Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వం.. రెండేళ్ల‌లో ఇంత అసంతృప్తా...?

శాఖ‌ల‌కు మంత్రులుగా ఎవ‌రు ఉన్నా .. జిల్లాల ప‌రంగా ప‌వ‌ర్ ఫుల్ వ్య‌క్తులు లేక‌పోతే ఖ‌చ్చితంగా అది ఎన్నిక‌ల‌పై, జిల్లా అభివృద్ధిపై ప్ర‌భావం చూపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Garuda Media   |   21 July 2026 10:00 PM IST
ఏపీ ప్ర‌భుత్వం.. రెండేళ్ల‌లో ఇంత అసంతృప్తా...?
X

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఇటీవ‌లే రెండేళ్లు పూర్తి చేసుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా కేవ‌లం 11 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిన వైఎస్సార్‌సీపీ అస‌లు ఇప్ప‌ట్లో పుంజుకుంటుందా ? ఆ పార్టీ కేడ‌ర్ రోడ్డెక్కుతారా ? అన్న సందేహాలు అంద‌రిలోనూ క‌లిగాయి. కానీ ఆశ్చ‌ర్యంగా రెండేళ్ల‌కే ఆ పార్టీ నాయ‌క‌త్వం ఇస్తోన్న పిలుపున‌కు వైసీపీ కేడ‌ర్ ఉత్సాహంగా రోడ్లెక్కేస్తున్నారు. వైసీపీ ఇంత త్వ‌ర‌గా కోలుకుని మూడు పార్టీల కూట‌మి ప్ర‌భుత్వంతో ఢీ అంటే ఢీ అనే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. దీనికి చాలా కార‌ణాలు, త‌ప్పులు క‌నిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం అయిపోయింది. ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ ముఖ్య‌మంత్రి లేదా త‌మ పార్టీ అధినేత‌లు చెప్పిన‌ట్టు వినే ప‌రిస్థితి లేదు. ఈ విష‌యంలో ప‌రిస్థితి చేయిదాటిపోయింది.

చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఈ సారి త‌న కేబినెట్లో కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చారు. వాళ్ల‌లో ఎక్కువ మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారు కూడా ఉన్నారు. వీళ్లు త‌మ శాఖ‌ల ప‌రంగా ప‌ట్టు సాధించ‌డంలోనూ , ఇటు పార్టీకి ఉప‌యోగ‌ప‌డ‌డంలోనూ దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నారు. తెలుగుదేశం నుంచి కేబినెట్ మంత్రులుగా ఉన్న వారిలో ఏకంగా 13 మంది కొత్త‌వాళ్లే ఉన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇదే కేబినెట్‌తో చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు వెళితే ఖ‌చ్చితంగా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులు త‌మ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో సంభాషించుకుంటున్నారు.

శాఖ‌ల‌కు మంత్రులుగా ఎవ‌రు ఉన్నా .. జిల్లాల ప‌రంగా ప‌వ‌ర్ ఫుల్ వ్య‌క్తులు లేక‌పోతే ఖ‌చ్చితంగా అది ఎన్నిక‌ల‌పై, జిల్లా అభివృద్ధిపై ప్ర‌భావం చూపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నిక‌ల‌కు మ‌రో మూడేళ్ల టైం కూడా లేదు.. అందుకే డైన‌మిక్‌గా ఉండేవాళ్ల‌కే కేబినెట్లో చోటు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. కేబినెట్లో ఉన్న మంత్రుల్లో ఎక్కువ మంది మంత్రుల ప‌నితీరుపై కూడా చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ ఎంత‌మాత్రం సంతృప్తిగా లేర‌ని అంటున్నారు. ద‌స‌రాకు కాస్త అటూ ఇటూగా కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఫ‌స్ట్ టైం ఛాన్స్ మిస్ అయ్యిన వారికి రెండో విడ‌త‌లో ఖ‌చ్చితంగా ఛాన్స్ ఇస్తార‌ని అంటున్నారు.

తొలిసారి కేబినెట్లో చోటు దక్కించుకున్న వాళ్లలో అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, సుభాష్, సవిత, టి జీ భరత్, బి సి జనార్దన్ రెడ్డి , నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యా రాణి, డోలా బాల వీరాంజనేయ స్వామి ఉండ‌గా.. వీరిలో స‌గానికి పైగా మంత్రుల ప‌నితీరు అస‌లు ఏ మాత్రం బాగోలేదంటున్నారు. విచిత్రం ఏంటంటే సీనియ‌ర్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న‌చోట కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రెవెన్యూ, విద్యుత్ శాఖ‌, ఆర్థిక‌శాఖల‌పై కూడా ప్ర‌జ‌ల్లోనూ, ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో అంత సంతృప్తి లేదంటున్నారు.

ఇక అన్నింటింకి మించి కూట‌మి ప్ర‌భుత్వంలో బిల్స్ వైసీపీ నేత‌లు చెప్పిన వాళ్ల‌కు క్లీయ‌ర్ అవుతున్నాయ‌న్నది బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. టీజీ భ‌ర‌త్ వివాద ర‌హితుడే అయినా ఆయ‌న శాఖ ఆయ‌న చేతుల్లో లేదంటున్నారు. రాష్ట్రానికి ఏ ప‌రిశ్ర‌మ‌, పెట్టుబ‌డి వ‌చ్చినా అది లోకేష్ ఖాతాలోకి వెళ్లిపోతోంది. కొన్ని ప‌రిశ్ర‌మ‌ల ప్రారంభోత్స‌వానికి కూడా సంబంధిత శాఖా మంత్రికి ఆహ్వానం ఉండ‌డం లేద‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా అటు మంత్రుల ప‌ట్ల, ఇటు ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల అమ‌లు విష‌యంలోనూ ప్ర‌జ‌లు అయితే సంతృప్తిగా లేక‌పోవ‌డంతోనూ రెండేళ్ల‌కే ఇంత వ్య‌తిరేక‌త క‌న‌ప‌డుతోంద‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.