ఏపీలో ఉప ఎన్నికలు....స్కెచ్ గీస్తున్నది ఎవరు ?
ఏపీలో ఉప ఎన్నికలు జరుగుతాయా అంటే రాజకీయాలు చూస్తే అలాగే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
By: Satya P | 10 Jan 2026 9:15 AM ISTఏపీలో ఉప ఎన్నికలు జరుగుతాయా అంటే రాజకీయాలు చూస్తే అలాగే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీకి 11 సీట్లే వచ్చినా 40 శాతం ఓటు షేర్ తమకు ఉందని చెబుతోంది. దాంతో పాటు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతోంది. రూల్స్ ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా అని అధికార పక్షం చెబుతోంది. దీంతో గత ఏడాదిన్నర కాలంగా చూస్తే ఏపీలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. దాంతో అదొక రాజకీయ రచ్చగా ఉంది.
అనైతికం అంటూ :
ఇక మరో వైపు చూస్తే సభకు హాజరు కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు రిజిస్టర్ లో సంతకాలు చేసి అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. దీని మీద గతంలో సభలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు కూడా. సభలోకి వచ్చి ప్రజా సమస్యలను హుందాగా ప్రస్తావించకుండా కేవలం సంతకం చేసి వెళ్ళిపోవడమేంటి అని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులు పని చేయకపోతే జీతాలు ఎక్కడైనా ఇస్తారా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే తీరు మీద చర్యలు తీసుకోవాలని కూటమి నుంచి డిమాండ్ అయితే వస్తుంది.
వారిని కమిటీ ముందుకు :
ఇక వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం మీద కూటమి ప్రభుత్వం అయితే గుర్రుగా ఉంది. వారి విషయంలో ఎన్నిసార్లు కోరినా రావడం లేదు, దాంతో అనర్హత వేటు పడుతుందని కూడా గతంలో కొందరు నేతలు ప్రకటించారు కూడా. కానీ దానికి కూడా వైసీపీ వైపు నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు, ఇపుడు ఇంకో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు అదేంటి అంటే ఎమ్మెల్యేల నైతికత మీద. ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు చేసి వెళ్ళడం, అలాగే జీత భత్యాలు తీసుకోవడం అన్నది నైతికంగా తప్పు అవుతుందని భావించిన ఏపీ ఎథిక్స్ కమిటీ వారిని తమ కమిటీ ముందు హాజరు కావలసినదిగా నోటీసులు ఇస్తుందని అంటున్నారు.
అదే జరిగితే :
ఈ విధంగా సభకు రాకుండా సంతకాలు రిజిస్టర్ లో చేస్తున్న ఎమ్మెల్యేలు ఆరుగురు దాకా ఉంటారు అని అంటున్నారు. వారికి నోటీసులు జారీ చేసి ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరు కావాలని కోరుతారని ఆ మీదట వారి విషయంలో విచారించి చర్యలకు స్పీకర్ కి నివేదిక ఇస్తారని అంటున్నారు. దాంతో చర్యలు అంటే కచ్చితంగా వారి సభ్యత్వాలను రద్దు చేయడమే అని అంటున్నారు. స్పీకర్ కనుక యాక్షన్ తీసుకుంటే దానికి అప్పీల్ లేదని అంటున్నారు.
ఉప ఎన్నికలేనా :
ఒక వేళ స్పీకర్ కనుక ఈ ఆరుగురి విషయంలో యాక్షన్ తీసుకుంటే కనుక సభ్యత్వాలు రద్దు అయి సదరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వెంటనే వస్తాయి అని అంటున్నారు. అదే జరిగితే ఏపీలో స్థానిక ఎన్నికల కంటే ముందు మినీ ఎన్నికల సమరం మొదలవుతుందని అంటున్నారు. ఏపీలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అంటే మాటలు అయితే కాదని కూడా అంటున్నారు. తెలంగాణాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ కి ఉప ఎన్నికలు జరిగితేనే మొత్తం అంతా హీటెత్తిపోయింది. అలాంటిది ఏపీలో ఉప్పు నిప్పు లాంటి రాజకీయ వాతావరణం ఉన్న చోట ఏకంగా ఆరు చోట్ల బై పోల్ అంటే అది వేసవి వేడికి పది రెట్లు ఉంటుందని అంటున్నారు.
జరిగేనా :
అయితే ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యేలను పిలిచి ఈ విషయంలో విచారించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని మరో వైపు చర్చ సాగుతోంది. అసెంబ్లీకి రాకుండా గతంలో చాలా మంది సంతకాలు చేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు మరి కొంతమంది సభకు ఒక నమస్కారం పెట్టి ఏళ్ళ తరబడి ఆ వైపు చూడకుండా జీతభత్యాలు పుచ్చుకున్నారని గుర్తు చేశారు అది కేవలం ఏపీలోనే జరగలేదని పొరుగు రాష్ట్రాలలో కూడా జరిగిందని చెబుతున్నారు. మరి వాటికి దేనికీ లేని అభ్యంతరం వైసీపీ ఎమ్మెల్యేల విషయంలోనే రావడమేంటి అన్న చర్చ అయితే ఉంది.
ఒక వేళ అలా అనుకుని వేటు వేస్తే ఎదుర్కోవడానికి వైసీపీ ఏ మేరకు సిద్ధంగా ఉంది అన్నది ఒక చర్చ. ఇక ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఈ ఏడాదితో రెండేళ్ల సమయం అవుతుంది. సరిగ్గా ఆ సమయంలో ఉప ఎన్నికలు వస్తే ఆరుకు ఆరూ గెలిచి తీరాల్సి ఉంటుంది. అందులో ఏ ఒక్కటి ఓడినా కూడా ప్రజా వ్యతిరేకత అని వైసీపీ ప్రచారం చేసే వీలు ఉంటుంది, మరి వారికి ఆ చాన్స్ కూటమి ఇస్తుందా అన్నది మరో చర్చ. మొత్తం మీద చూస్తే వైసీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని ఉన్నా సాధ్యాసాధ్యాలను కూడా రాజకీయంగా ఇతరత్రా పరిశీలించక తప్పదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
