కంప్లైంట్ చేసేందుకు వస్తే పెళ్లాడిన సీఐ.. పీఎంవోకు ఫిర్యాదు.. తాజాగా బయటకు!
ఈ విషయమంతా పవన్ కుమార్ కు 2021లో తెలిసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకున్న వైనం గురించి తెలిసి స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేశారు.అయితే.. ఎవరూ స్పందించలేదు.
By: Garuda Media | 22 Aug 2025 9:49 AM ISTతనకు న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ కు వచ్చిన మహిళకు మాయమాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకున్న పోలీసు ఉదంతం ఒకటి ఏపీలో వెలుగు చూసింది. అసలు ట్విస్టు ఏమంటే.. సదరు మహిళ భర్త ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో)కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఇష్యూ వెలుగు చూసింది ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే..
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పవన్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దుబాయ్ లో ఐటీ ఉద్యోగిగా ఉన్న అతను అప్పుడప్పుడు ఏపీకి వచ్చేవారు. ఇదిలా ఉండగా 2018లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మహిళను అతను పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఆమెకు నంద్యాల సీసీఎస్ సీఐగా పని చేసే సురేష్ కుమార్ పరిచయమయ్యారు. ఆమె ఫిర్యాదు వివరాల్ని సేకరించి.. ఆమెకు సాయం చేస్తానని చెప్పి మాయమాటలతో ఆమెకు దగ్గరయ్యాడు అని పవన్ ఆరోపిస్తున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయమంతా పవన్ కుమార్ కు 2021లో తెలిసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకున్న వైనం గురించి తెలిసి స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేశారు.అయితే.. ఎవరూ స్పందించలేదు. ఇదిలా ఉండగా2023లో ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో అతను హైకోర్టును ఆశ్రయించి సదరు సీఐపై ప్రైవేటు కేసు వేయించారు. అయితే.. ఈ అంశంపై ఛార్జిషీటు వేయకుండా పోలీసులు ఆలస్యం చేశారు.
చివరకు అతను పీఎంవోకు కంప్లైంట్ చేశారు. దీంతో స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం ఈ అంశంపై వివరాల్ని డీజీపీ ఆఫీసుకు పంపారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఈ జూన్ లో మదనపల్లి పోలీసు స్టేషన్ లో సీఐపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. సీఐ సురేష్ కుమార్ కుల ధ్రువీకరణ మీద ఫిర్యాదు అందింది. అతని తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారని.. తల్లి కుల ధ్రువీకరణ పత్రం ద్వారా అతను జాబ్ సొంతం చేసుకున్నట్లుగా బాధితుడు పీఎంవోకు కంప్లైంట్ చేశారు. ఈ సమాచారం ఆధారంగా కూడా విచారణ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సదరు సీఐ సెలవు మీద వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చగా మారింది.
