Begin typing your search above and press return to search.

వారంతా రాజకీయాలు మరచి పోవాల్సిందే !

కూటమి పార్టీలు అందులోని నేతలు ఎక్కువగా డీలిమిటేషన్ మీదనే ఆశలు పెట్టుకుంటున్నారు.

By:  Satya P   |   26 April 2026 9:05 AM IST
వారంతా రాజకీయాలు మరచి పోవాల్సిందే !
X

ఏపీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. అధికారంలో ఉన్న కూటమిలోనూ విపక్షంలో ఉన్న వైసీపీలోనూ చాలా మంది 2029 ఎన్నికల మీద గురి పెట్టి ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి రావాలని చూస్తున్నారు. అయితే వైసీపీ విషయంలో నేతల ఆశలు తీరడానికి ఎంతో కొంత వెసులుబాటు ఉంది కానీ టీడీపీ కూటమిలో అసలు చాన్స్ లేదని అంటున్నారు. మూడు పార్టీలతో అక్కడ కిటకిటలాడుతోంది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఏదో విధంగా సర్దుబాటు చేసుకున్నారు కానీ 2029 నాటికి ఎవరూ తగ్గేది లేదని చెబుతున్నారు. పైపెచ్చు ఒక్కసారికే పొత్తులకు సీటు ఇచ్చామని అంటున్నారు.

కొత్త ప్రస్థానంతో :

దీంతో పాటు టీడీపీకి మరిన్ని కొత్త సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఆ పార్టీ మూడవ తరానికి పూర్తిగా షిఫ్ట్ అవుతోంది. దాంతో చాలా మంది సీనియర్లు ఇక రాజకీయాలకు స్వచ్చందంగా విరమించుకుని ఏకంగా స్వస్తి వాచకం పలకాల్సిందే అని అంటున్నారు. లేకపోతే మాత్రం ఆశలు పెంచుకుని తరువాత వగచి వాపోయినా లాభం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే చాలా మంది సీనియర్ నేతలు తమ వారసులకు ఏదో విధంగా టికెట్ ని ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే అది కూడా అంత ఈజీ కాదని తేలిపోయింది. టీడీపీ పార్టీ కమిటీలలో కేవలం వారసత్వం మీదనే ఆధారపడి ఎంపిక చేయలేదు పనితీరునే బేరీజు వేసుకున్నారు. దాంతో చాలా మందికి పదవులు దక్కలేదు. దాంతో ఇదే రూల్ అక్కడ కూడా అప్లై చేస్తే టిక్కెట్లు హుళక్కే అని ముందే అర్ధం అవుతోంది అని అంటున్నారు.

డీలిమిటేషన్ కాకపోతే :

కూటమి పార్టీలు అందులోని నేతలు ఎక్కువగా డీలిమిటేషన్ మీదనే ఆశలు పెట్టుకుంటున్నారు. డీలిమిటేషన్ 2029 గా జరిగితే తమ పంట పండినట్లే అని వారు అంతా భావిస్తున్నారు ఏకంగా 263 దాకా సీట్లు పెరుగుతాయి కాబట్టి బెటర్ గా చాన్స్ ఉంటుందని అంటున్నారు. అలాగే మహిళా నేతలు కూడా డీలిమిటేషన్ లోనే తమకు రిజర్వేషన్లు వస్తాయని ఆశపడుతున్నారు. పార్టీ కమిటీలలో అనేక మంది మహిళా నేతలు ఉన్నారు. వీరందరికీ సీటు దక్కాలంటే మహిళా రిజర్వేషన్లు అమలు కావాలి. సీట్లు కూడా పెరగాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే ఇపుడు ఉన్న మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులలో ఎంతమందికి తిరిగి టికెట్ దక్కుతుందన్నది కూడా చర్చగానే ఉంది అంటున్నారు. కొన్ని చోట్ల పనితీరు బాగున్నా సామాజిక రాజకీయ సమీకరణల వల్ల కూడా 2029 లో సీటు ఇవ్వడం కుదరకపోవచ్చు అని అంటున్నారు.

మాజీలకు మరీ అన్యాయం :

ఇక కూటమి గెలిచి వైసీపీ ఓడాక ఆ వైపు నుంచి కూటమి వైపు వచ్చిన వారు అలాగే ఏ పార్టీలో చేరకుండా వేచి చూస్తున్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఇలా వీరందరి రాజకీయం కూడా 2029 ఎన్నికల్లో తేలిపోతుంది అని అంటున్నారు. డీలిమిటేషన్ బిల్లు ఈ మూడేళ్ళలోగా ఆమోదం పొందితే వీరికి రాజకీయంగా మరో చాన్స్ ఉంటుందని అంటున్నారు. లేకపోతే కూటమి పార్టీలలో ఉన్న వారికే సీటుకి పోటీ ఉంటే కొత్తగా వచ్చి చేరిన వారిని అసలు పట్టించుకోరని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏ పార్టీలో చేరకుండా గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తున్న వారిని అసలు పలకరించే వారే ఉండరని అంటున్నారు. ఏది ఏమైనా డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే కొంత మంది అయినా రాజకీయ మనుగడ సాగించగలుగుతారని లేకపోతే దశాబ్దాలుగా చూసిన అనేక ఫేస్ లను 2029 ఎన్నికల తరువాత మరచిపోవాల్సిందే అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.