వైసీపీకి బీజేపీ ట్రబుల్స్
ఏపీలో వైసీపీ ఏకైక అతి పెద్ద ప్రతిపక్షంగా ఉంది 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి 11 సీట్లు వచ్చినప్పటికీ 40 శాతం ఓటు షేర్ లభించింది.
By: Satya P | 16 Nov 2025 7:00 AM ISTఏపీలో వైసీపీ ఏకైక అతి పెద్ద ప్రతిపక్షంగా ఉంది 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి 11 సీట్లు వచ్చినప్పటికీ 40 శాతం ఓటు షేర్ లభించింది. ఆ లెక్కన ఏపీలో టీడీపీ కూటమికి వైసీపీయే ప్రధాన ప్రత్యర్ధి అన్నది కచ్చితంగా చెప్పే విషయం. కూటమిలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఏపీలో టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలంగా పాతుకుని పోయింది. ఇక జనసేన అయితే కొన్ని జిల్లాలలో తన ప్రభావం బాగా ఎక్కువగా చూపిస్తోంది. అలాగే ఒక బలమైన సామాజిక వర్గం ఆ పార్టీ వెంట తన ఆశలను అల్లుకుని ఉంది. బీజేపీకి ఏపీలో పెద్దగా ఏమీ లేదు అని అనుకోవచ్చు జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయ దూకుడు ప్రభావం ఏపీ మీద కూడా గట్టిగానే ఉంటుందని అంటున్నారు.
బీహార్ ఇంపాక్ట్ :
బీహార్ లో బీజేపీ జేడీయూ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వస్తోంది. ఇక అక్కడ బలమైన ప్రత్యర్ధి అనుకున్న ఆర్జేడీని పూర్తిగా పరిమితం చేసింది. కాంగ్రెస్ కి అయితే అస్థిత్వ పోరాటమే మిగిలింది. ఇక బీజేపీ తరువాత లక్ష్యాలు చాలానే ఉన్నాయి. మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారి కోటలను ఎలా కూల్చడం అన్నది కమలానికి ఒక పెద్ద ఎక్సర్ సైజ గా ఉండబోతోంది. ఆ మీదట కర్నాటక కేరళ, తెలంగాణా ఎటూ ఉన్నాయి. వీటితో పాటు ఏపీ కూడా బీజేపీ ప్లాన్ లో ఉంది అన్ అంటున్నారు.
వచ్చేసారి వేరు :
ఇక దేశమంతా మోడీ ప్రభంజనం వీస్తోంది అన్నది గత పద్దెనిమిది నెలలుగా రుజువు అయింది హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ, బీహార్ ఇలా అన్ని రాష్ట్రాలను గెలుచుకుని వస్తున్న బీజేపీ తాను అనుకున్న మరికొన్ని లక్ష్యాలను కూడా సాధిస్తే కనుక కచ్చితంగా దాని ప్రభావం ఏపీ మీద ఇంకా ఎక్కువగానే పడుతుంది. ప్రస్తుతానికి కూడా బీహార్ ఫలితాలు ఏపీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలతో ఒక మంత్రితో కూటమిలో చేరే చాన్స్ అయితే ససేమిరా లేదని అంటున్నారు.
బలం పెంచుకోవడమే :
ఏపీలో బలం పెంచుకోవడం మీదనే ఇక బీజేపీ ప్రత్యేక దృష్టి పెడుతుంది అని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ వైసీపీనే గట్టిగా టార్గెట్ చేయవచ్చు అని అంటున్నారు. ఏపీలో వైసీపీలో బలమైన నాయకులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా కొత్త రకం రాజకీయానికి బీజేపీకి తెర తీస్తే మాత్రం నష్టపోయేది కచ్చితంగా ఫ్యాన్ పార్టీయే అని అంటున్నారు. ఇక 2029 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ఒక ప్లాన్ ని సిద్ధం చేసుకునే పనిలో ఉంది. ఈసారి ఎక్కువగా సీట్లను బీజేపీ డిమాండ్ చేసే చాన్స్ స్పష్టంగా ఉంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే బీజేపీకి ఇపుడు ఉన్న బలం రెండింతలు కాదు మూడింతలు కావాలన్న భారీ లక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరి బీజేపీ బలపడితే ప్రభుత్వంలో మంచి అవకాశాలు వస్తాయి.
వైసీపీలో అలజడి :
బీహార్ లో బీజేపీ విశ్వరూపం చూసిన తరువాత వైసీపీలోనూ అలజడి రేగుతోందా అంటే అదే ప్రచారంలో ఉంది అని అంటున్నారు. మోడీ తోడు ఉంటే చాలు విజయం గ్యారంటీ అని అన్ని చోట్లా రుజువు అవుతోంది. మిత్రులు కూడా మంచి ఆధిక్యతతో అధికారం పంచుకుంటున్నారు. ఇక ఏపీలో కూడా కూటమి మరోసారి గెలవడానికి బీజేపీ జాతీయ స్థాయి పధకాలు ఆలోచనలు ఎంతగానో పనికి వస్తాయి. ఈ కూటమి చెక్కు చెదరదు సరికదా మరింత బలపడుతుంది. ఈ విషయాల మీద వైసీపీలో చర్చ మొదలైతే అపుడే రాజకీయ ప్రకంపనలు పుడతాయని అంటున్నారు
బీజేపీ వైపు ఆకర్షితులు :
రాజకీయంగా వాలు వీలు చూసుకునే నేతలు ఉంటారు. వైసీపీకి వచ్చే ఎన్నికలో గెలుపు అవకాశాలు ఏ మేరకు అని బేరీజు వేసుకునే వారు వైసీపీలో ఉంటారని అంటున్నారు. ఒకవేళ తాము అనుకున్న తీరున కాకుండా జాతీయ స్థాయి రాజకీయం మరి అది ఏపీ మీద గణనీయంగా ప్రభావం చూపిస్తుంది అనుకుంటే వైసీపీ నుంచి కూడా నేతలు బీజేపీ వైపు ఆకర్షితులు అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి రానున రోజులలో బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉందన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి.
