రాజ్యసభకు ఎవరూ ఊహించని వారు ఎంట్రీ ?
రాజ్యసభలో ప్రవేశం కోసం చాలా మంది కలలు కంటారు. రాజ్యసభ అన్నది పెద్దల సభ. ఒక్కసారి నెగ్గితే ఆరేళ్ల పాటు అక్కడ పదవిలో ఉండొచ్చు.
By: Satya P | 14 April 2026 8:00 AM ISTరాజ్యసభలో ప్రవేశం కోసం చాలా మంది కలలు కంటారు. రాజ్యసభ అన్నది పెద్దల సభ. ఒక్కసారి నెగ్గితే ఆరేళ్ల పాటు అక్కడ పదవిలో ఉండొచ్చు. ఉన్నతమైన అవకాశంగా ఉంటుంది. లోక్ సభ ఎంపీగా గెలవాలి అంటే దాదాపుగా ఇరవై లక్షల మంది ఓటర్లు ఉన్న చోట గట్టి పోటీని ఎదుర్కొని రావాలి. గెలిచినా అయిదేళ్ళ పదవీ కాలమే. అదే రాజ్యసభకు అయితే అధినేత దయ ఉంటే చాలు హాయిగా అడుగుపెట్టేయవచ్చు. పార్లమెంట్ లో ప్రవేశించే ముచ్చట కూడా తీర్చుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది రాజ్యసభ వైపు చూస్తారు. దాంతో రాజ్యసభ రేసులో సాధించిన వారిని లక్కీయెస్ట్ గానే ట్రీట్ చేస్తారు.
ఆ నాలుగింటిలో :
ఏపీలో జూన్ నెలలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి టీడీపీది ఉంది. అదే సానా సతీష్ కి చెందినది. అలాగే వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి పరిమళ్ నత్వానీ ఈ టెర్మ్ లో రిటైర్ అవుతున్నారు. వీరి ప్లేస్ లో కొత్త వారిని ఎన్నుకుని పంపే చాన్స్ కూటమికే ఉంది. మొత్తం 175 మంది కలిగిన ఏపీ అసెంబ్లీలో 164 మంది కూటమికి చెందిన వారు ఉన్నారు. అదే విధంగా వైసీపీకి నో చాన్స్. దాంతో ఈ నాలుగు సీట్లలో కొత్తగా కుదురుకుపోయేది ఎవరా అన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది.
అనుకున్న పేర్లు కావా :
ఇప్పటిదాకా అనుకున్న పేర్లు కాదంటూ కొత్తగా అనేక పేర్లు చర్చలోకి వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీలో అయితే ఎంత గట్టి పోటీ ఉందో అందరికీ తెలుసు. ఇక ఈ నాలుగు సీట్లలో టీడీపీ రెండు తీసుకుంటుందని మిత్రులైన జనసేనకు బీజేపీకి చెరి ఒకటి ఇస్తుందని అంటున్నారు. అలా చూస్తే కనుక టీడీపీలో ఒక పోస్టు సానా సతీష్ కే రెన్యూల్ అవుతుందని అంటున్నారు. ఆయన గెలిచి ఏడాదిన్నర మాత్రమే అయింది కాబట్టి పూర్తి కాలం పదవి ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ రెండు పోస్టులకు కొత్త వారే వస్తారని మరో ప్రచారం పెద్ద ఎత్తున విన వస్తోంది దాంతో ఆ వచ్చేది ఎవరా అంటే గల్లా జయదేవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన రెండు సార్లు గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు. దాంతో పాటు ఢిల్లీ స్థాయిలో మంచి పలుకుబడి ఉంది అందువల్ల ఆయన సేవలను ఉపయోగించుకుంటారు అని అంటున్నారు.
రాజకీయాలలో లేని వారికి :
అదే సమయంలో భారత్ బయోటెక్ చీఫ్ అయిన ఎల్లా కృష్ణ పేరు ముందుకు రావడమే అసలైన ఆసక్తికరమైన అంశం అంటున్నారు. ఇక సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విపరీతంగా ట్రై చేస్తున్నారు కానీ అదే విధంగా మరో సీనియర్ నేత వర్ల రామయ్య కూడా రేసులోకి దూసుకుని వస్తున్నారు. ఇక యువ నాయకుల జాబితా చూస్తే కనుక చింతకాయల విజయ్ కి కూడా రాజ్యసభ సీటు దక్కే సీన్ ఉందని అంటున్నారు. మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వారికి ఇవ్వాలని వారి సేవలను వినియోగించుకోవాలని కూడా ప్రతిపాదన ఉందని అంటున్నారు.
జనసేనలో బిగ్ ట్విస్ట్ :
అదే విధంగా జనసేనలో చూస్తే ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని పేరు జోరుగా వినిపిస్తున్నా ఆశ్చర్యకరంగా ఒక ప్రముఖ తెలుగు నిర్మాత పేరు కూడా ముందుకు వస్తోంది. అల్లు అరవింద్ ని రాజ్యసభకు పంపుతారు అని అంటున్నారు. అల్లు అరవింద్ పెద్దల సభకు ఎంపిక అన్నది ఒక షాకింగ్ న్యూస్ గా ఉన్న జనసేన కోరుకుంటే ఆయనకే అని అంటున్నారు
బీజేపీ నుంచి తమిళ తంబి :
ఇక బీజేపీ కోటాలో ఏపీ నుంచి నామినేట్ అయ్యే వారిలో ముందు పేరు తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అంటున్నారు ఆయనకు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా రాజ్యసభ సీటు కోసమే అని అంటున్నారు. ఆయనను పెద్దల సభకి తెచ్చి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అయితే వైసీపీ నుంచి రిటైర్ అవుతున్న పరిమళ్ నత్వానీకి రెన్యూవల్ బీజేపీ కోటలో ఉండొచ్చు అని అంటున్నారు. నిజం చెప్పాలీ అంటే ఆయన బీజేపీ సిఫార్సుతోనే వైసీపీ నుంచి ఎంపీ అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఈ పేర్లు మాత్రమే కాదు అనేక ఇతర పేర్లు కూడా ఉన్నాయి. మొత్తానికి అనూహ్యమైన వారికే రాజ్యసభ ఎంట్రీ ఉంటుందా అంటే ప్రచారం చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు.
