Begin typing your search above and press return to search.

ప్ర‌స్తుతం నుంచి గ‌తంలోకి... ఏపీ రాజ‌కీయాలు యూట‌ర్న్‌..!

ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా రెండు కీలక విషయాలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

By:  Garuda Media   |   10 April 2026 8:00 PM IST
ప్ర‌స్తుతం నుంచి గ‌తంలోకి... ఏపీ రాజ‌కీయాలు యూట‌ర్న్‌..!
X

ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా రెండు కీలక విషయాలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఒకటి.. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన మావిగన్ రాష్ట్ర రాజధానిగా ఉంటే తప్పేముందని చేసిన వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఇది తీవ్రంగా ట్రోల్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే వైసిపి దీన్ని సమర్థించుకోవడం దీనికే ప్రజలు ముగ్గు చూపుతున్నారని ప్రకటించడం మరో వివాదానికి దారి తీసింది.

ఇక ఓ పత్రికలో వచ్చిన వ్యాఖ్యలు వైసిపి రాజకీయాలను రోడ్డెక్కించింది. తద్వారా ఏపీలో ఈ రెండు విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు అంశాలు ప్రాతిపదికగా చేసుకొని ఇటు అధికారపక్షం అటు ప్రతిపక్షం కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ప్రస్తుత రాజకీయాల నుంచి గతంలోకి నాయకులు ప్రవేశించారు. ఎప్పుడో 2009లో జరిగిన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతర పరిణామాలు మరోసారి వెలుగులోకి వ‌చ్చాయి.

ఈ క్రమంలోనే అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్న బొత్స‌ సత్యనారాయణ కన్నీరు పెట్టుకోవడం వంటివి రాజకీయంగా ఆసక్తికి దారితీసాయి. కానీ ప్రజలు ఇవన్నీ కోరుకుంటున్నారా అనేది ఇప్పుడు ముఖ్య విషయం. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి జరుగుతోంధి. అదే స‌మ‌యంలో సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గతాన్ని తొవ్వుకున్నంత మాత్రాన ఇప్పటికిప్పుడు జరిగే ప్రయోజనం కానీ, ఇప్పటికిప్పుడు మారే వ్యవస్థలు కానీ ఏమీ లేవు. ఇటు అధికారపక్షమైనా అటు వైసీపీ నాయకులైనా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. గతాన్ని తొవ్వుకొని వర్తమానాన్ని దానికి జోడించడం వల్ల ప్రధానమైన సమస్యలపై దృష్టి మళ్లించినట్టే అవుతుందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రస్తుతం విత్తనాలు ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎండాకాలం ముసురుతోంది. దీంతో నీటి ఎద్దడి చాలా ప్రాంతాల్లో గతంలో ఉన్నట్టుగానే ఇప్పటికీ ఉంది.

అదేవిధంగా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ వదిలేసి కేవలం రాజకీయ విమర్శలకు రాజకీయ ప్రాధాన్యాలకు నాయకులు మొగ్గు చూపడం అనేది సరైన విషయం కాదని పరిశీలకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వైసిపి కంటే కూడా కూటమి పార్టీల నాయకులు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. వైసీపీ ట్రాప్ లో చెప్పుకోకుండా కూటమి నేతలు అదే విధంగా ప్రభుత్వం ప్రజల కోణంలో ఆలోచించి ఆ దిశగా అడుగులు వేయకపోతే లేనిపోని విషయాలను నెత్తిన పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం కన్నా వైసిపి కోరుకుంటున్న వ్యతిరేక భావనలే కనిపిస్తాయి.

ప్రస్తుతం నుంచి గతంలోకి ఏపీ రాజకీయాలు యూటర్న్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే కూడా నష్టపోయేదే ఎక్కువగా ఉంటుందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఏది ఏమైనప్పటికీ ఈ రాజకీయాలకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి... ప్రజా సమస్యల విషయంపై దృష్టి పెడితే ఇరు వర్గాలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.