Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రలో వారసుల ఎంట్రీ.. రిటైర్మెంట్ జాబితాలో బడా నేతలు

శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన సోదరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తన మనోగతాన్ని బయటపెట్టారు.

By:  Tupaki Political Desk   |   5 Oct 2025 4:00 AM IST
ఉత్తరాంధ్రలో వారసుల ఎంట్రీ.. రిటైర్మెంట్ జాబితాలో బడా నేతలు
X

ఏపీ రాజకీయాల్లో సమూల మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలువురు సీనియర్లు విశ్రాంతి కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు తమ వారసులను రంగంలో దించాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనే విరామం తీసుకోవాలని భావించిన కొందరు తమ బదులుగా కుమారులు, కుమార్తెలను బరిలో దింపాలని ప్లాన్ చేసినా అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల టీడీపీ, వైసీపీల్లో ఏ పార్టీ కూడా అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు సీనియర్లు వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులకు మద్దతుగా వెనకుండి రాజకీయాలు నడిపించాలని భావిస్తున్నారు.

ఉత్తరాంధ్రలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలో చాలా మంది కీలక నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన సోదరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తన మనోగతాన్ని బయటపెట్టారు. క్రిష్ణదాస్ తమ్ముడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం వచ్చే ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడును తెరపైకి తేవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జిల్లా రాజకీయాల్లో ధర్మాన పాత్రను తీసివేయలేని పరిస్థితుల్లో ఆయననే కొనసాగాలని పార్టీ ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి ధర్మాన వయసు 70 ఏళ్లకు చేరుకోవడం వల్ల రిటైర్మెంట్ కోరుకుంటున్నారని అంటున్నారు.

ధర్మాన సోదరుల మాదిరిగానే ఆమదాలవలస నుంచి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం ఎన్నికల రాజకీయాలకు దూరమైనట్లేనని అంటున్నారు. అయితే ఈయన కుమారుడికి చాన్స్ వస్తుందా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత విభేదాల వల్ల కొత్త నాయకుడికి సమన్వయకర్తగా అవకాశం ఇచ్చారు. మరోవైపు అధికార పార్టీ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు వారసుడు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతనికి వచ్చే ఎన్నికల్లో చాన్స్ కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో అధికార పార్టీ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టివ్ గా తిరుగుతున్నారు. కళా కూడా దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయం పూర్తి చేయడంతో రిటైర్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కుటుంబంలో ఇద్దరు వారసులు పోటీ పడటం వల్ల ఎవరికి వారసత్వ పగ్గాలు దక్కుతాయనేది సస్పెన్స్ గా మారింది.

మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స కుమారుడు డాక్టర్ బొత్స సందీప్ పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లోనే బొత్స తప్పుకుని కుమారుడిని పోటీకి పెట్టాలని భావించినా, వైసీపీ అంగీకరించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో బొత్స సందీప్ ఎంట్రీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా విశాఖ జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తమ వారసులకు పగ్గాలు అప్పగించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ 1983 నుంచి టీడీపీలో కొనసాగుతున్నవారే. వయోభారంతో తాము తప్పుకుని వారసులను ఎమ్మెల్యేలు చేయాలని ఈ ఇద్దరు నేతలు ఆశిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ అంగీకరించలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో అయినా వారికి చాన్స్ వదిలేయాలని అయ్యన్నపాత్రుడు, సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. ఇలా మొత్తంగా రెండు పార్టీల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురు కీలక నేతలు వచ్చే ఎన్నికల ముఖచిత్రంలో కనిపించకపోవచ్చునని అంటున్నారు.