సోషల్ మీడియాపై సరికొత్త యుద్ధం.. లోకేశ్ ఆధ్వర్యంలో మంత్రులు సిద్ధం
ఏపీ ప్రభుత్వానికి చికాకు పెడుతున్న సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
By: Tupaki Political Desk | 2 Oct 2025 8:00 PM ISTఏపీ ప్రభుత్వానికి చికాకు పెడుతున్న సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం అనుచిత అసభ్యకర పోస్టులే కాకుండా ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. దీనికోసం అవసరమైన విధి విధానాలు రూపొందించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిని ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్ పై ఉక్కుపాదం మోపుతోంది. అయినప్పటికీ కొందరు నకిలీ అకౌంట్లు ద్వారా అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వహననానికి దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ సైకోలకు ముకుతాడు వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగులు, ఫేక్ ప్రచారంపై గతంలో ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకునేది. అయితే ఇటీవల సోషల్ మీడియా పోస్టులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా కేసులలో అరెస్టు చేయకుండా 41ఏ నోటీసులపై విచారణ జరపాలని స్పష్టంగా ఆదేశించింది. దీంతో కోర్టు నిబంధనలు అడ్డుపెట్టుకుని కొందరు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. లేనిది ఉన్నట్లు కల్పిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నట్లు భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కొందరు మహిళా ఎమ్మెల్యేపైనా అసభ్యకరమైన రీతిలో పోస్టుంగులు రావడంతో ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ప్రస్తుత చట్టాల ప్రకారం సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యేక చట్టం తీసుకురావడమే ఉత్తమమనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందని చెబుతున్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయడం ద్వారా అసత్య, అసభ్యకర కంటెంట్ కు ఫుల్ స్టాప్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కొత్త చట్టం తీసుకురావడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించేందుకు మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఐదుగురు మంత్రుల బృందాన్ని నియమించింది. ఇందులో సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచించాల్సివుంటుంది. అదేసమయంలో తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్‌పై నిఘా పెట్టి చర్యలకు సిఫారసులు చేయనుంది.
అదేసమయంలో సాధారణ పౌర హక్కుల పరిరక్షణకు కూడా ఈ మంత్రుల కమిటీ పలు సూచనలు ఇవ్వనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు చేసేందుకు వీలుగా సిఫారసు చేసే అధికారం కూడా ఈ కమిటీకి ఇచ్చారు. సిఫారసులను వీలైనంత త్వరలో ప్రభుత్వానికి సమర్పించాలని తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ కమిటీకి మూడు మాసాల సమయం ఇచ్చారు. వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా భేటీ కావాలని.. సాధ్యమైనంత వేగంగా సిఫారసులు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఈ కమిటీ పరిశీలించి.. సోషల్ మీడియాదూకుడు కళ్లెం వేసేలా నిర్ణయాలు తీసుకోనుంది.
