చంద్రబాబు స్కిల్ స్కాం కేసు ఓ సంచలనం.. ఏసీబీ కోర్టు తాజా నిర్ణయంతో మళ్లీ విస్తృత చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Political Desk | 13 Jan 2026 10:51 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 37 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చంద్రబాబు 37వ నిందితుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మిగిలిన నిందితులపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐడీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ నివేదిక సమర్పించింది. దీంతో విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ప్రకటించింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా, స్కిల్ కేసు నమోదు చేసింది. చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైలులో పెట్టింది. ఈ సంఘటనతోనే రాష్ట్రంలో విపక్షాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడానికి కారణమైందని చెబుతారు. అలాంటి కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి నివేదిక ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీ విభజన తర్వాత 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో యువతలో నైపుణ్యం పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.3,356 కోట్ల విలువైన ప్రాజెక్టులో సీమెన్స్ వాటా 90 శాతం. మిగతా పది శాతం ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ లో నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు నమోదు చేసింది. సీమెన్స్ 90 శాతం నిధులను ఈ ప్రాజెక్టులో వాటాగా పెడుతుందని పేర్కొన్నప్పటికీ అలా జరగలేదని మొత్తం ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని తెలిపింది. సీమెన్స్ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించకున్నా, దాని నుంచి నిదులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు రూ.371 కోట్లు విడుదల చేసిందని, ఆ నిధులు చంద్రబాబు డొల్ల కంపెనీలకు మళ్లించారని నాటి ప్రభుత్వం ఆరోపిస్తూ కేసు నమోదు చేయించింది.
ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు 37 మందిని నిందితులుగా ఆరోపించారు. పలువురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో 2023 సెప్టెంబరులో ప్రజాగళం యాత్రలో ఉన్న నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనమైంది. చంద్రబాబును 53 రోజుల పాటు జైలులో నిర్బంధించడంపై సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం జరిగింది. ఈ పరిణామంతో అప్పట్లో కూటమి ఏర్పాటుకు కారణమైందని చెబుతారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు ప్రభావం చూపిందని, చంద్రబాబుపై సానుభూతి పోటెత్తడంతో కూటమి ఘన విజయం సాధించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన కేసులో ఆరోపణలు వాస్తవాలు కాదంటూ ప్రస్తుతం సీఐడీ నివేదిక సమర్పించింది. అయితే సీఐడీ చర్యలను విపక్ష వైసీపీ తప్పుపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న ఆరోపణలను ఎలా తోసిపుచ్చగలరని వైసీపీ ప్రశ్నిస్తోంది. స్కిల్ కేసు ఒక్కటే కాకుండా వైసీపీ హయాంలో చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులను వరుసగా ఉపసంహరించుకుంటూ రావడాన్ని మాజీ సీఎం జగన్ తోపాటు ఆయన పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే మళ్లీ కేసులు రీ ఓపెన్ చేయిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా, ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయిందని, చంద్రబాబుపై కక్ష సాధింపునకే అక్రమ కేసులు నమోదు చేశారని కూటమి నేతలు ఎదురుదాడి చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
