Begin typing your search above and press return to search.

యూత్ పోలరైజేషన్...ఏపీలో కొత్త పరిణామం !

కానీ ఏపీలో అయితే అవి బాహాటం అయిపోతూంటాయి. మితిమీరిన అభిమానంతో అవి అతి ఉత్సాహం చూపిస్తూంటాయి.

By:  Satya P   |   4 Sept 2026 8:45 AM IST
యూత్ పోలరైజేషన్...ఏపీలో కొత్త పరిణామం !
X

ఏపీ రాజకీయాల గురించి బయట వారు చెప్పే మాట ఒక్కటే. సంకుల రాజకీయ సమరం అని. అది నిజమే కూడా. దేశంలో అన్ని చోట్లా కుల రాజకీయాలు ఉంటాయి. కానీ ఏపీలో అయితే అవి బాహాటం అయిపోతూంటాయి. మితిమీరిన అభిమానంతో అవి అతి ఉత్సాహం చూపిస్తూంటాయి. ఏపీ పాలిటిక్స్ ని లోతుగా అధ్యయనం చేస్తే ఎన్నో విషయాలు కనిపిస్తాయి. గతంలో కులాల ఆరాటాలు పోరాటాలు ఒక తరం వారికే పరిమితం అయ్యేవి. అవి యువత దాకా వచ్చేవి కావు, యూత్ అయితే తమకు ఏ పరిమితులూ లేవని అంటూ తమకు నచ్చిన తీరుతో ఉండేది. కానీ ఇటీవల కాలంలో యూత్ లో కూడా సామాజికపరమైన పోలరైజేషన్ కనిపిస్తోంది. జెన్ జీ తరం అయితే ఇలాంటి జాఢ్యం లేదు కానీ వాటికి అందని తరం అతీతమైన తరంలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.

లాభమేనా లేక :

యువతను అంతా భావి దేశ నిర్మాతలుగా చూస్తారు. వారి చేతిలో ఎక్కువ కాలం దేశం ఉంటుంది అని కూడా నమ్ముతారు. అయితే యూత్ లో కుల రహిత భావనలు ఉంటే ఫరవాలేదు కానీ వాటినే నమ్ముకుని అందులోనే కమ్ముకుని కుమ్ముకుపోతూంటేనే ఏమి జరుగుతోంది అన్నదే అంతా చర్చించే పరిస్థితి ఉంటోంది. ఏపీలో యూత్ కూడా పార్టీల పరంగా రాజకీయాల పరంగా భారీగా చీలిపోయారు. వారికి నచ్చిన పార్టీ అయితే చొక్కాలు చింపుకునేటంత ప్రేమాభిమానాలు కురిపిస్తూంటారు, నచ్చని వారితో అయితే ఎందాకైనా కయ్యానికి అని సై అంటూంటారు. ఇక వారి నాయకుడికి గ్లామర్ క్రేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంతలా వారు కూడా వీధుల్లో వీరంగం వేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి ఈ రకంగా యూత్ లో రాజకీయ చైతన్యం రావడానికి లాభంగా చూడాలా లేక వేరే విధంగా ఆలోచించాలా అన్నదే అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒక్కటిగా నిలిచి :

తాజాగా చూస్తే ఒక పార్టీ అధినాయకుడి బర్త్ డే వేడుక వచ్చింది. అంతే ఆయన సామాజిక వర్గం అని చెప్పుకునే కుర్ర కారులో ఊపు మామూలుగా లేదు, బైక్ ర్యాలీలు తీసారు, వీధుల్లోకి వచ్చి హడావుడి చేశారు, సందడిగా సంబరాలు చేశారు. అది అసలు మామూలుగా లేదని అంటున్నారు. తాము చదివే చోట తాము పనిచేసే చోట తాము కలిసి మెలసి ఉండే చోట తమ వర్గం వారైతే చాలు అంతా కట్టుగా జట్టుగా నిలిచి మరీ సదరు పార్టీ అధినేతకు నీరాజనాలు పలికారు. వారిలో ఏదో తెలియని అభిమానం, దానితో పాటు వెర్రి ఆవేశం ఇవన్నీ వేడుక సందర్భంగా కనిపించాయి. తమ పుట్టిన రోజే వచ్చినంతగా తమ కుటుంబంలోనే పండుగ చేసుకున్నట్లుగా ఒక వర్గం యూత్ చేసిన ఈ సంబరాలు అంబరాన్ని దాటాయి. దీంతో సదరు పార్టీ పెద్దలు అయితే యూత్ అంతా మావైపే అని ఒక అంచనాకు వస్తున్నారు.

దురాభిమానం కాకుంటేనే :

ఎవరికైనా తమ ఇంటి పేరు ఒంటి పేరు ఎంతో ఇష్టం. అది సహజం కూడా. అయితే అదే పనిగా వేలం వెర్రిగా వ్యవహరిస్తేనే ఇబ్బంది అని అంటున్నారు. సమాజంలో అందరూ ఉంటారు, ఎవరి విజయం అయినా అందరితో సాధ్యపడుతుంది. కానీ ఇలా ఓపెన్ గా చూపించే అభిమానం ఒక్కోసారి దురభిమానంగా మారి అసలుకే ఎసరు తెస్తుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో యూత్ పోలరైజేషన్ ప్రత్యేకించి ఒక బలమైన సామాజిక వర్గం లో జరగడం అంటే ఏ రకమైన రాజకీయ సమీకరణలకు తెర తీస్తుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.