Begin typing your search above and press return to search.

ఏపీ కలెక్టర్ల సదస్సులో సర్కారుపై సర్వే రిపోర్టు ఇదే

కూటమి సర్కారు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలో ఒకటైన అన్నక్యాంటీన్లలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని 82.5 శాతం మంది.. 17.5 శాతం మంది బాగోలేదని అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.

By:  Garuda Media   |   17 Sept 2025 11:03 AM IST
ఏపీ కలెక్టర్ల సదస్సులో సర్కారుపై సర్వే రిపోర్టు ఇదే
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల పని తీరు.. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న అంశంపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేకు సంబంధించిన రిపోర్టును ఇందులో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలో పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గడిచిన మూడు నెలల్లో పరిస్థితి ఏమిటన్న దానిపై ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వెల్లడించారు.

కూటమి సర్కారు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలో ఒకటైన అన్నక్యాంటీన్లలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని 82.5 శాతం మంది.. 17.5 శాతం మంది బాగోలేదని అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఆహార నాణ్యత బాగుందని 78.3 శాతం..బాగోలేదని 21.7 శాతం మంది చెప్పినట్లు తెలిపారు. పింఛన్ల పంపిణీపై అత్యధికులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. పింఛనల పంపిణీలో అధికారుల తీరు బాగుందని 87.3 శాతం మంది చెప్పగా.. మొదటి ఏడాదితో పోలిస్తే గడిచిన మూడు నెలల్లో పింఛన్ల పంపిణీ మెరుగుపడినట్లుగా సర్వే తేలినట్లుగా పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అవినీతి ఉన్నట్లుగా 12.5 శాతం మంది వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి స్లాట్ బుకింగ్ సజావుగా సాగుతున్నట్లుగా 65.3 శాతం మంది పేర్కొనగా.. 36.8 శాతం మంది అవినీతి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమస్యలు ఉన్నట్లుగా 32.7 శాతం మంది పేర్కొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు 24.7 శాతం మంది.. నోటీసులు ఇవ్వలేదని 43.5 శాతం మంది.. ఫీల్డ్ విచారణ చేపట్టలేదని 41.8 శాతం మంది చెప్పినట్లుగా వెల్లడైంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జరుగుతున్నట్లుగా 62.8 శాతం మంది పేర్కొంటే.. ఓల్డేజి తగినంతగా లేదని 43.6 శాతం మంది పేర్కొన్నారు.

విత్తనాలు సకాలంలో అందటం లేదని 35 శాతం మంది.. నాణ్యత సరిగా లేదని 37 శాతం మంది రైతులు పేర్కొన్నట్లుగా తెలిపారు.దీపం పథకం కింద ఉచిత సిలిండర్ల సరఫరా చేసే డెలివరీ బాయ్స్ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లుగా 39 శాతం మంది పేర్కొనగా.. వారి ప్రవర్తన బాగుందని 78.9 శాతం మంది పేర్కొన్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లలో పారిశుద్ధ్య నిర్వహణ.. సీటింగ్ విధానం బాగోలేదని 43.7 శాతం మంది.. తాగునీటి సదుపాయం లేదని 46.9శాతం మంది.. టాయిలెట్ల నిర్వహణ బాగోలేదని 41.8 శాతం మంది పేర్కొన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇసుక తగినంత అందుబాటులో ఉన్నట్లుగా 65.6 శాతం మంది పేర్కొంటే.. దొరకట్లేదని 34.4 శాతం మంది అభిప్రాయపడినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా కూటమి పాలన బాగుందన్నట్లుగా సర్వే రిపోర్టులోని అంశాలు వెల్లడించటంతో పాటు.. నెగిటివ్ అంశాల్ని సైతం సరైన రీతిలో ప్రస్తావించారన్న అభిప్రాయం వ్యక్తమైందని చెప్పాలి.