆలోచనగా ఉందంటున్నారు.

మొత్తానికి ఇరు రాష్ట్రాల్లో జనవరి నుంచి ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వరుసగా నిర్వహించేందుకు రెండు ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికల పండుగకు తెరలేస్తుందని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు అధికార పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయని అంటున్నారు.