Begin typing your search above and press return to search.

రాజకీయ త్రిశంకులో గ్రామ వార్డు ఉద్యోగులు ?

ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ఇప్పటికి ఏడేళ్ళ క్రితం ఏర్పాటు అయింది.

By:  Satya P   |   28 Sept 2026 11:35 PM IST
రాజకీయ త్రిశంకులో గ్రామ వార్డు ఉద్యోగులు ?
X

ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ఇప్పటికి ఏడేళ్ళ క్రితం ఏర్పాటు అయింది. 2019 నుంచి గ్రామాలు వార్డులలో ప్రతీ సచివాలయంలో పదేసి మంది ఉద్యోగులు చేరారు. అలా లక్షా ముప్పయి వేల మందికి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. దేశంలోనే కొత్త వ్యవస్థకు తాము శ్రీకారం చుట్టామని ఈ రోజుకీ వైసీపీ చెప్పుకుంటుంది. అయితే వైసీపీ ఎంతవరకూ ఈ వ్యవస్థను సొంతం చేసుకుందో తెలియదు కానీ అందులో పనిచేసే ఉద్యోగులు మాత్రం వైసీపీ మీదనే తమ వ్యతిరేకతను చూపిస్తూ 2024లో మెజారిటీ కూటమి వైపు మొగ్గు చూపారని విశ్లేషణలు ఉన్నాయి. దాని కంటే ముందు 2023లో ఏపీ వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీకి షాక్ ఇస్తూ కూటమి అభ్యర్ధులకే పట్టభద్రులైన ఉద్యోగులు జై కొట్టారని అంచనాలు ఉన్నాయి.

వైసీపీ వద్దు అంటూ :

తమకు ఉద్యోగాలు ఇచ్చిన వైసీపీ ఎందుకు వద్దు అంటే ఉద్యోగుల ఆవేదన అక్కడే ఉంది. తొలి రెండేళ్ల పాటు కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే జీతాలు ఇచ్చి వారితో పని చేయించుకుంది అన్నది వారి ఆగ్రహం. అంతే కాదు రెండేళ్ళు ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కాగానే పర్మనెంట్ చేస్తామని చెప్పడంతోనే పోస్టు గ్రాడ్యుయేట్లు చేసిన వారు అంతా కూడా ఈ చిన్న ఉద్యోగాలలో చేరారు. కానీ ఆచరణలో అలా జరగలేదు. రెండేళ్ళు పై దాటినా అదే చిన్న జీతాలతో పని చేయించుకుంటూ రావడంతో వారు అప్పట్లో ఉద్యమించారు. దాంతో రెండున్నరేళ్ళకు కానీ ప్రోబేషన్ దక్కలేదు. ఆ తరువాత జాబ్ చార్ట్ అన్నది కూడా వారికి లేకుండానే వైసీపీ పాలన ముగిసింది. ఇక వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించినా ఏ రకమైన ఆదాయం పెరుగుదల ప్రమోషన్లు లేకపోవడంతో వైసీపీ మీద కోపం పెంచుకుని 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి కారణం అయ్యారని విశ్లేషణలు ఉన్నాయి.

కూటమి హయాంలోనూ :

ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థ విషయంలో స్టడీ చేయడం మొదలెట్టింది. ఎందుకంటే ఒక్కో సచివాలయంలో పదేసి మంది ఉద్యోగులను నియమించారు. చాలా మందికి పని పెద్దగా లేదు, అంతే కాదు అనవసర సిబ్బంది కూడా ఉన్నారని గుర్తించి వారి సేవలను వివిధ ప్రభుత్వ విభాగాలలో డెప్యుటేషన్ మీద వాడుకోవాలని ఆదేశించింది. ఇక స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులుగా పేరు మార్చింది. ఇక వారి విధులు ఏమిటన్నది కూడా పక్కగా నిర్వచించడం జరిగింది. హేతుబద్ధంగా ఉద్యోగుల విభజన కూడా చేసింది. ఈ నేపధ్యంలో వారి కోరికల చిట్టాను సానుకూలంగా పరిశీలిస్తామని చెబుతూ వచ్చింది.

అందుకే ఆందోళన :

అయితే తమకు ఏ డిమాండూ అమలు కావడం లేదని భావించి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఉద్యోగులు తాజాగా విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇదే నేపధ్యంలో ప్రభుత్వం కూడా వారి డిమాండ్ల విషయంలో సానుకూలత చూపించింది. సుమారు 15 వేల మందికి పదోన్నతులు కల్పించింది. అలాగే 150 కోట్ల రూపాయల అదనపు భారమైనా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్వీమ్ అమలు చేసేందుకు అంగీకరించింది. 24 గంటల్లోగా సెలవు మంజూరయ్యే విధంగా ప్రత్యేక పోర్టల్ ని తీసుకుని వచ్చింది. అంతే కాదు ఆచరణ సాధ్యమైన డిమాండ్లన్నిటినీ పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని మంత్రి డోల బాల శ్రీ వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.

వైసీపీ నీడ :

ఇదిలా ఉంటే సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు వైసీపీ మద్దతు ప్రకటించింది. అంతే కాదు వారికి అండగా ఉంటామని పేర్కొంది. అదే సమయంలో వారి డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేస్తే పోలీసులతో దాడి చేస్తారా అని కూడా ప్రశ్నిస్తోంది. ఇదే విషయంలో కూటమి నుంచి ఘాటుగానే రియాక్షన్ వస్తోంది. ఆనాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఎందుకు ప్రమోషన్ చానల్ క్రియేట్ చేయలేదని మంత్రి స్వామి ప్రశ్నించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు ఎప్పుడైనా తమ సమస్యలు ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు తీసుకురాలేదని ఆయన అన్నారు. తాము మాత్రమే వారి సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామని చెప్పుకున్నారు. అయినా సరే అలవి కానీ డిమాండ్లు పెడితే తీర్చలేమని మంత్రి స్పష్టం చేశారు.

అది కుదరదు :

స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు జూనియర్ అసిస్టెంట్ కేడర్ కోసం డిమాండ్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. అయితే ఇది అన్ని శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులందరినీ ప్రభావితం చేస్తుందని ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. అంతేగాక 20 కేడర్ల ఉద్యోగులందరినీ జూనియర్ అసిస్టెంట్ కేడర్ కు అప్ గ్రేడ్ చేయడానికి ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం తాను చేయాల్సినవి అన్నీ చేసిందని ఆయన చెప్పారు. ఈ విషయంలో వారే ఆలోచించుకోవాలన్నది ప్రభుత్వం విధానంగా ఉంది. ఇక స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగుల విషయంలో వైసీపీ రాజకీయ ప్రభావం పడితే మాత్రం వారికి మరింతగా ఇబ్బంది తప్ప మరేమీ కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఒక కొత్త వ్యవస్థలో ఉన్న ఈ ఉద్యోగులు ఆచీ తూచీ అడుగులు వేయాల్సి ఉందని అంటున్నారు.