Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తో జగన్ పొత్తు...చెప్పింది ఎవరంటే ?

ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన రాజకీయ విధానాలను మార్చుకుంటున్నారా.

By:  Satya P   |   27 Sept 2026 9:24 AM IST
కాంగ్రెస్ తో జగన్ పొత్తు...చెప్పింది ఎవరంటే ?
X

ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన రాజకీయ విధానాలను మార్చుకుంటున్నారా. ఎన్డీయే పట్ల మెతక వైఖరికి క్రమంగా స్వస్తి పలికి ఫుల్ క్లారిటీతో ముందుకు అడుగులు వేస్తున్నారా ఇవి ఇటీవల జరుగుతున్న రాజకీయ చర్చలు. దానికి కారణాలు ఉన్నాయి. ఆయన ఈ తాజాగా చేస్తున్న ట్వీట్లు చూస్తే ఇండియా కూటమి కాంగ్రెస్ పక్షాలు చేసిన విమర్శలే అందులో ఉంటున్నాయని అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విషయంలో జగన్ చేసిన ట్వీట్ అయితే కొంత సంచలనం రేపింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాల విషయంలో చేసిన చట్టాన్ని తిరిగి సమీక్షించాలని ఆయన కేంద్రానికి చేసిన సూచనలు కూడా చర్చకు తావిస్తున్నాయి. దీంతో వైసీపీ పొలిటికల్ స్టాండ్ టర్న్ తీసుకుంటోంది అన్నది అయితే అంతటా చర్చించుకునే నేపథ్యం ఉంది.

మాట మారుస్తున్నారు అంటూ :

ఇదిలా ఉంటే జగన్ తన మాటలను మారుస్తున్నారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణపై జగన్ ది ద్వంద్వ వైఖరి అని ఆయన మండిపడ్డారు. దానికి ఉదాహరణగా జగన్ గతంలో కోర్టులో ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడటమే అని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాదు ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై జగన్ మాట మార్చారని నిందించారు. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ సరిగ్గా జరగలేదన్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం దానిని ప్రమాణంగా తీసుకోవాలని కోర్టులో కేసు ఎందుకు వేశారని ప్రశ్నించారు.

ఆనాడు మద్దతు ఇచ్చి :

ఇక 2023లో ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వైసీపీ మద్దతు ఇచ్చిన సంగతిని జగన్ మరచారా అని లావు నిలదీశారు. ఇపుడు ఆయన ఆ చట్టాన్ని తిరిగి సమీక్షించమని కోరడమేంటని ప్రశ్నించారు. ఇపుడు మళ్లీ భారత ప్రధాన న్యాయమూర్తిని ప్యానెల్ లో పెట్టాలని కోరుతున్నారని సెటైర్లు వేశారు. ఇలా జగన్ తన స్టాండ్ ని తరచూ మార్చుకోవడం పట్ల లావు మండిపడ్డారు. అయితే దీని వెనక జగన్ రాజకీయ ఆలోచనలు వ్యూహాలు వేరేగా ఉన్నాయని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ కోసమే :

జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే 2029లో కాంగ్రెస్‌తో పొత్తు కోసమే అని లావు అసలు నిజం ఇదీ అంటున్నారు. అందుకే జగన్ తన వ్యూహాలని మారుస్తున్నారని విమర్శించారు. దీనిని బట్టి చూస్తూంటే జగన్ ది రాజకీయ అవకాశవాదంగా ఉందని ఆయన తప్పు పట్టారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా తరచూ విధానాలను మార్చుకుంటున్నారు అని లావు ఎత్తి చూపించారు. కాంగ్రెస్ తో పొత్తు కోసం ఈ విధంగా జగన్ చేస్తున్నారు అని అనుమానించాల్సి వస్తోందని అన్నారు. తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ తో రాజకీయంగా కలవాలని జగన్ డిసైడ్ అయి ఈ విధంగా తన వ్యూహాలను మార్చుకుంటున్నారా అన్నది ఆయనే చెప్పాలని లావు డిమాండ్ చేశారు. మరి జగన్ కాంగ్రెస్ తో 2029 లో కలుస్తారు పొత్తు పెట్టుకుంటారు అని అంటున్న టీడీపీ ఎంపీ లావు చెప్పింది నిజమవుతుందా లేక ఆయన రాజకీయ విమర్శలుగానే చేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.