వైసీపీ నేత ద్వారంపూడికి చెక్.. అటు నుంచి నరుక్కొస్తున్న టీడీపీ?
రైస్ మిల్లర్ల సంఘం అంటే కేవలం వ్యాపారపరమైనది మాత్రమే కాదు. ఇది స్థానిక రాజకీయాలను, అధికార పార్టీల ప్రాధాన్యతలను శాసించే కీలక సంఘంగా చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 31 March 2026 5:00 AM ISTఏపీలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాజకీయం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ అసోసియేషన్ పై దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి చెక్ చెప్పేలా సంఘంలోని కొందరు పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రయత్నాలను పసిగట్టిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యూహాత్మకంగా పావులు కదిపి అసోసియేషన్ చేజారకుండా అడ్డుకునేలా పావులు కదిపారని చెబుతున్నారు. అయితే ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లిందని, దీంతో ద్వారంపూడి పెత్తనానికి చెక్ చెప్పేలా కీలక వ్యూహం సిద్ధం చేశారని అంటున్నారు.
రైస్ మిల్లర్ల సంఘం అంటే కేవలం వ్యాపారపరమైనది మాత్రమే కాదు. ఇది స్థానిక రాజకీయాలను, అధికార పార్టీల ప్రాధాన్యతలను శాసించే కీలక సంఘంగా చెబుతున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగే బియ్యం ఎగుమతులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రేషన్ బియ్యం సరఫరాకు అవసరమయ్యే సీఎంఆర్ లెక్కలను పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు. కోట్ల రూపాయల లావాదేవీలతో ముడిపడిన సంఘంను తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని నేతలు భావిస్తుంటారు. అయితే కాకినాడలో గట్టి పట్టున్న నేతగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబమే కొన్నేళ్లుగా ఈ సంఘాన్ని శాసిస్తోంది.
అయితే కూటమి ప్రభుత్వంలో కూడా రేషన్ బియ్యం సీఎంఆర్ వ్యవహారాలను ద్వారంపూడి పర్యవేక్షించడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అంతేకాకుండా గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ పై ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనకు ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ద్వారంపూడి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొందరు కూటమి నేతలు వ్యూహరచన చేశారని అంటున్నారు.
ఇదే సమయంలో ద్వారంపూడిపై అసంతృప్తితో ఉన్న కొందరు రైస్ మిల్లర్లు కూడా కూటమి నేతలతో చేతులు కలపడంతో రైస్ మిల్లర్ల సంఘం నుంచి ద్వారంపూడి కుటుంబానికి ఉద్వాసన చెప్పేలా రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ప్రధానంగా కాకినాడ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని చెబుతున్నారు. ఇది పసిగట్టిన ద్వారంపూడి ముందుగా వల్లూరిని ఆ పదవి నుంచి తొలగించేందుకు వ్యూహరచన చేశారని చెబుతున్నారు.
ఈ పరిణామాలతో రైస్ మిల్లర్ల అసోసియేషన్ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాకుండా ద్వారంపూడి ఎపిసోడ్ కూటమి పెద్దలకు చేరిందని అంటున్నారు. దీంతో ద్వారంపూడికి చెక్ చెప్పేలా రాష్ట్రస్థాయిలో కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో వైసీపీ నేత ద్వారంపూడి ప్రమేయం లేకుండా నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని ఆ బాధ్యతను కొందరు నేతలకు అప్పగించారని ప్రచారం జరుగుతోంది.
కాకినాడకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్, కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో ‘కూటమి కమిటీ’ ఏర్పాటు చేసింది. కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావును రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక చేసే బాధ్యతలు అప్పగించిందని అంటున్నారు. ఈ కమిటీ సభ్యులు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల రైస్ మిల్లర్లతో చర్చించి రైస్ మిల్లర్ల అసోసియేషన్ ను మార్చాలని దిశానిర్దేశం చేయనున్నారని అంటున్నారు.
