Begin typing your search above and press return to search.

కేంద్రం తొండి.. బాబుకు తెలియ‌కుండానే.. !

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఏపీకి ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

By:  Garuda Media   |   16 Aug 2025 9:00 AM IST
కేంద్రం తొండి.. బాబుకు తెలియ‌కుండానే.. !
X

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఏపీకి ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వాస్తవానికి ఇది జాతీయ స్థాయిలో తీసుకున్న కీలక నిర్ణయమే తప్ప ఏపీకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్టుగా చూడలేమని మేధావి వర్గాలు చెబుతున్నాయి. పైగా వనరులు పెద్దగా లేని ఒరిస్సాకు, వనరులు భారీగా ఉన్న ఏపీకి మధ్య ఉన్న తేడాను గమనించకుండా కేంద్రంలోని బిజెపి పెద్దలు అడుగులు వేశారు అన్నది కూడా మేధావులు చెబుతున్న మాట.

ఎందుకంటే ఒరిస్సాకు 2066 కోట్ల రూపాయల విలువైన సెమీ కండక్టర్ ప్రాజెక్టును ఇస్తే ఏపీకి వచ్చేసరికి మాత్రం 435 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి ఒరిస్సా తో పోల్చుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అత్యంత కీలకంగా ఉంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది కూడా ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వమే. కానీ, ఈ విషయాన్ని మరిచిపోయారో లేక విదిలిస్తే సరిపోతుంది ఏపీ ప్రజల సంతోషిస్తారని అనుకున్నారో.. మొత్తానికి ఏపీ విషయంలో మరోసారి కేంద్రం తొండాట ఆడిందనేది రాజకీయ వర్గల్లో కూడా వినిపిస్తున్న ప్రధాన విమర్శ.

కనీసంలో కనీసం ఏపీకి 1000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్ అయినా ప్రకటించి ఉంటే బాగుండేదని టిడిపికి చెందిన కీలక ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చింది అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ఒరిస్సాకు రెండువేల కోట్ల రూపాయల పైన ప్రాజెక్టును ఇచ్చి ఏపీకి మాత్రం కేవలం 400 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టు ఇవ్వడంపై కేంద్రంతో మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ ముందు వరుసలో ఉంటే అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రంగా ఒరిస్సా ముందు వరసలో ఉంది.

ఈ విషయాన్ని కూడా కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉందని గుంటూరుకు చెందిన ఈ ఎంపీ వ్యాఖ్యానించటం గమనార్హం. అంతేకాదు అమరావతి నిధులకు సంబంధించి, పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి కూడా కేంద్రం వైఖరి పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. అయితే కేంద్రం ఇలా వ్యవహరిస్తున్న విషయం చంద్రబాబుకు తెలిసే జరుగుతుందా.. నిజంగా తెలియకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయం కేంద్రానికి బాగా తెలుసు. ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. అనేక మందిని ఆహ్వానిస్తున్నా రు. ఇలాంటి సమయంలో ఏపీకి కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టు వస్తే అది మరింత సహకరించే అవకాశం ఉంటుంది. కానీ, ఎటువంటి వనరులు లేని ఒరిస్సాకు భారీ ప్రాజెక్టు ఇవ్వడం, అన్నీ ఉన్న ఏపీకి తూతూ మంత్రంగా చేశామంటే చేశామన్నట్టుగా వ్యవహరించడం వంటివి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో అయినా ఈ పద్ధతిని మార్చుకోవాలని ఏపీ విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని టిడిపి నాయకులు చెబుతున్న మాట.

ఈ విషయంపై చంద్రబాబు గట్టిగా ఉండాలని కేంద్రంతో సూటిగా వ్యవహరించాలని కూడా వారు సూచిస్తున్నారు. ఎన్నికలు రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉందని, ఇప్పటికిప్పుడు కేంద్రంతో గట్టిగా మాట్లాడటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని కూడా చెబుతున్నారు. ఇచ్చిందే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తే సరికాదని గట్టిగా అడిగి ప్రాజెక్టులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో అనేది చూడాలి.