Begin typing your search above and press return to search.

4 ఖాళీల్లో టీడీపీకి దక్కేది ఒక్కటేనా? అధికార పార్టీ నేతల్లో గుబులు

మరో నాలుగు నెలల్లో ఏపీలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలపై అధికార కూటమిలో విస్తృత చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   8 Jan 2026 4:00 AM IST
4 ఖాళీల్లో టీడీపీకి దక్కేది ఒక్కటేనా? అధికార పార్టీ నేతల్లో గుబులు
X

మరో నాలుగు నెలల్లో ఏపీలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలపై అధికార కూటమిలో విస్తృత చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నా, ఈ పదవుల కోసం కూటమిలో ఉన్న మూడు పార్టీల నేతల మధ్య పోటీయే ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. రాష్ట్రం వరకు కూటమిలో పెద్దన్నగా ఉన్న టీడీపీకి ఎన్ని పదవులు దక్కుతాయి? రాజ్యసభ స్థానాల కోసం బీజేపీ ఎంతలా ఒత్తిడి చేస్తుంది? జనసేనకు ఈ సారైనా చాన్స్ వస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా ఉందని అంటున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఒకసారి మూడు స్థానాలకు మరోసారి ఒక స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇందులో టీడీపీ రెండు, బీజేపీ రెండు స్థానాలు తీసుకున్నాయి. ఇలా ఎన్నికైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ కుమార్ ఈ ఏడాది జూన్ లో రిటైర్ కానున్నారు. అదేవిధంగా వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని పదవీకాలం పూర్తికానుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల రీత్యా వైసీపీ నుంచి తిరిగి ఏ ఒక్కరూ ఎన్నికయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం నాలుగు స్థానాలు కూటమిపార్టీలే గెలుచుకోనున్నాయి.

అయితే ఈ నాలుగు స్థానాల కోసం కూటమి పార్టీల నేతల మధ్య అప్పుడే పోటీ తీవ్రంగా ఉందని అంటున్నారు. ప్రస్తుత జాతీయ రాజకీయాల దృష్ట్యా రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. తమ పార్టీ సొంతంగా ఉన్న రాష్ట్రాలతోపాటు మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం ఎక్కువ రాజ్యసభ స్థానాలు కావాలని బీజేపీ ఆశిస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన రెండు రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలు తీసుకుందని అంటున్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా రెండు స్థానాలు కావాలని బీజేపీ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కూటమిలోని టీడీపీ, జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.

ముఖ్యంగా టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు, గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన త్యాగరాజులు రాజ్యసభ అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అదేసమయంలో జనసేన సైతం ఈ సారి రాజ్యసభ సీటును తీసుకుని తొలిసారి పెద్దల సభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ రెండు పార్టీలకు బీజేపీ నుంచి వస్తున్న ప్రతిపాదనే షాకిస్తోందని అంటున్నారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నప్పటికీ, టీడీపీ, జనసేన పార్టీలకన్నా ఎక్కువ స్థానాలు ఆశించడమే ఆ రెండు పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మేరకు త్వరలో రిటైర్ అయ్యే నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరైన రిలయన్స్ సంస్థలకు చెందిన పరిమళ్ నత్వానీని మళ్లీ రాజ్యసభకు పంపాలని బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. పారిశ్రామిక వర్గాలను ప్రోత్సహించడంలో భాగంగా పరిమళ్ నత్వానీని ఏపీ నుంచి రెండోసారి నామినేట్ చేయాలని బీజేపీ ప్రతిపాదిస్తోందంటున్నారు. ఇక మిగిలిన మూడు ఖాళీలను మూడు పార్టీలు పంచుకోవాలని బీజేపీ సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రతిపాదనను టీడీపీ, జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. పరిమళ్ నత్వానిని మరోసారి కొనసాగించడాన్ని నిరసించడమే కాకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ ఎన్నుకోవాల్సివస్తే ఆ సీటును బీజేపీ కోటా కింద పరిగణించాలని అంటున్నారు.

ఇదేసమయంలో మరికొందరు సీనియర్లు ఈ సారి బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదని కోరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీకి రెండు స్థానాలు కేటాయించినందున త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన నాలుగు స్థానాలు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. జనసేనకు ఒకటి, టీడీపీ మూడు స్థానాలు చొప్పున పంచుకుంటే సమన్యాయం జరుగుతుందని అంటున్నారు. టీడీపీ కోటా కింద వచ్చే మూడు స్థానాల్లో ఒకటి సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కు కేటాయించే అవకాశం ఉన్నందున, కొత్తగా ఇద్దరికే అవకాశం దక్కుతుందని, ఈ కారణంగా పార్టీ హైకమాండ్ ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ ఒత్తిడికి తలొగ్గకూడదని కోరుకుంటున్నారు.