వద్దంటే రుద్దుతున్నారు.. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అంతే.. !
ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లో నాయకులకు ఇచ్చిన పదవుల వ్యవహారం ఇబ్బందిగా మారింది.
By: Garuda Media | 26 Aug 2025 4:00 PM ISTఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లో నాయకులకు ఇచ్చిన పదవుల వ్యవహారం ఇబ్బందిగా మారింది. అధికార టీడీపీలో విపక్ష వైసిపి లో కూడా గత ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో నాయకులకు పదవులు అప్పగించారు. వీరంతా పార్టీని డెవలప్ చేస్తారని, ప్రజల్లోకి వెళ్లి పార్టీ తరఫున పని చేస్తారని అధినాయకులు భావించారు. అయితే, వారు అనుకున్న విధంగా అయితే క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. టిడిపిని తీసుకుంటే కార్పొరేషన్ పదవులు సహా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా పదవులు భర్తీ చేశారు. మరి వీరంతా ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు.. అనే విషయం గమనిస్తే చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు, తమ స్థాయికి తగిన విధంగా పదవులు దక్కలేదని మెజారిటీ నాయకుల అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయాన్ని పైకి చెప్పలేక మనసులో దాచుకోలేక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కూడా తాము సిఫారసు చేసిన వారికి పథకాలు అందడం లేదని, తమ మాటకు తమ సిఫారసులకు కూడా జిల్లా స్థాయి అధికారులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు గాని ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని నేతలు గగ్గోలు పెడుతున్నారు.
ఇది పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకు పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కీలక ప్లేసులో ఉన్న ఓ నేత సుమారు పదిమందికి తల్లికి వందనం పథకం కింద సిఫారసు చేశారు. ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా సొమ్ములు పడలేదు. కనీసం పరిశీలనకు కూడా నోచుకోలేదు. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఒక నేత అన్నదాత సుఖీభవ కింద తన నియోజకవర్గంలోని 9 మందికి సిఫారసు చేశారు. వారికి కూడా ఇంతవరకు నిధులు పడలేదు. ఎమ్మెల్యే స్థాయిలోనే ఉన్న వారికి కూడా ఇలా జరుగుతుంటే ఇక తమ పరిస్థితి ఏంటి అని నామినేటెడ్ పదవులు తీసుకున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తమ స్థాయికి తగిన విధంగా పదవులు లేవని, సుదీర్ఘ కాలంగా పార్టీలో సేవలు అందిస్తున్నామని తమను సరైన విధంగా గుర్తించలేకపోతున్నారన్నది మరికొందరి బాధగా ఉంది. ఇది పార్టీ కార్యక్రమాల పైన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక, వైసిపిలో జిల్లా స్థాయి ఇన్చార్జిలను, నియోజకవర్గం ఇంచార్జ్‌లను ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించి నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పటివరకు జిల్లా స్థాయిలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని పట్టుమని పదిమంది కూడా స్పందించలేదు.
నియోజకవర్గంలో పర్యటించడం లేదు. పార్టీని డెవలప్ చేయడం లేదు. ఈ పరిణామాలను గమనిస్తే తమ స్థాయికి తమ ప్రాంతానికి సంబంధం లేకుండా పదవులను కట్టబెట్టారన్న ఆవేదన వైసీపీలో కూడా కనిపిస్తోంది. దీనిని సరిచేయాలనేది ఆ నాయకులు కోరుతున్న మాట. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకుమించి చేయలేమన్నది టిడిపి ఇటు వైసిపి రెండు చెబుతున్నాయి. ఇదే కొనసాగితే పదవులు ఇచ్చిన ప్రయోజనం ఎంతవరకు ఉంటుందనేది, పార్టీలకు ఏ మేరకు మేలు జరుగుతుందనేది ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.
