బాండ్ పేపర్లు.. రూ.కోట్ల ఆఫర్లు : పంచాయతీ ఎన్నికల్లో హామీల జాతర
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు భారీ హామీలు ఇస్తున్నారు. అనంతపురం నేమకల్లులో గెలిస్తే పుట్టే ఆడబిడ్డలకు రూ.10 వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ఓ అభ్యర్థిని ప్రకటించారు. మరికొందరు రెండెకరాల భూమి, రూ.1.50 కోట్ల వరకు గ్రామాభివృద్ధి నిధులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది.
By: Tupaki Political Desk | 22 Nov 2026 4:50 PM ISTఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న హామీలతో దూసుకుపోతున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి గ్రామ పెద్దగా బాధ్యతలు చేపట్టాలనే కుతూహలం ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఎవరూ ఊహించని హామీలు ఇస్తుండగా, మరికొందరు ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేసమయంలో గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఉండాలని, సామరస్యపూర్వకంగా ఎన్నికలు జరగాలని ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామ జనాభా ఆధారంగా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయితే కొన్నిచోట్ల పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థులు ఆకర్షించే హామీలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఈ క్రమంలో అనంతపురం జిల్లా నేమకల్లు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని తాను గెలిచిన తర్వాత పుట్టే ఆడబిడ్డల కోసం రూ.10 వేలు ఫిక్సడ్ డిపాజిట్ చేస్తానంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ హామీ వైరల్ అవుతోంది. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని, విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా తన హామీలు అమలు చేసే విషయంలో మాట తప్పనంటూ రూ.10 బాండ్ పేపరుపై రాసివ్వడం గమనార్హం. ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రూరల్ మండలం కేసుపురం సర్పంచ్ అభ్యర్థి గుజ్జు రిషా కూడా గ్రామ సమస్యల పరిష్కారంపై బాండ్ పేపరు రాసివ్వడం విశేషంగా ఆకట్టుకుంటోందని అంటున్నారు.
భూములు, కోట్ల రూపాయల ఆఫర్లు
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎంపికయ్యేందుకు ఆశావహులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడిలో ఓ అభ్యర్థి తనకు సర్పంచ్‌గా అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి కోసం తన భార్య పేరుపై ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిని రాసిస్తానని ప్రకటించారు. కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే డంపింగ్ యార్డ్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం రూ. 1.50 కోట్లు సొంత నిధులు ఖర్చు చేస్తానని ఒక అభ్యర్థి ముందుకు వచ్చారు. అదేసమయంలో పలు గ్రామాల్లో రూ. 15 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు నగదు, దేవాలయాల అభివృద్ధికి నిధులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. చక్రాయపాలెం గ్రామంలో రూ. 51 లక్షలకు ఏకగ్రీవ ఒప్పందం జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం చందకచర్ల సర్పంచ్ పదవికి తనను ఎన్నుకుంటే పంచాయతీకి రూ.1.50 కోట్లు జమ చేస్తామని భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనంజయస్వామీజీ సంచలన ప్రకటన చేశారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ఇక ఏకగ్రీవ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం జనాభా ఆధారంగా ప్రోత్సాహక నిధులను పెంచింది. 5,000 వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15 లక్షలు, ఐదు నుంచి 10,000 జనాభా ఉంటే రూ. 25 లక్షలు, 10,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 50 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు అందించనుంది. అయితే, ఈ ప్రక్రియ ఎవరి పోటీ చేసే హక్కుకు లేదా ఓటర్ల స్వేచ్ఛకు ఆటంకం కలిగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
