జగన్ పవన్ ఎందుకలా ?
ఏపీ రాజకీయాలు బహు చిత్రంగా ఉంటున్నాయి. రాజకీయ దిగ్గజంగా ఉంటూ రాజకీయాలను అలాగే చూస్తూ చేస్తున్న చంద్రబాబు వంటి వారు ఉన్న చోట సైతం ఇతర నాయకులు ఆయన వైఖరిని ఎంతవరకూ అనుసరిస్తున్నారు అన్న చర్చ అయితే ఉంటోంది.
By: Satya P | 3 Sept 2025 8:15 AM ISTఏపీ రాజకీయాలు బహు చిత్రంగా ఉంటున్నాయి. రాజకీయ దిగ్గజంగా ఉంటూ రాజకీయాలను అలాగే చూస్తూ చేస్తున్న చంద్రబాబు వంటి వారు ఉన్న చోట సైతం ఇతర నాయకులు ఆయన వైఖరిని ఎంతవరకూ అనుసరిస్తున్నారు అన్న చర్చ అయితే ఉంటోంది. ఏపీ రాజకీయ నాయకులు అయితే ప్రత్యర్థులుగా ఎక్కడా భావించడం లేదు, శత్రువులుగానే చూస్తున్నారు. ఈ పెడ ధోరణి వల్లనే రాజ్ భవన్ లో తేనీటి విందుకు అంతా కలవలేక పోతున్నాను. అంతే కాదు రాజకీయేతర కార్యక్రమాలలో సైతం ఒకరికి ఒకరు ఎదురు పడలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వచ్చింది. ఆయనకు ప్రధాని మోడీ నుంచి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇలా మంత్రివర్గం మొత్తం గ్రీట్ చేసింది. అలాగే సినీ పరిశ్రమ యావత్తు ఆయనకు అభినందనలు తెలియచేసింది.
వైసీపీ మాత్రం అలాగే :
అయితే వైసీపీ నుంచి పవన్ కి గ్రీట్ చేస్తూ ఒక్క ట్వీట్ కూడా పడకపోవడం పట్ల అయితే చర్చ సాగుతోంది. ఇది కేవలం ఈ ఏడాదికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ప్రతీ ఏటా ఇలాగే జరుగుతోంది. దాంతో ఎందుకు ఇలా అని అంతా అనుకునే నేపధ్యం ఉంది. రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అన్నది అంతా గ్రహిస్తే ఇలాంటివి ఉండవని అంటున్నారు కానీ ఏపీలో మాత్రం వేరేగా చూస్తున్నారు అని అంటున్నారు
నాడు ట్వీట్ చేసినా :
ఇకపోతే పవన్ రెండవ కుమారుడు సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు అన్న వార్త విన్న వెంటనే జగన్ అతని ఆరోగ్యం బాగుండాలని ట్వీట్ చేశారు. దానిని తరువాత పవన్ సైతం ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. ఇలా చూస్తే బాగానే ఉంది అనుకున్నా పుట్టిన రోజు పూటా చిన్న పాటి ట్వీట్ అయినా వేయలేదేమిటి అన్నదే చర్చగా ఉంది. పవన్ సైతం రాజకీయాల్లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. సాటి రాజకీయ పక్షంగా భావించి ఆయనకు జన్మ దిన వేడుకలకు శుభాకాంక్షలు చెబితే అది ఏపీ రాజకీయాలకు మంచి సానుకూల సంకేతం పంపినట్లు అవుతుంది కదా అని అంటున్నారు
పవన్ సైతం అలాగే :
ఇది కేవలం వైసీపీ వైపు నుంచే కాదు జనసేన అధినేత పవన్ విషయంలోనూ జరుగుతోంది. పవన్ కూడా జగన్ పుట్టిన రోజుకు శుభాకాక్షలు చెప్పిన దాఖలాలు లేవని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటారు. ఇద్దరూ ఏపీ రాజకీయాల్లో చాలా కాలం రాజకీయాలు చేయాల్సిన వారు కానీ ఇలాంటి విషయాలలో మాత్రం ఎందుకో ఒకే తీరుగా వ్యవహరిస్తున్నరు అని అంటున్నారు. దాంతో ఇద్దరి మధ్యన ఏమి జరిగింది అన్నది కూడా అంతా చర్చిస్తూంటారు. అయితే చిత్రంగా చూస్తే ఇద్దరూ కలిసింది కూడా ఈ రోజుకీ లేదు అంటే అది ఆశచయ్రమే.
బాబు జగన్ మధ్యన :
ఇక ఏపీ రాజకీయాలలో బాబు జగన్ ఉప్పు నిప్పులా వ్యవహరిస్తారు. కానీ చంద్రబాబు పుట్టిన రోజున కచ్చితంగా జగన్ ట్వీట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు చెబుతారు. అలాగే చంద్రబాబు సైతం జగన్ పుట్టిన రోజున ఆయనకు అభినందనలు తెలియచేస్తారు. ఈ విషయంలో మెచ్చుకోవాల్సింది చంద్రబాబునే అని చెప్పాలి. ఆయన రాజకీయాలను అలాగే చూస్తారు వ్యక్తిగతానికి ముడి పెట్టరు. దాంతోనే బహుశా వైసీపీ వైపు నుంచి సానుకూలత వస్తోంది అని అంటారు. బాబు వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి విషయాలలో స్పూర్తిని తీసుకుంటే ఏపీ రాజకీయాల్లో మంచి పరిణామాలు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏమైనా మారుతాయేమో.
