Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త పార్టీ...జనాలు కావాలంటున్నారా ?

రాజకీయాల్లో శూన్యత ఉండాలి. ఆ శూన్యతలో ఏవరైనా ఎమెర్జ్ కాగలరు అలాంటి చాన్స్ 1983లో ఉమ్మడి ఏపీలో ఆనాటి నంబర్ వన్ సినీ నటుడు ఎన్టీఆర్ కి దక్కింది.

By:  Satya P   |   26 Nov 2025 1:00 PM IST
ఏపీలో కొత్త పార్టీ...జనాలు కావాలంటున్నారా ?
X

రాజకీయాల్లో శూన్యత ఉండాలి. ఆ శూన్యతలో ఏవరైనా ఎమెర్జ్ కాగలరు అలాంటి చాన్స్ 1983లో ఉమ్మడి ఏపీలో ఆనాటి నంబర్ వన్ సినీ నటుడు ఎన్టీఆర్ కి దక్కింది. ఆయన అతి పెద్ద ఖాళీలోకి తన తెలుగుదేశం పార్టీని విజయవంతంగా చేర్చగలిగారు. అప్పటికి మూడున్నర పదుల ఏళ్ల పాటు ఏపీలో రాజ్యం చేసిన కాంగ్రెస్ పట్ల జనాలకు మొహం మొత్తి ఉండడం కూడా టీడీపీ సూపర్ సక్సెస్ కి ప్రధాన కారణం. అయితే మళ్ళీ అలాంటి పరిస్థితులు అయితే ఏపీలో ఎక్కడా కనిపించలేదు. ఆ తరువాత నాదెండ్ల భాస్కరరావు కొత్త పార్టీ పెట్టినా ఎన్ టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్న టీడీపీ పెట్టినా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసినా జనాలు తిరస్కరించారు. దానికి కారణం రాజకీయ శూన్యత అన్నది లేకపోవడమే.

ప్రజారాజ్యం తర్వాత :

ఇక 2008లో ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసినా అప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్ టీడీపీ ఫోర్స్ ముందు నిలబడలేకపోయింది. ఈ మధ్యలో లోక్ సత్తా అన్న పార్టీ వచ్చినా అంతే జరిగింది. ఇక విభజన ఏపీలో జనసేనను సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినా ఆయన 2014లో పోటీ చేయకుండా 2019లో బరిలోకి దిగారు. అయినా ఒకే సీటు దక్కింది. ఇక లాభం లేదని 2024లో బీజేపీ టీడీపీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే ఆయనకు 21 సీట్లతో స్ట్రైక్ రేట్ సక్సెస్ దక్కింది. అయినా 2029 నాటికి జనసేన ఒంటరిగా మూడవ పార్టీగా పోటీ చేస్తుందా అంటే డౌటే. ఎందుకంటే ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ సాగుతోంది. అంతే కాదు ఓట్ షేర్ కూడా అలాగే విభజన జరిగిపోయింది. ఇందులో కేవలం రాజకీయమే కాఎదు, సామాజిక ప్రాంతీయ విభజన కూడా ఉంది అని విశ్లేషణలు ఉన్నాయి.

ఈ పార్టీల సంగతేంటి :

ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ లాంటి శతాధిక వృద్ధ పార్టీ ఉంది. 2014 ముందు దాకా ఆ పార్టీ ఏపీలో బలమైన పార్టీ. కానీ విభజన తరువాత ఒక్కసారిగా కుదేలు అయిపోయింది. దాంతో పాటుగా ఉభయ వామపక్షాలు సైతం అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు కొత్త పార్టీ అని ప్రకటనలు ఇస్తున్నారు. అయితే అవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయి అన్నది కూడా చూడాల్సి ఉంది. పార్టీ పెట్టడానికి ఎవరికైనా పెద్ద ఇబ్బంది లేదు, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పార్టీ పుడుతుంది. అలా పుట్టిన పార్టీని సాకాలి, ఎదగనీయాలి. జనాలకు చేరువ చేయాల్సి ఉంది. అలా జరిగితేనే హిట్ అయినట్లు, కనీసం పార్టీ పెట్టిన వారు అయినా గెలిస్తే సార్ధకత చేకూరినట్లే. కానీ అలాంటి అధ్బుతాలు ఏవీ జరిగే చాన్స్ లేదని అంటున్నారు.

ప్రయోగాలకు నో :

ఏపీ జనాలు ప్రయోగాలకు నో చెబుతారు అని కూడా ఉంది. పూర్తిగా విసిగి వేసారితేనే తప్ప వారు కొత్త వైపు చూడరు, వైసీపీని గెలిపించాలి అంటేనే ఏకంగా పదేళ్ల పాటు చూశారు. ఇక ఇపుడు ఏపీకి కావాల్సింది కొత్త పార్టీలు కాదు, కొత్త రాష్ట్రం అయిన ఏపీకి కడగండ్లు తీరే మార్గం అని అంటున్నారు. అందుకే వారు అనుభవం ఉందని చంద్రబాబుకి రెండు సార్లు పగ్గాలు అప్పగించారు. సో అలా చూసుకుంటే సమీప భవిష్యత్తులో ఏపీలో కొత్త పార్టీలు అన్న మాట అయితే ఉండదని అంటున్నారు.