Begin typing your search above and press return to search.

'క‌ర్చీఫ్‌'లు వేస్తున్నారు.. 'కుస్తీ'లు ప‌డుతున్నారు.. !

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉంది. ఒక‌వేళ ముందే జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కొన‌సాగినా.. అలాంటి సంకేతాలు అయితే.. క‌నిపించ‌డం లేదు.

By:  Garuda Media   |   7 Nov 2025 6:00 AM IST
క‌ర్చీఫ్‌లు వేస్తున్నారు.. కుస్తీలు ప‌డుతున్నారు.. !
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉంది. ఒక‌వేళ ముందే జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కొన‌సాగినా.. అలాంటి సంకేతాలు అయితే.. క‌నిపించ‌డం లేదు. కానీ.. ప‌లు పార్టీల్లో నాయ‌కులు.. మాత్రం ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెట్ట‌డమే కాకుండా.. క‌ర్చీఫ్‌లు కూడా వేస్తున్నారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీలో జోరుగా క‌నిపిస్తోంది. కానీ.. ఇలా తొంద‌ర ప‌డుతున్న నాయ‌కుల కార‌ణంగా.. వివాదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

రాయ‌ల‌సీమ‌లోని 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టి నుంచే క‌న్నేశారు. వీరిలో కొంద‌రు వా ర‌సులు కూడా ఉన్నారు. అంతేకాదు.. మ‌రికొంద‌రు పొరుగు పార్టీల్లోకి జంప్ చేసిన వారు కూడా ఉన్నా రు. కానీ.. వ‌చ్చే ఎన్నికల్లో చాన్స్ కోసం.. మ‌రోసారి వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం.. వైసీపీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి జ‌గ‌నే ఘ‌ర్ వాప‌సీ పిలుపునిచ్చారు. అంటే.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఈ క్ర‌మంలోనే నాయ‌కులు సీట్ల వ్య‌వ‌హారంపై అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తాము కోరిన సీటును ఇస్తారా? అనేది వీరి ప్ర‌శ్న‌. ఇది ప్రారంభం మాత్ర‌మేన‌ని.. చాలా మంది నాయ‌కులు ఇలానే ఆలోచ‌న చేస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారిని మారిస్తే.. ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా అంటున్నాయి. అందుకే.. జ‌గ‌న్ ఈ విష‌యంలో మౌనంగా ఉన్నారని గుస‌గుస వినిపిస్తోంది. ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కులు రావ‌డం త‌ప్పుకాదు. కానీ, ముందే క‌ర్చీఫ్ వేసుకుని వ‌స్తామ‌ని చెప్ప‌డమే ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నారు.

ఇక‌, టీడీపీ జ‌న‌సేన‌ల్లోనూ ఇదే త‌ర‌హా క‌ర్చీఫ్‌లాట జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో అవ‌కాశం కోల్పోయిన వారు .. త్యాగాలు చేసిన వారు.. తిరిగి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. త‌మ హ‌వా చూపించాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టినుంచే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో తాము విజ‌యం ద‌క్కించుకోక పోయినా.. కార్య‌క్ర‌మాల‌కు మాత్రం హాజ‌రువుతున్నారు. ఇది మంచిదేన‌ని అంద‌రూ అనుకోవ‌చ్చు. కానీ, దీనివెనుక క‌ర్చీఫ్ వ్య‌వ‌హారం ఉండ‌డంతోనే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కుస్తీలు ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌స్తోంద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.