Begin typing your search above and press return to search.

బాబు పవన్ జగన్... దాని కోసమే సెర్చింగ్ !

ఇదిలా ఉంటే విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా పవర్ ఫుల్ స్లోగన్స్ అవసరం అని అంటున్నారు. మరో ఏడాదిలో జగన్ పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లబోతున్నారు.

By:  Satya P   |   26 Jun 2026 12:12 AM IST
బాబు పవన్ జగన్... దాని కోసమే సెర్చింగ్ !
X

ఏపీలో ప్రతీ ఎన్నికలోనూ ఒక బలమైన నినాదం ఉంటూ వచ్చింది. అలా వరుసగా మూడు ఎన్నికలు ఇప్పటికి జరిగాయి. ఈ నినాదాలు శక్తివంతమైన సెంటిమెంట్ గా మారి ఆయా పార్టీలకు రాజకీయ లబ్దిని చేకూర్చాయి. 2014లో చూస్తే అపుడే తెలంగాణా నుంచి వేరుపడిపోయి రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏపీ ఉంది. తల లేని మొండెంతో ఉన్న ఏపీని తాము అభివృద్ధి చేస్తామని అటు చంద్రబాబు ఇటు జగన్ జనం ముందుకు వచ్చారు. కేంద్రం సహకారంతో ఏపీలో అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని జనాలు నమ్మి ఓటేశారు. అలా టీడీపీ అధికారం చేపట్టింది.

సంక్షేమ నినాదంతో :

ఇక 2019లో జగన్ అయితే సంక్షేమ నినాదమే బలంగా జనంలో వినిపించారు. నవరత్నాలు అని ఆయన తీసుకొచ్చిన మినీ మేనిఫెస్టో అయితే జనంలో చర్చకు తావిచ్చింది. అప్పటికి అయిదేళ్ళూ అభివృద్ధి మీద టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టడంతో సంక్షేమం కోసం చూస్తున్న జనాల నాడిని జగన్ కరెక్ట్ గా పట్టుకున్నారు. అందుకే ఆయన కొత్త పధకాలతో ఆకట్టుకుని ఏపీలో 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక 2024 ఎన్నికల నాటికి కూటమిగా టీడీపీ బీజేపీ జనసేన ఏర్పడ్డాయి. ఈ పార్టీలు అన్నీ కలసి అభివృద్ధితో పాటు సంక్షేమ కూడా మిక్స్ చేసి మరీ జనం వద్దకు వెళ్లారు.

సూపర్ సిక్స్ ప్లస్ డెవలప్మెంట్ :

ఈ విధంగా చూస్తే 2024 ఎన్నికల్లో కూటమిని సూపర్ సిక్స్ హామీలు ప్లస్ డెవలప్మెంట్ నినాదం కలిపి గెలిపించాయని చెప్పక తప్పదు. అంతే కాదు కనీ వినీ ఎరగని విధంగా ఘన విజయం కూటమిని దక్కింది. 164 సీట్లు సాధించి అసెంబ్లీ అంతా కూటమి పార్టీలు పరచుకున్నాయి. ఇక చూస్తే అమరావతి నినాదం 2024లో బాగా పనిచేసింది. 2029 నాటికి అమరావతి ఒక కొలిక్కి వస్తున్నందువల్ల ఆ నినాదం అంతగా అక్కరకు వచ్చే సీన్ కనిపించడంలేదు. హామీలు కూడా సూపర్ సిక్స్తో ఇచ్చినందువల్ల కొత్త హామీలు ఏమిటి అన్నది కూటమి నేతలు చూడాల్సి ఉంటుందని అంటున్నారు.

వైసీపీ వెతుకులాట :

ఇదిలా ఉంటే విపక్షంలో ఉన్న వైసీపీకి కూడా పవర్ ఫుల్ స్లోగన్స్ అవసరం అని అంటున్నారు. మరో ఏడాదిలో జగన్ పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్లబోతున్నారు. జగన్ కనుక పాదయాత్ర చేపడితే స్థానికంగా సమస్యల మీద మాట్లాడడంతో పాటు మొత్తం పాదయాత్ర అంతటా ఏపీని టోటల్ గా ఆకట్టుకునే విధంగా సెంటిమెంట్ ని టచ్ చేసే విధంగా గట్టి నినాదం ఉండాలని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం దాని కోసమే ప్రస్తుతం అన్వేషిస్తోంది అని అంటున్నారు.

విమర్శలతో పని కాదు :

ఎన్నికల్లో కోట్లాది మంది జనాలను ఒకేత్రాటి పైకి తెచ్చి తమ వైపు తిప్పుకోవాలీ అంటే రాజకీయ పార్టీలకు సమర్ధవంతమైన నినాదం ఉండాలని అంటున్నారు. విమర్శలు ప్రతి విమర్శల వల్ల పని కాదని కూడా విశ్లేషిస్తున్నారు. అవి టైం పాస్ కి మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు. జనాలు కూడా సొషల్ మీడియా యుగంలో అన్నీ ఆలోచిస్తారని పైగా జెన్ జీ తరం కూడా ఎదురుగా నిలిచి ఉందని ఈ క్రమంలో ఎన్నికల్లో జనాల మనసు గెలుచుకోవాలంటే ప్రతీ ఎన్నికకూ ఒక పెను సవాల్ గా మారుతోందని అంటున్నారు. మొత్తానికి అయితే బాబు జగన్ పవన్ కూడా నినాదాల కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.