Begin typing your search above and press return to search.

వైసీపీ కొత్త కూటమికి రంగం సిద్ధం ?

ఏపీలో టీడీపీ కూటమి ఉంది. అధికారంలో కూడా కొనసాగుతోంది. అందులో మూడు పార్టీలు ఉన్నాయి. టీడీపీ బీజేపీ జనసేన కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి.

By:  Satya P   |   25 Sept 2026 7:00 PM IST
వైసీపీ కొత్త కూటమికి రంగం సిద్ధం ?
X

ఏపీలో టీడీపీ కూటమి ఉంది. అధికారంలో కూడా కొనసాగుతోంది. అందులో మూడు పార్టీలు ఉన్నాయి. టీడీపీ బీజేపీ జనసేన కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయి. ఈ పార్టీలు 56 శాతం ఓటు షేర్ ని 2024 ఎన్నికల్లో సాధించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని చూస్తున్నాయి. 2029 లో కేంద్రంలో ఏమైనా మార్పు వస్తే తప్ప ఈ కూటమి అదే తీరున సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఏపీలో అధికారం వైపు ఉన్న పార్టీల పిక్చర్ క్లియర్ గా ఉంది. ఇక విపక్షం వైపు చూస్తే అన్నీ ఎవరికి వారుగా ఉన్నారు. ఒకసారి అధికారంలోకి వచ్చి రెండు సార్లు ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పక్షం వైసీపీయే దీనికి లీడ్ తీసుకోవాల్సి ఉంది. అయితే వామపక్షాల వైపు నుంచి సంకేతాలు సానుకూలంగా రావడంతో ఇప్పుడు ఏపీలో వైసీపీ నాయకత్వంలో కొత్త కూటమి దిశగా అడుగులు పడుతున్నాయా అన్న చర్చ నడుస్తోంది.

సీపీఐ ప్రకటన :

ఏపీలో తాము వైసీపీతో కలిసి ఉమ్మడి పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చెప్పడం విశేషం. దీంతో సీపీఐ వైసీపీ కలిసేందుకు మార్గం సుగమం అయింది. సీపీఎం కూడా మరో వైపు ఉంది. ఆ పార్టీ సైతం జత కడితే ఏపీలో కొత్త రాజకీయ కూటమికి నాంది పలికినట్లు అవుతుంది. ఏపీలో కాంగ్రెస్ ఇతర పార్టీలు ఉన్నాయి. కానీ వామపక్షాలు వైసీపీ వైపు వస్తే ఏపీలో రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకుంటాయని అంటున్నారు. వైసీపీకి ఉన్న సంస్థాగత బలం అలాగే వామపక్షాల పోరాట పటిమ జత కలిస్తే ఏపీలో అధికార కూటమికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఢీ కొట్టడమే :

రాజకీయాల్లో మారుతున్న పరిణామాలలో కూటములు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక పార్టీ ఆలోచనల కన్నా కూటమిలతో సాగితే వచ్చే ప్రయోజనాలు వేరు అని అంటున్నారు. ఏపీలో చూసుకుంటే వామపక్ష పార్టీలకు ఎంత శాతం ఓటు షేర్ ఉంది అన్నది ప్రశ్న కాదని అంటున్నారు. జనంలోకి వెళ్ళి ప్రభుత్వం మీద పోరాటాలు చేయడంలో ఎర్ర పార్టీలు ముందు ఉంటాయి. అనేక అనుబంధ సంస్థలు కూడా వాటికి ఉండడం వల్ల కూడా ఉద్యమాల ద్వారా మరింతగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించవచ్చు అని అంటున్నారు. ఏపీలో బీజేపీతో కలసిన టీడీపీ జనసేనల పట్ల వామపక్షాలు గుర్రుగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ చెలిమి కొనసాగే అవకాశాలు ఉండటంతో వామపక్షాలు కూడా కొత్త దారులు వెతుక్కుంటున్నాయని అంటున్నారు. ఇప్పటికి మూడు ఎన్నికలు విభజన ఏపీలో జరిగితే వామపక్షాలు నుంచి ప్రతినిధి అయితే అడుగు పెట్టలేకపోయారు గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా తమ సత్తాను చాటాలని ఈ పార్టీలు చూస్తున్నాయని చెబుతున్నారు.

కాంగ్రెస్ సంగతి ఏమిటి :

అయితే వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి. కాంగ్రెస్ అక్కడ జాతీయ స్థాయిలో విపక్ష శిబిరానికి పెద్దన్నగా ఉంది. ఏపీలో చూస్తే వైసీపీ నాయకత్వంలో కూటమిలో చేరడానికి కాంగ్రెస్ కి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ వైసీపీ ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది అన్నదే కీలకం అంటున్నారు. వైసీపీ అయితే తమ భాగస్వామ్యం కానీ స్నేహాన్ని కానీ వామపక్షాలకే పరిమితం చేసే అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అందువల్ల ఏపీలో కాంగ్రెస్ కి కొత్త నాయకత్వం వచ్చి పరిస్థితి జాతీయ స్థాయిలో వేరే విధంగా మారితే అపుడు కాంగ్రెస్ సైతం ఈ వైపునకు వచ్చినా రావచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో విపక్ష శిబిరంలో తాజా పరిణామాలు చూస్తే కొత్త విషయమే అని అంటున్నారు.