తగ్గేదేలే.. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తా : హోంమంత్రి అనిత స్ట్రాంగ్ రియాక్షన్
దీంతో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శలు రేపిన కాక ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని అంటున్నారు.
By: Tupaki Political Desk | 16 Jun 2026 4:54 PM ISTహోంమంత్రి అనితపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమరనాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హోంమంత్రి అనితను మాత్రమే కాకుండా యావత్ మహిళాలోకాన్ని అవమానించేలా అమరనాథ్ విమర్శలు ఉన్నాయని కూటమి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ ట్వీట్ చేయగా, హోంమంత్రి అనిత కూడా ‘ఎక్స్’లో తన అధికారిక అకౌంట్ నుంచి మాజీ మంత్రి విమర్శలపై విరుచుకుపడుతూ పోస్ట్ పెట్టారు. దీంతో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శలు రేపిన కాక ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని అంటున్నారు.
‘‘ఒక బహిరంగ సభలో, కెమెరా ముందు ఒక వైఎస్సార్‌సీపీ నాయకుడు నా గురించి అన్న మాటలు కేవలం నన్ను అవమానించడం మాత్రమే కాదు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక మహిళను, ఒక దళితురాలిని అవమానించే లక్ష్యంతో చేసిన నీచమైన, కులతత్వ దాడి’’ అంటూ హోంమంత్రి అనిత ట్వీట్ చేశారు. మాజీ మంత్రి వాడిన భాష అవమానకరమైనదంటూ మండిపడ్డారు. ఇలాంటి సంస్కృతిని వైఎస్సార్‌సీపీ పెంచి పోషిస్తోందని విమర్శించారు. ‘‘ఒక మహిళ తన సొంత కష్టంతో, దృఢ సంకల్పంతో, ప్రజా సేవతో పైకి వచ్చినప్పుడు కొంతమంది పురుషులు ఇలాంటి దాడులు చేస్తారు’’ అంటూ ఆ ట్వీట్ లో హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక దూషణలు, బెదిరింపులకు పాల్పడతారన్నారని ధ్వజమెత్తారు. తన జీవితంలో ఇలాంటి దాడులను ఎన్నో చూశానని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు తన సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రి చేసిన విమర్శలతో తన గొంతు నొక్కేయలేరని, ఎవరికీ తలవంచే రకం కాదని మంత్రి తేల్చిచెప్పారు. ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదంటూ స్పష్టం చేశారు. తన ట్వీట్ లో మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే తనపై చేసిన వ్యాఖ్యలను ఎండగట్టే ప్రయత్నం చేశారు మంత్రి అనిత.
ఇక కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో హోంశాఖ సాధించిన పురోగతిపైనా మంగళవారం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలోనే మాజీ మంత్రి విమర్శలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరారు. అయితే ప్రభుత్వ విజయాలు, పోలీసుల గొప్ప పనితీరును చెప్పేందుకు తాను వచ్చానని, ఇలాంటి సందర్భంలో విజ్ఞత లేని వారి కోసం మాట్లాడి తనను తాను తగ్గించుకోలేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆయన మాటలపై కచ్చితంగా స్పందిస్తానని, ఆ సమయం దగ్గరలోనే ఉందని అనిత స్పష్టం చేశారు.
వైసీపీ ఎదురుదాడి
కాగా, కూటమి నేతలు, మంత్రులు మాజీ మంత్రి గుడివాడను టార్గెట్ చేయడంపై వైసీపీ రియాక్ట్ అయింది. ఆ పార్టీకి చెందిన మహిళా నేతలు ఈ విషయంపై వరుసగా స్పందిస్తూ హోంమంత్రి అనితపై మాటల దాడి ముమ్మరం చేస్తున్నారు. అనిత కంటే ముందుగా మంత్రి పదవి చేపట్టి ఆరు శాఖలను సమర్థంగా నిర్వహించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ను వాడు, వీడు అంటూ హోంమంత్రి వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పదవులు శాశ్వతం కాదని హోంమంత్రి గుర్తుంచుకోవాలని, మాజీ మంత్రిపై అమర్యాదగా మాట్లాడటం మానేయాలని హితవుపలకారు. మొత్తానికి మాజీ మంత్రి అమరనాథ్ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన చర్చనీయాంశంగా మారాయని అంటున్నారు.
