ఆర్థిక పథకాలున్నా అప్పులు ఎందుకు?.. ఇదే కారణం?
ఇక, ఈ అప్పులు చేయడం తప్పుకాదన్నట్టుగా కేంద్రం కూడా.. ప్రోత్సహిస్తోంది. అప్పులు చేయండి.. అనుమతులు ఇస్తాం.. అంటూ కొన్ని ఆఫర్లు కూడా ఇస్తోంది.
By: Garuda Media | 25 Oct 2025 11:00 PM ISTతాజాగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన ప్రజల అప్పుల నివేదిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. కేంద్రం గ్రాంటులు తగ్గించడం.. ఆర్థిక సంఘాలు జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తూ.. సిఫారసులు చేస్తున్న దరిమిలా.. రాష్ట్రాలకు.. అప్పులు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఇక, ఈ అప్పులు చేయడం తప్పుకాదన్నట్టుగా కేంద్రం కూడా.. ప్రోత్సహిస్తోంది. అప్పులు చేయండి.. అనుమతులు ఇస్తాం.. అంటూ కొన్ని ఆఫర్లు కూడా ఇస్తోంది.
సరే.. రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ప్రజలు కూడా అప్పుల ఊబిలో కూరుకున్నారన్నది తాజాగా కేంద్ర గణాంక శాఖ ఇచ్చిన నివేదిక. మరీ ముఖ్యంగా దేశంలో ఏపీ, తెలంగాణ ప్రజలు మరింత ఎక్కువగా అప్పులు చేస్తున్నారని పేర్కొనడం విశేషం. నిజానికి దేశంలో అత్యధిక శాతం ఆర్థిక సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రెండు తెలుగు ప్రభుత్వాలు.. కూడా ప్రజలకు నేరుగా నిధులు ఇస్తున్నాయి.
అయినప్పటికీ అప్పులు ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్న. దీనికి నిపుణులు చెబుతున్న కొన్ని కారణాలు ఆసక్తిగా ఉన్నాయి.1) 30 వేల రూపాయల సంపాయించుకునే ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం లభించిన కుటుంబాలు.. ఈఎంఐల బాట పడుతున్నాయి. ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్‌లతోపాటు.. ఫోన్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ.. ఈఎంలలోనే తీసుకుంటున్నారు. 2) 40 నుంచి 50 వేల మధ్య ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు తీసుకుంటున్నారు. ఇది కూడా ఈ ఎంఐలలోనే తీసుకుంటున్నారు. 3) ఇటీవల కాలంలో బంగారు ఆభరణాలను కూడా ఈఎంఐలలోనే తీసుకుంటున్నారు. వీటి వల్లే.. ప్రజలు అప్పులు ఎక్కువగా చేస్తున్నారన్నది వారు చెబుతున్న మాట.
ఎలా లెక్కిస్తారు?
సాధారణంగా.. ప్రజలు ఎలా అప్పులు చేస్తున్నారు? ఏయే కారణాలతో అప్పులు చేస్తున్నారన్న విషయా లను రెండురూపాల్లో కేంద్రం గణిస్తోంది. 1) క్రెడిట్ కార్డులు: ఇటీవల కాలంలో నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ.. క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నవారు పెరుగుతున్నారు. వీటి ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. వీటి ఆధారంగా ప్రజల అప్పులపై గణాంకాలు వేస్తున్నారు. 2) రుణ సంస్థలు ఇచ్చే లావాదేవీల లెక్క. దీని ద్వారా కూడా ప్రజల అప్పుల భారాలను అంచనా వేయొచ్చు. ఇదే ఇప్పుడు ఏపీ తెలంగాణల్లో ప్రజలకు ఎక్కువగా అప్పులు ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించింది.
