మూడేళ్ళకు ముందే రాజుకున్న కాక
ఏపీకి సంబంధించిన సమస్యల మీద ఒక్కటిగా కేంద్రంతో పోరాడి సాధించిన పార్టీలు తమలో తాము కలహించుకోవడం వల్ల రాష్ట్రమే నష్టపోతోంది అని అంటున్నారు.
By: Satya P | 7 Feb 2026 12:28 PM ISTరాజకీయాలు అంటే ఒకప్పుడు ఎన్నికల వేళలో ఆవేశకావేశాలు కనిపించేవి. వారూ వీరూ అలా శిబిరాలుగా మోహరించి మాటల యుద్ధానికి సిద్ధపడేవారు. అది కూడా నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు జరిగేంతవరకూ మాత్రమే. గట్టిగా అంటే ఒక నెల రోజులు అనుకోవచ్చు. కానీ గత కొంతకాలంగా రాజకీయం ట్రెండ్ మారుతోంది. ఎన్నికల నుంచి ఎన్నికలు అన్న విధానం అమలు అవుతోంది. ఉమ్మడి ఏపీకి వైఎస్సార్ కాంగ్రెస్ సీఎం గా ఉండగా 2009లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ కి ఏపీ అసెంబ్లీలో బొటాబొటీ సీట్లు దక్కాయి. ఆ తర్వాత పార్టీ వారితో మాట్లాడుతూ వైఎస్సార్ 2009 అయిపోయింది, ఇక 2014 మీద అందరూ ఫోకస్ పెట్టాలి, పూర్తి స్థాయిలో పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలా మొదలైన ఈ ముందస్తు ఎన్నికల హడావుడి ఇప్పటికి ఇంకా పీక్స్ కి చేరింది.
ఓడిన వారే కాదు :
రాజకీయాల్లో ఓడిన వారు ఎపుడూ ఎన్నికలు కోరుకుంటారు. వెంటనే పెడితే తమకు కలసి వస్తుందని వారు భావిస్తారు. ఈసారి పొరపాట్లు జరగవని తామే తప్పకుండా గెలుస్తామని కూడా ఆశలు పడతారు. కానీ చిత్రంగా అధికార పార్టీలలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. కళ్ళ ముందు అధికారం ఉంది, దానిని అనుభవించకుండా వచ్చే ఎన్నికలకు అంటూ క్యాడర్ ని లీడర్లను సమాయత్తం చేసే పనిలో బిజీ అవుతున్నారు. దీంతో నోటిలోకి ముద్ద వెళ్ళకుండానే మళ్ళీ వంటా వార్పు సరకూ సరంజామా అని పరిగెత్తించేలా ఉందని క్షేత్ర స్థాయిలో వినిపిస్తోంది.
ప్రజల మూడ్ చూస్తే :
ఇక ప్రజలు అయితే ఎన్నికల గురించి పెద్దగా ఆలోచించరు, వారు పోలింగ్ కి ముందు కొన్ని రోజుల నుంచే ఆ వైపుగా ఫోకస్ పెడతారు. ఇక ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తమ పనిలో తాము తీరిక లేకుండా ఉంటారు. మళ్ళీ అయిదేళ్ళకే తమకు పని అని కూడా అనుకుంటారు. కానీ వర్తమాన రాజకీయం చూస్తే జనాలకు సైతం ఊపిరాడనివ్వడం లేదు అని అంటున్నారు. రాజకీయ సభలు ర్యాలీలు, మీటింగులు, హడావుడి, సవాళ్ళు ప్రతి సవాళ్ళు, దాడులు ప్రతి సవాళ్ళు ఇలా రాజకీయం వేడెక్కిపోతూ ఉంటే జనాలు సైతం ఇదేమి తీరు అని చికాకు పడే పరిస్థితి వస్తోంది.
ఎన్నికల వాతావరణంగా :
ఏపీలో చూస్తే ఎన్నికల వాతావారణం ఆ వేడి తలపించేలా గుంటూరు విజయవాడలలో మాజీ మంత్రుల ఇళ్ల మీద జరిగిన దాడులు కనిపించాయని అంటున్నారు. దాంతో పాటు వైసీపీ నేతలు భారీ ర్యాలీలు తీసి జన జీవనానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు అన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. ప్రభుత్వం తన పని తాను చేయాలి, అభివృద్ధిని ప్రజలకు వివరించాలి, విపక్షాలు ప్రజల సమయల మీద పోరాడాలి, వారికి అవసరమైన వాటి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కానీ చూడబోతే రాజకీయం మారిపోయింది అని అంటున్నారు.
సెగ గట్టిగానే :
రాజకీయ సెగ గట్టిగానే తగులుతోంది. ఏ మూలన చూసినా ఏ సోషల్ మీడియా వేదిక చూసినా రాజకీయ వేడి ఒక స్థాయిలో ఉంటోంది, నేడో రేపో ఎన్నికలు అన్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతటి ఆవేశకావేశాలు ఒకరి మీద ఒకరు ఉసి గొలుపుకోవడాలు ఇపుడు అవసరమా అన్న చర్చ కూడా సాగుతోంది. మేమే అధికారంలోకి వచ్చేస్తామని ఒకరు అంటే మేమే ఎప్పటికీ అని మరొకరు అనుకుంటూ అసలు విషయాలను పక్కన పెడుతున్నారు అని అంటున్నారు. ఏపీ చూస్తే రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. అదే సమయంలో విభజన తరువాత ఎన్నో కష్టాలు సమస్యలతో అల్లాడిపోతోంది.
విభజన హామీల కోసం :
ఏపీకి సంబంధించిన సమస్యల మీద ఒక్కటిగా కేంద్రంతో పోరాడి సాధించిన పార్టీలు తమలో తాము కలహించుకోవడం వల్ల రాష్ట్రమే నష్టపోతోంది అని అంటున్నారు. విభజన హామీలు గురించి కేంద్ర బడ్జెట్ లో ఏముంది అన్నది కూడా ఎవరూ ఆలోచించటం లేదని అంటున్నారు. ఇతర రాష్ట్రాలలో ఉమ్మడిగా కలసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తూంటే ఏపీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది అని వేడి నిట్టూర్పులు మేధావులు సైతం విడిచే పరిస్థితి ఉంది. ఏపీలో ఈ పరిణామాలు మారాలని అంతా అంటున్నారు. ముందు తమకు ఇచ్చిన అయిదేళ్ళ కాలాన్ని సక్రమంగా అధికార పక్షం వినియోగించాలని సూచిస్తున్నారు. విపక్షం వచ్చే ఎన్నికల గురించి రాజకీయ లాభాల గురించి ఆలోచించకుండా ప్రజా పక్షం గా పనిచేయాలని కోరుతున్నారు. కానీ ఏపీలో అది జరిగే పనేనా అన్నదే అతి పెద్ద డౌట్.
