రాజ్యసభకు ఆ నలుగురూ ?
ఇక రాజ్యసభ అంటే పెద్దల సభ. ఆరేళ్ల పాటు పదవీ కాలం ఎంపీలకు ఉండే సభ. దాంతో రాజ్యసభకు వెళ్ళాలని చాలా మందికి కోరికగా ఉంటుంది.
By: Satya P | 5 Feb 2026 4:00 AM ISTఏపీలో ఈ జూన్ లో నాలుగు రాజ్యసభ సీట్లకు ఖాళీలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు స్థానల నుంచి పదవీ విరమణ చేస్తున్న వారిలో వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యారామిరెడ్డి, పరిమళ నత్వానీ ఉన్నారు. టీడీపీ నుంచి సానా సతీష్ కూడా రిటైర్ కాబోతున్నారు. ఇక రాజ్యసభకు ఏర్పడిన ఈ నాలుగు ఖాళీలలో కూటమి నుంచే ఈసారి అభ్యర్థులు గెలవనున్నారు. దానికి కారణం కూటమికి మొత్తం అసెంబ్లీలో 175 సీట్లకు గానూ 164 ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యేల మద్దతు బలంగా ఉండడంతో కూటమి పార్టీలదే ఈసారి పెద్దల సభ అన్నది నిర్ధారణ అవుతోంది.
రేసులో ఎంతో మంది :
ఇక రాజ్యసభ అంటే పెద్దల సభ. ఆరేళ్ల పాటు పదవీ కాలం ఎంపీలకు ఉండే సభ. దాంతో రాజ్యసభకు వెళ్ళాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. టీడీపీలో అయితే అధికంగా పోటీ ఉంది అని అంటున్నారు. మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు, అలాగే వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వంటి వారి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి చూస్తే పరిమళ్ నత్వానీ మరోసారి రాజ్యసభకు బీజేపీ కోటా నుంచి ఏపీ ద్వారా నెగ్గాలని చూస్తున్నారు. జనసేన నుంచి చూస్తే పేర్లు ఎన్నో ఉన్నా ఆ పార్టీ తరఫున ఎవరు అన్నది అధినాయకత్వం ఆలోచించనుంది.
ఇదీ పరిస్థితి :
అయితే పేరుకు నాలుగు సీట్లు అని కనిపిస్తున్నా అందులో టీడీపీకి దక్కేవి రెండే అని అంటున్నారు. అందులో ఒకటి జనసేనకు ఈసారి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా పెద్దల సభకు జనసేన నుంచి ప్రాతినిధ్యం లేదు, దాంతో ఆ విధంగా మిత్ర పక్షానికి అవకాశం ఇవ్వనున్నారు. అలాగే బీజేపీకి ఒక సీటు ఇస్తారని అంటున్నారు. టీడీపీలో చూస్తే సానా సతీష్ కే మరోసారి రెన్యూవల్ చేస్తారు అని అంటున్నారు. ఆయన ఏణ్ణర్ధం క్రితమే రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ తన పదవికి రాజీనామా చేస్తే ఆ సీటు నుంచి సానా సతీష్ 2024లో గెలిచారు. సో ఆయనకు కచ్చితంగా ఫుల్ టెర్మ్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. పోతే ఒకే ఒక్క సీటు టీడీపీ నుంచి ఉంది.
అభ్యర్థులు వీరేనంటూ :
ఇలా మొత్తంగా చూస్తే రాజ్యసభలో నాలుగు ఖాళీలు ఉంటే టీడీపీ నుంచి ఉన్న ఒకే ఒక్క సీటుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు కిలారు రాజేష్ సడెన్ గా రేసులోకి దూసుకుని వచ్చారు అని అంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. యువ నేతగా పోఅరుంది, నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో కూడా ఆయన ముఖ్య పాత్రను పోషించారు. ఐటీడీపీ వింగ్ ని ఆయన చూస్తూ పార్టీలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారని సో యువకులకు చాన్స్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాంతో ఆయన పేరు పరిశీలనలో ఉందని ప్రచారం అయితే సాగుతోంది. ఇక జనసేన నుంచి చూస్తే లింగమనేని రమేష్ పేరు అయితే గట్టిగా వినిపిస్తోంది. ఆయనకే ఆ పార్టీ నుంచి చాన్స్ తప్పకుండా ఉంటుందని అంటున్నారు. బీజేపీ నుంచి పరిమళ్ నత్వానీని మరోసారి రాజ్యసభకు పంపిస్తారు అని అంటున్నారు. వైసీపీ కోటాలో ఆయన గతంలో నెగ్గినా బీజేపీ పెద్దల సిఫార్సుతోనే అది జరిగింది అని ఆనాడు ప్రచారంలో ఉంది. మొత్తం మీద చూస్తే సానా సతీష్, కిలారు రాజేష్, లింగమనేని, పరిమళ్ నత్వానీ ఈసారి రాజ్యసభకు ఏపీ కోటాలో వెళ్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. మరి ఏమి జరుగుతుంది, ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది అన్నది ముందు ముందు తేలనుంది.
