సచివాలయం కోపం ..పండుటాకులకు శాపం
వైసీపీ హయాంలో రెండున్నర లక్షల దాకా వాలంటీర్లు ఉండేవారు. వారంతా ప్రతీ నెలా ఇంటింటికీ వెళ్ళి సామాజిక పెన్షన్లు ఇచ్చేవారు.
By: Satya P | 1 Oct 2025 11:10 PM ISTఏపీలో సచివాలయ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు. తమ విషయంలో ఏణ్ణర్ధం దగ్గర పడుతున్నా ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోలేదని వారి ఆగ్రహంగా ఉంది. దాంతో వారు సరిగ్గా సామాజిక పెన్షన్ల పంపిణీ రోజున తిరుగుబాట పట్టారు. చాలా మంది అయితే రాష్ట్రంలో పలు జిల్లాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షన్లు పంపిణీ చేశారు. మరి కొన్ని చోట్ల మాత్రం అత్త మీద కోపం దుత్త మీద చూపించారు, దాంతో పండుటాకులకు అది పెను శాపంగా మారింది.
ప్రమోషన్లు కోరుకుంటూ :
తమకు అధిక పనిభారం ఉందని సచివాలయం ఉద్యోగులు గత కొంతకాలంగా గుస్సా అవుతున్నారు. వారు వైసీపీ ప్రభుత్వం హయాంలో నియమితులు అయ్యారు. 2019లో అక్టోబర్ 2న నియమితులైన వారంతా ఇప్పటికి ఆరేళ్ళుగా ఒకే చోట ఎదుగూ బొదుగూ లేకుండా పనిచేస్తున్నామని వాపోతున్నారు. 2024 ఎన్నికల్లో వారు కూటమికి సపోర్ట్ చేశారు. దాని వెనక రీజన్ ఏంటి అంటే తమకు పదోన్నతులు వస్తాయని, మంచిగా ఉగ్యోగ జీవితం ఉంటుందని. అయితే రాష్ట్రంలో లక్షా ముప్పయి వేల మంది దాకా సచివాలయ ఉద్యోగులు విషయంలో ఏ మాత్రం ఎదుగుదల లేదు కానీ పని భారం పెరిగిందని వారు మండిపోతున్నారు.
వాలంటీర్ల పనితో :
వైసీపీ హయాంలో రెండున్నర లక్షల దాకా వాలంటీర్లు ఉండేవారు. వారంతా ప్రతీ నెలా ఇంటింటికీ వెళ్ళి సామాజిక పెన్షన్లు ఇచ్చేవారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక వారిని పక్కన పెట్టేసి సచివాలయ ఉద్యోగులకు ఆ పని అప్పగించింది. దాంతో వారు కూటమి ప్రభుత్వం తమకు మేలు చేస్తుందని భావించి ఇన్నాళ్ళూ పనిచేస్తూ వచ్చారు. ఇపుడు వారి డిమాండ్ల విషయం పక్కన పెడితే పని ఒత్తిడి పెరిగిపోతోంది అని గగ్గోలు పెడుతున్నారు. పీ 4 పధకం విషయంలో కూడా వారిదే బాధ్యత అంటూ కొత్త పనులు పురమాయించారు అని అంటున్నారు. దాంతో కొన్ని రోజులుగా వారు నిరసనలో ఉన్నారు. ఈ నేపధ్యంలో పెన్షన్ల పంపిణీ వచ్చింది. దానిని నల్ల దుస్తులు ధరించి పూర్తి చేశారు.
అక్కడ మాత్రం నో :
అయితే కడప నగరంలో మాత్రం ఇంటింటికీ వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాల్సిన సచివాలయం సిబ్బంది ఆ పని చేయకపోగా పండుటాకులను తమ వద్దకే రప్పించుకున్నారు. దాంతో ఎర్రటి ఎండలో సచివాలయం దగ్గర పెన్షన్ కోసం వృద్ధులు పడికాపులు కాయాల్సి వచ్చింది. ఇలా వయో వృద్ధులు, అలాగే వికలాంగులు అంతా కూడా వెళ్ళలేక మరీ సచివాలయాలకు వెళ్ళడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి హామీ గాలికి :
వాలంటీర్లను తీసేసినా ప్రతీ ఇంటికీ ఠంచనుగా ఒకటవ తేదీకి సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ చేయిస్తామని అదే విధంగా అయిదవ తేదీ వరకూ ఈ పంపిణీ జరుగుతుందని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆనీ ఇపుడు కడపలో ఆ పరిస్థితి కనిపించకపోవడంతో పెన్షన్ దారులు గగ్గోలు పెడుతున్నారు. మరి కొన్ని చోట్ల కూడా ఆదరాబాదరగా పెన్షన్లు ఇచ్చేసి వెళ్ళిపోయిన ఘటనలు జరిగాయి. తమ డిమాండ్లను తీర్చాలని వాలంటీర్ల పని అయిన ఇంటింటికీ పెన్షన్లు తాము ఇక మీదట ఇచ్చే ప్రసక్తి లేదని సచివాలయ సిబ్బంది తెగేసి చెబుతున్నారు. దీంతో వారి విషయంలో ప్రభుత్వం ఏమి చేయనుంది అన్నది చర్చగా ఉంది.
