అర్ధరాత్రి ఇద్దరు యూట్యూబర్లు అరెస్టు.. హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల హల్ చల్
హైదరాబాద్‌లో ఇద్దరు యూట్యూబర్లను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు కలకలం రేపారు.
By: Tupaki Political Desk | 1 July 2026 1:16 PM ISTహైదరాబాద్‌లో ఇద్దరు యూట్యూబర్లను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు కలకలం రేపారు. ఈ ఘటనతో రెండు రాష్ట్రాల రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ గడ్డపై ఏపీ పోలీసులు ఎలా అరెస్టు చేస్తారంటూ జర్నలిస్టు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ఇటువంటి ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నిందితులు ఇద్దరు తమ యూట్యూబ్ చానళ్లలో విశ్లేషణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులను వ్యక్తిగతంగా దూషిస్తున్న కారణంగా కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టు నుంచి అరెస్టు వారెంట్ తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చి నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారని అంటున్నారు.
కేవీఆర్ అరెస్టులో హైడ్రామా
యూట్యూబ్ లో మైరా మీడియా అనే చానల్ నిర్వహిస్తున్న కేవీ రెడ్డి అరెస్టు జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. గతంలో కర్నూలు పోలీసులు అతడిని అరెస్టు చేయగా, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అప్పట్లో కేవీఆర్ ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ అయిన కేవీఆర్ ను తాజాగా విజయనగరం జిల్లా బాడంగి పోలీసులు అరెస్టు చేశారని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నిందితుడి భార్య, పిల్లలు, స్థానికులు అడ్డగించినా, పోలీసులు వారెంటును చూపి కేవీఆర్ ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక కేవీఆర్ అరెస్టు సందర్భంగా పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవీఆర్ ను కారులో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన భార్య డోరుకు అడ్డంగా నిల్చొని అడ్డుకోబోయారు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా పక్కకు నెట్టేశారు. అయితే ఈ ఘటనపై జర్నలిస్టు నేతలు, స్వచ్ఛంద కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి ఎలా అరెస్టులు చేస్తారంటూ నిలదీశారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు ప్రైవేటు కారులో కేవీఆర్ ను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. అయితే ఏపీ పోలీసులు సరూర్ నగర్ పోలీసుస్టేషన్ లో దీనిపై ముందే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.
‘ప్రశ్న’ రావణ్ అదుపులోకి..
ఇదే సమయంలో మరో యూట్యూబర్ ‘ప్రశ్న’ రావన్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోపాటు కూటమి ప్రభుత్వ పెద్దలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు లీగల్ యాక్షన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే ఏపీలోని ఏలూరులో జరిగిన ఒక సభలో రావణ్ పాల్గొన్నారు. దీంతో ఆయన తాజా అరెస్టు విస్తృత చర్చకు దారితీసింది.
అరెస్టులపై నిరసనలు
హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ అరెస్టులపై తెలంగాణ రాజకీయ నేతలు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్తుంటే, తెలంగాణ పోలీసులు వారికి సహకరించడం అత్యంత దుర్మార్గమని ఆమె ధ్వజమెత్తారు. జర్నలిస్టుల కుటుంబాలపై ఇలాంటి భయాందోళనలు సృష్టించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం విమర్శించే గొంతులను నొక్కేయడానికే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ గడ్డపై స్థానిక జర్నలిస్టులను టార్గెట్ చేయడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని జర్నలిస్టు నేతలు విమర్శిస్తున్నారు.
