Begin typing your search above and press return to search.

ఏపీ స్పెషల్ అట్రాక్షన్ : వెల్లువలా తరలి వచ్చారు

ఏపీ మీద మోజు పెరిగిందా ఉత్సాహం పెల్లుబికిందా ఏపీలో ప్రగతి దారులను స్వయంగా చూసి ఆనందించాలని అనిపించిందా ఏపీ ఫ్యూచర్ స్టేట్ హోప్స్ బలపడ్డాయా.

By:  Satya P   |   17 Jan 2026 10:23 PM IST
ఏపీ స్పెషల్ అట్రాక్షన్ : వెల్లువలా తరలి వచ్చారు
X

ఏపీ మీద మోజు పెరిగిందా ఉత్సాహం పెల్లుబికిందా ఏపీలో ప్రగతి దారులను స్వయంగా చూసి ఆనందించాలని అనిపించిందా ఏపీ ఫ్యూచర్ స్టేట్ హోప్స్ బలపడ్డాయా. ఇందులో కొన్ని కావచ్చు అన్నీ కావచ్చు, ఏదైతేనేమి ఏపీ పట్ల స్పెషల్ ఎట్రాక్షన్ అయితే ఈసారి జనాలలో కనిపించింది అని అంటున్నారు. బస్సెక్కి రైలెక్కి కారెక్కి బైకెక్కి ఫ్లైటెక్కి ఏపీకి అంతా తరలివచ్చారు. లక్షలాదిగా ఏపీ వైపుగా ర్యాలీ అయ్యారు, అన్ని దారులూ ఏపీ వైపుగానే సాగాయి. నిజమైన సంక్రాంతి పండుగ ఏపీకి ఈసారే అని నిరూపించారు, రుజువు చేశారు అన్న విశ్లేషణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

గతానికి భిన్నంగా :

సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే ఎక్కడెక్కడి జనాలు తమ సొంతూళ్ళకు రావడం సహజం. అంతే కాదు సొంత ఊరుని కన్న తల్లిగా భావిస్తారు, తమ వారిని తమ గాలిని నీరుని చూసుకుంటూ ఆ అనుభూతులను గుండె నిండా నింపుకునేందుకు వస్తారు, అది ఎపుడూ ఉండేదే. కానీ ఈసారి మాత్రం దానికి అనేక రెట్లు ఉత్సాహంగా ఏపీకి జనాలు వచ్చారు అని అంటున్నారు. ఏపీకి ఈసారి సంక్రాంతి చాలా తొందరగానే వచ్చింది అని అంటున్నారు. జనవరి రెండవ వారం మొదలు కావడం నుంచే ఏపీ వైపుగా వాహనాలు కదలడం మొదలైంది అని అంటున్నారు. అది భోగీ రోజు దాకా సాగిందని చెబుతున్నారు. కార్లు బారులు తీరి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదానిని మొత్తం కమ్మేశాయి. డ్రోన్ల ద్వారా ఆ విజువల్స్ ని చూసిన వారు అంతా ఏపీకి లక్షలలో కదులుతున్న జనం దండుని చూసి సొంత రాష్ట్రం మీద ఎంత ప్రేమ అని అనుకోవడం జరిగింది.

ముప్పయి లక్షల పైగా :

ఏపికి ఈ ఏడాది ఏకంగా సంక్రాంతికి 30 లక్షల మందికి పైగా జనాలు తరలి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విశేషం. వీరంతా ఏపీలోని తమ సొంతూళ్ళకు ఎంతో ఉత్సాహంగా కదిలి వచ్చారని ఆయన చెప్పారు. ఒక్క హైదరాబాద్ నుంచే ఏకంగా మూడు లక్షలకు పైగా వాహనాలలో సంక్రాంతి పండగ కోసం ఏపీకి వచ్చారని బాబు వివరించారు. అంతే కాదు ఈసారి సంక్రాంతి వేడుకలలో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించామని ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అన్నారు.

ఏపీ అభివృద్ధి కోసం :

నిజానికి ఇతర ప్రాంతాలలో లక్షల మంది ఉంటూ తమ సొంతూళ్ళకు పండుగ వేళకు రావడానికి నానా ఇబ్బందులు పడ్డారు, అయినా సరే వారిలో అభిమానం మాత్రం ఎక్కడా తగ్గలేదు, జన్మభూమి పట్ల వారిలో అనురక్తి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక కూటమి ప్రభుత్వం మంచి మెజారిటీతో 2024 లో అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సాగుతోంది అని మీడియా ద్వారా సమాచారాన్ని నిత్యం తెలుసుకుంటున్న ప్రవాస ఆంధ్రులు తమ ఊరికి జరిగిన మేలు తన జిల్లాకు ప్రాంతానికి రాష్ట్రానికి జరిగిన మేలు కళ్ళారా చూడాలన్న ఆసక్తితోనే ఈసారి పెద్ద ఎత్తున తరలి వచ్చారని అంటున్నారు.

తలమానికంగా అభివృద్ధి సాధించాలని :

ఏపీ అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం ఎప్పటికపుడు విషయాలను అన్నీ మీడియా ముఖంగా జనంలో పెడుతూ చేస్తున్న ప్రచారం వల్ల కూడా గతానికి భిన్నంగా ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చారని అంటున్నారు రానున్న కాలంలో సౌత్ ఇండియాలో మిగిలిన స్టేట్స్ తో పాటుగా ఏపీ కూడా తలమానికంగా అభివృద్ధి సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఆ ఉత్సాహమే సంక్రాంతి వేళ కనిపించింది అని అంటున్నారు. మరి ఏపీలో సాగుతున్న అభివృద్ధితో 2027 నాటికి ఇంతకు ఇంతా జనాలు తరలి వస్తారు అని కూడా అంచనాలు అయితే ఇప్పటికి ఉన్నాయి.