ఆ ఏపీ మంత్రులపై వ్యతిరేకత నిజమేనా.. పుట్టించారా.. ?
దీంతో సదరు మంత్రులు ఒకింత గాభరా చెందడం గమనార్హం. నేరుగా సీఎం చంద్రబాబు ఈ కథనాలపై స్పందించక పోయినా.. అంతర్గత చర్చల్లో మాత్రం హెచ్చరికలు చేస్తున్నారు.
By: Garuda Media | 7 May 2026 1:09 PM ISTగత కొన్నాళ్లుగా ఏపీలో కూటమికి చెందిన మంత్రుల శాఖలపై తీవ్ర కథనాలు, వార్తలు వస్తున్నాయి. ఆయా శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మంత్రులు చోద్యం చూస్తున్నారని.. శాఖలపై పట్టు కోల్పోయారని ఇలా.. అనేక కథనాలు వస్తున్నాయి. దీంతో సదరు మంత్రులు ఒకింత గాభరా చెందడం గమనార్హం. నేరుగా సీఎం చంద్రబాబు ఈ కథనాలపై స్పందించక పోయినా.. అంతర్గత చర్చల్లో మాత్రం హెచ్చరికలు చేస్తున్నారు.
కొన్నాళ్ల కిందట.. అమరావతి విషయంలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. సీఆర్‌డీఏ కేంద్రంగా జరుగుతున్న అవినీతితో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఇక్కడి రైతులను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. అయితే.. దీని లక్ష్యం.. మంత్రి నారాయణ. ఆయన శాఖ పరిధిలోనే ఉన్న సీఆర్ డీఏ.. అమరావతిపై ఈ వ్యతిరేక కథనాలు పెద్ద ఎత్తున దుమ్మురేపాయి. అయితే.. వాస్తవానికి.. పనితీరు విషయంలో నారాయణకు తిరుగులేదన్నది సీఎం కూడా చెబుతున్నారు.
అయినా.. ఆయనపై మాత్రం కథనాలు ఆపడం లేదు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చకు దారి తీసింది. ఇక, మరో మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ, ఈయనపై కూడా ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత ఏర్పడిందని.. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేస్తున్నారన్నది సారాంశం. అదేసమయంలో విధుల్లో డాక్టర్లు అలసత్వం వహిస్తున్నారని, చెప్పకుండానే సెలవులు పెడుతున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారన్నది కథనాలు చెబుతున్న మాట.
ఈ క్రమంలో తాజాగా 51 మంది వైద్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇలానే మరో కీలక మంత్రి శాఖ పైనా ఆరోపణలు .. వివాదాలు తలెత్తాయి. వీటిపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. అసలు ఏం జరుగు తోందన్న విషయాన్ని ప్రభుత్వం ఆరా తీస్తోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయని పసిగట్టారు.
1) మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు.. నేతలు.. ఆయా శాఖలపై కథనాలు రాయిస్తున్నారు.
2) సొంతపార్టీ నాయకులే.. లీకులు ఇస్తున్నారు. ఇలా.. చేయడం ద్వారా ఆయా శాఖల మంత్రులను పక్కన పెట్టి తమకు అవకాశం కల్పిస్తారన్నది యోచనగా ఉందట. చిత్రం ఏంటంటే.. ఇలాంటి నాయకులు.. ప్రత్యర్థి మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటున్నారని తెలిసింది. అందుకే చంద్రబాబు ఇలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
