Begin typing your search above and press return to search.

జనసేన సొంతంగా దిగితే... ఏ పార్టీకి షాక్ ?

ఏపీలో అటు టీడీపీ ఉంది, ఇటు వైసీపీ ఉంది. మధ్యన మరో కీలక పార్టీగా జనసేన ఉంది. జనసేన 2014 నుంచి చూస్తే ఏపీ రాజకీయాల్లో నిర్ణేతగా ఉంటోంది.

By:  Satya P   |   14 Aug 2026 9:16 AM IST
జనసేన సొంతంగా దిగితే... ఏ పార్టీకి షాక్ ?
X

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్నాయి. మూడవ పక్షం అన్నది అయితే లేదు, విపక్ష మైదానంలో అంతా ఖాళీగానే ఉంది. కూటమి పట్ల వ్యతిరేకత వస్తే కచ్చితంగా అది వైసీపీకి టర్న్ అయ్యే చాన్స్ ఉంది. వైసీపీ ధీమా కూడా అదే అని అంటున్నారు. అయితే ఏపీలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా మూడేళ్ళ దాకా సమయం ఉంది. అదే సమయంలో జాతీయ రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. వాటిని బట్టే ఏపీ రాజకీయాలు అని అంటున్నారు. మరి ఏపీలో 2029 ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అంటే ఇపుడే చెప్పలేరు కానీ ఏమైనా జరగవచ్చు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయని అంటున్నారు.

జనసేన వైఖరితోనే :

ఏపీలో అటు టీడీపీ ఉంది, ఇటు వైసీపీ ఉంది. మధ్యన మరో కీలక పార్టీగా జనసేన ఉంది. జనసేన 2014 నుంచి చూస్తే ఏపీ రాజకీయాల్లో నిర్ణేతగా ఉంటోంది. ఆ పార్టీ ఏ వైపు మొగ్గు చూపితే అక్కడ విజయం దక్కుతోంది. విడిగా పోటీ చేస్తే వైసీపీకి భారీ రాజకీయ లాభం కలుగుతోంది. ఇది 2019 ఎన్నికలలో రుజువు అయింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ భావించి కూటమి కట్టడం వెనక తన వంతుగా ఎంతగానో కృషి చేశారు. ఆ విషయం ఆయన పదే పదే చెప్పారు కూడా.

ఒత్తిడి పెరిగితే :

ఇక జనసేన కూటమిగానే మరో పదిహేనేళ్ళ పాటు కొనసాగాలని చూస్తోంది. ఆ మధ్య దాకా పవన్ ఇదే విషయాన్ని బహిరంగ వేదికల మీద కూడా గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఏపీలో ఒకే ప్రభుత్వం ఉంటే రాజకీయ స్థిరత్వం ఉంటే అభివృద్ధి శర వేగంగా సాగుతుంది అన్నది పవన్ ఆలోచనగా అంటున్నారు. అయితే జనసేనలోనూ ఆ పార్టీని అభిమానించే వర్గంలోనూ ఒక బలమైన సామాజిక వర్గంలోనూ అయితే జనసేన నుంచి పవన్ సీఎం క్యాండిడేట్ గానే చూస్తున్నారు. ఆ కోరిక 2024లో ఎటూ తీరలేదు కాబట్టి 2029 ఎన్నికల్లో అయినా తీరుతుందని భావిస్తున్నారు. అలా జరగాలని కోరుకుంటున్నారు. మరి కూటమిలో ఉంటే అది జరిగే పనేనా అన్నది మరో చర్చ. ఇక జనసేన ఒక వేళ అనివార్యం అయితే ఒంటరిగా పోటీ చేయాలని సూచించే వారు కూడా ఉన్నారు. ఇప్పటికైతే ఆ దిశగా ఏమీ నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ పరిస్థితులు రాజకీయాల్లో ఎలాగైనా మారవచ్చు కాబట్టి ఒక వేళ సోలోగా జనసేన 2029 ఎన్నికల్లో బరిలోకి దిగితే ఎలా ఉండొచ్చు అన్న దాని మీద ఆ పార్టీ అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అది మాత్రం రిపీట్ కాదు :

జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కనుక 2019 ఫలితాలు అయితే రిపీట్ కావని అంటున్నారు. అంటే టీడీపీ ఓట్లు చీలి వైసీపీ 151 సీట్లు సాధించి భారీగా లాభపడే సీన్ అయితే ఉండదని అంటున్నారు. దానికి కారణం జనసేన అధికారంలో కూడా ఉంది. ఆ విధంగా ఆ పార్టీ బలపడుతోంది. అంతే కాదు ఒంటరిగా పోరు అంటే అనేక మంది ఈసారి పోటీకి వస్తారు. ప్రత్యేకించి ఉభయ గోదావరిలోనే కాదు ఉత్తరాంధ్రాలోనూ ఆ ప్రభావం గణనీయంగా ఉండొచ్చు అని అంటున్నారు. దాంతో పాటు బలమైన ఒక సామాజిక వర్గం నూరు శాతం అండగా ఉండే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అందువల్ల జనసేన బాగానే సీట్లు రాబట్టవచ్చు అని 2029 లో ఏ ప్రభుత్వం ఏపీలో ఏర్పడాలన్నా కూడా జనసేన కీలకం అవుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి :

ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం కూడా ఖాయమని అంటున్నారు. జనసేన కనుక కూటమిలో ఉంటూ పోటీకి దిగితే నూరు శాతం ఆ ఓటింగ్ వైసీపీకే పడుతుంది. కానీ జనసేన సోలోగా దిగితే మాత్రం ఓట్లు చీలిపోతాయి. ఆ విధంగా టీడీపీకి కూడా రాజకీయ లాభం ఉండొచ్చు అని ఒక వేళ ఏ మాత్రం అయినా సీట్లు కొంత తగ్గినా ప్రభుత్వం ఏర్పాటుకు ఇబ్బంది ఉండదని కూడా అంటున్నారు. అయితే భారీ నష్టం ఎవరికి అంటే కచ్చితంగా వైసీపీకే అని అంటున్నారు. వైసీపీ ఇప్పుడిపుడే ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలలో పుంజుకుంటోంది. జనసేన కనుక సోలో ఎంట్రీ ఇస్తే మాత్రం ఆ ఓట్లు తిరిగి జనసేనకు వెళ్తాయని టీడీపీ బలమున్న చోట ఆ పార్టీ లాభం పొందుతుందని విశ్లేషిస్తున్నారు. ఆ నేపధ్యంలో రాయలసీమ వంటి హార్డ్ కోర్ రీజియన్ లోనే వైసీపీ ప్రభావం ఎక్కువగా చూపించగలుతుందని విశ్లేషిస్తున్నారు. అది ఏపీలో అధికారాన్ని చేపట్టడానికి సరిపడా సీట్లను అందించలేదని కూడా అంటున్నారు. మొత్తానికి మరో మూడేళ్లలో జరిగే ఏపీ ఎన్నికల్లో ఏమైనా జరగాచ్చు అని అంటున్నారు.