Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల‌పై తిట్లు.. ఏం జరుగుతోంది ..!

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అదేవిధంగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యవహారాలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీసాయి.

By:  Garuda Media   |   16 Oct 2025 10:00 AM IST
ఎమ్మెల్యేల‌పై తిట్లు.. ఏం జరుగుతోంది ..!
X

వివాదాల్లో టిడిపి ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తామే వివాదాలు సృష్టిస్తుండగా మరికొందరు తమ ప్రమేయం లేకుండానే వివాదాల్లో పడిపోతున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఇద్దరు కీలక నాయకులు తెర‌ మీదకు వచ్చారు. వారిద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం మరింత ఆసక్తిగా మారింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అదేవిధంగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యవహారాలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీసాయి.

వారిద్దరిపై ప్రత్యక్షంగా విమర్శలు రావడం ఆసక్తిగా మారింది. నిజానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వివాదాల జోలికి పోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ.. ఎందుకు వారి మీద తీవ్రస్థాయి విమర్శలు వ‌స్తున్నాయ‌న్న‌ది ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది. అదే విధంగా బహిరంగంగానే దూష‌ణ‌లకు దిగటం వంటివి ఇప్పుడు చర్చకు దారితీసాయి. గురజాల జగన్మోహన్ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత‌ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే ఆయనకు జనసేన పార్టీ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు సాగుతున్నాయి.

జిల్లాకే చెందిన జనసేన నేత దయారాం నాయుడు ఇటీవల ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే జగన్మోహన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే పోరంబోకు అంటూ తీవ్ర విమర్శలు చేయడం అందరిని దిగ్భ్రాంతికే గురిచేసింది. అసలు తెరచాటున‌ ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. ప్రతి విషయంలోనూ జగన్మోహన్ జోక్యం చేసుకుంటున్నారని తమకు అస‌లు ప్రాధాన్యం ఇవ్వడంలేదని చిన్నచిన్న పనులు చేయించుకోవాలన్నా ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సి వ‌స్తోంది అన్నది జనసేన నాయకులు చెబుతున్న మాట.

నిజానికి క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు కలిసి ఉండాలని పార్టీ అధినేత చెబుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గాని ఆ దిశ‌గా కృషి చేయడం లేదన్నది స్పష్టం అవుతోంది. ఇదే ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే విషయంలో బహిరంగ విమర్శలు చేసేదాకా వచ్చిందన్నది పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ. ఇక గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ నుంచి గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్న మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులు పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

మాజీ ఐఏఎస్ కావడంతో అదే డిగ్నిటీని పాటిస్తారు. ఎవరి పట్ల నోరు జారరు అనే పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలను కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారని వాదన కూడా ఉంది. అయినప్పటికీ తాజాగా మాల మహానాడుకు చెందిన కీలక నాయకుడు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలోనే రామాంజనేయులుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే దీనికి రామాంజనేయులు చేసిన వ్యాఖ్యలే కారణమని మాల మహానాడు నాయకులు చెబుతున్నారు. తురకపాలెంలో జరిగిన అనారోగ్య మరణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది.

ఈ చెక్కులను అందిస్తున్న క్రమంలో రామాంజనేయులు మాట్లాడుతూ కొంతమంది దళారులు ఉంటారు వాళ్లకు మీరు ఏమి ఇవ్వద్దు అంటూ బాధితులకు సూచించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు. తమను ఉద్దేశించే ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఆయన యూజులెస్ ఫెలో అని వ్యాఖ్యానించారు. ఇది కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. నిజానికి ఒక ఎమ్మెల్యేను బహిరంగంగా యూజ్లెస్ ఫెలో అనడాన్ని ఎవరు సమర్ధించరు. సహించరు కూడా.

కానీ దీని వెనక ఏం జరుగుతుంది అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. ఇలాంటి వ్యవహారాలు అటు పార్టీకి ఇటు ఎమ్మెల్యేలకు కూడా తీవ్ర స్థాయిలో తలనొప్పిగా మారుతున్నాయి. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గాని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరేం చేస్తారనేది చూడాలి.