సంక్షేమం ఆగదు.. ఏం చేస్తానో చూస్తారు: చంద్రబాబు
గత ఎన్నికల సమయంలో `సూపర్ సిక్స్` పథకాలకు సంబంధించి ప్రజలకు హామీ ఇచ్చామని.. అదేవిధంగా సామాజిక భద్రతా పింఛన్లను కూడా ఒకేసారి రూ.1000 చొప్పున పెంచి నెలకు 4000 నుంచి 6000 వరకు ఇస్తున్నామని చెప్పారు
By: Garuda Media | 13 Sept 2025 4:00 AM ISTఏపీలో సంక్షేమ కార్యక్రమాలు ఆగబోవని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ఎన్నికల సమయంలో `సూపర్ సిక్స్` పథకాలకు సంబంధించి ప్రజలకు హామీ ఇచ్చామని.. అదేవిధంగా సామాజిక భద్రతా పింఛన్లను కూడా ఒకేసారి రూ.1000 చొప్పున పెంచి నెలకు 4000 నుంచి 6000 వరకు ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలైన.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటివి అమలు చేస్తున్నామని.. చెప్పారు. వీటి వల్ల ఏడాదికి ప్రస్తుతం 60 వేల కోట్ల రూపాయల భారం సర్కారుపై పడుతోందని చెప్పారు.
రాబోయే రోజుల్లో ఈ భారం రూ.లక్ష కోట్లకు చేరుతుందని అంచనా వుందన్నారు. దసరా నుంచి ఆటో డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇది కూడా సర్కారుపై భారం పడేదనని అన్నారు. అయినప్పటికీ.. సంక్షేమ కార్యక్రమాలను, సూపర్ సిక్స్‌ను ఆపేది లేదన్నారు. ఇదేసమయంలో అభివృ ద్ధిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తామని.. దీనిపై కూడా ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పారు.
ఏంటా ప్లాన్?
సీఎం చంద్రబాబు పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్ -పార్టనర్‌షిప్)ను ప్రతిపాదించారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికీ దాదాపు పీపీపీ మోడల్‌నే అనుసరించనున్నట్టు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలు ఇప్పుడు పీపీపీ విధానాన్నే అనుసరిస్తున్నాయని తెలిపారు. రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ప్రాజెక్టులు.. ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పీపీపీ విధానాన్నే అనుసరించనున్నట్టు తెలిపారు. దీనివల్ల సర్కారుపై ఎలాంటి భారం పడదని, అంతేకాకుండా.. సదరు ప్రాజెక్టులు తీసుకున్న కంపెనీల నుంచి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు.
పీపీపీ విధానంలో పన్నులు కట్టే సంస్థలకు.. ఆ పన్నుల్లో నుంచే కొంత మొత్తాన్ని ఇన్సెంటివ్ రూపంలో అందించ నున్నట్టు చంద్రబాబు చెప్పారు. అదేసమయంలో కొంత ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగడంతోపాటు.. పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును ప్రజలకు సంక్షేమం రూపంలో పంచేందుకు ఛాన్స్ లభిస్తుందన్నారు.
``మీరే చూస్తారు. నేనెలాంటి విధానాలు అనిస్తారో.. దీనివల్ల సంక్షేమం ఆగదు. అదేసమయంలో అభివృద్ధి కూడా ఆగదు`` అని చంద్రబాబు చెప్పారు. గతంలో తాను కఠినంగా ఉన్నానని.. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ కఠినంగానే ఉన్నానని తెలిపారు. అయితే.. ఇప్పుడు స్మార్ట్ వేను అనుసరిస్తున్నానని చెప్పారు. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు ఫోన్‌లోనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
