పెన్షన్ క్రెడిట్... ఇదొక పొలిటికల్ వార్
అయితే ఇందులో మరో విషయం ఉంది దీంతో టీడీపీ మొత్తంగా ఒక ప్రచారం చేస్తోంది. 75 రూపాయల పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచిన ఘనత తమ పార్టీదే అని అంటోంది.
By: Satya P | 2 Oct 2025 6:00 AM ISTకాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లుగా వర్తమానం సాగుతోంది. తాము ప్రజలకు ఎంతో చేశామని పాలకులు చెప్పుకుంటారు. అందులో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే జనాల జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఎవరు ఏమి చేశారో చెప్పుకోకపోతే ఇంతా చేసి ప్రయోజనం ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తుంది. ఇలా పధకాల ప్రచారంలో టీడీపీకి సరి సాటి ఎవరూ ఉండరు, వైసీపీ ఏ పధకం అయినా తాడేపల్లి నుంచి జగన్ బటన్ నొక్కి లాంచ్ చేసి వదిలేశేవారు. దాంతో పధకం అందేది కానీ దాని వెనక ఉన్నది ఎవరు ఇచ్చింది ఎవరు అన్నది అంతగా జనం మదిలోకి పోలేదు. వైసీపీ కూడా ఏ విధంగానూ ప్రచారం చేసుకోలేకపోయింది. దాంతో 2024 ఎన్నికల్లో అతి పెద్ద దెబ్బ ఆ పార్టీకి తగిలింది.
పెన్షన్ల గొప్పతనం :
ఏపీలో సామాజిక పెన్షన్లు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. అందుకు అన్ని పార్టీలను మెచ్చుకుని తీరాల్సిందే. బీహార్ లో ఒకేసారి మూడు రెట్లు పెన్షన్ పెంచినా కూడా ఆ మొత్తం 1400 కి మించలేదు. అది కూడా లేటెస్ట్ గానే. అంటే ఆర్థికంగా చితికిపోయిన ఏపీ లాంటి చోట్ల పధకాల పోరులో ఎంతదాకా ఈ వ్యవహారం వెళ్తోంది అన్నది ఆలోచించాల్సిందే అన్నది ఒక మాట అయితే ఈ పెన్షన్లు కూడా వేలం పాటగా పెంచుకుని పోతున్నారు. అయితే 2024 ఎన్నికల ముందు బాబు సూపర్ సిక్స్ హామీలలో పెన్షన్లు నాలుగు వేలు చేస్తమని చెప్పారు. ఆ మాట మేరకే అమలు చేస్తున్నారు. ఏపీలో పెన్షన్ల క్రెడిట్ తమదే అని బాబు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ముప్పై రూపాయలు ఉంటే దానిని తాము 75 పెంచామని ఆ తరువాత వెయ్యి రెండు వేలు ఇపుడు నాలుగు వేలు చేశామని ఆయన గుర్తు చేశారు. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ఘనత తమదే అన్నారు.
వైఎస్ జగన్ ల పాత్ర :
అయితే ఇందులో మరో విషయం ఉంది దీంతో టీడీపీ మొత్తంగా ఒక ప్రచారం చేస్తోంది. 75 రూపాయల పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచిన ఘనత తమ పార్టీదే అని అంటోంది. దీని మీదనే వైసీపీ విభేదిస్తోంది. ఏపీలో పెన్షన్ల పెరుగుదలలో వైఎస్సార్ జగన్ ల పాత్ర కీలకం అని చెబుతోంది. అదేలా అంటే 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అప్పటికి 30 రూపాయలుగా మాత్రమే ఉన్న 75 రూపాయలు పెన్షన్లు ఇస్తూ కొంత పరిమితితోనే కొందరికే ఇస్తూ వచ్చేవారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అప్పట్లో పెన్షన్ల మంజూరు ఒక పరిమిత స్థాయిలో ఉండేదని అంటున్నారు.
సంతృప్త స్థాయిలో :
అర్హతే ప్రమాణంగా సంతృప్త స్థాయిలో సామాజిక పెన్షన్లు అమలు చేసిన ఘనత వైఎస్సార్ దే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన హయాంలో అందరికీ పెన్షన్లు అని పెన్షన్లు పెంచుతూ పోయారని అంటున్నారు. ఎంత మంది అర్హులుగా ఉన్నా వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని గమనించే వైఎస్సార్ ఎంతమంది అందిస్తూ ఏకంగా సామాజిక పెన్షన్ల బడ్జెట్ పెంచేశారు అని చెబుతున్నారు.
మూడు వేలు జగన్ దే :
మరో వైపు చూస్తే 2014లో బాబు పెన్షన్ల మొత్తాన్ని వేయి రూపాయలు చేశారు. జగన్ 2018లో పాదయాత్ర సందర్భంగా దానిని రెండు వేలు ఇస్తామని ప్రకటిస్తే బాబు 2019లో అధికారం దిగిపోయే ముందు రెండు నెలలు మాత్రమే ఇచ్చారని జగన్ అయిదేళ్ళ కాలంలో దానిని మూడు వేలకు చేశారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక 2024లో జగన్ పెన్షన్ల విషయంలో హామీ అయితే ఇవ్వలేదు. బాబు మాత్రం నాలుగు వేలు అని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే 2029 నాటికి ఈ సామాజిక పెన్షన్లు 5 వేలకు చేయాలని వైసీపీకి ఒక ప్లాన్ ఉందని అంటున్నారు. అయితే వారికి ఆ చాన్స్ బాబు ఇవ్వరని ఆయనే 2029 ఎన్నికల ముందు అయిదు వేల రూపాయలు పెంచి ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఒకనాడు సంక్షేమ పధకాల పట్ల అంత ఆసక్తి చూపని బాబు మాత్రం 2024 నుంచి జోరు పెంచేశారు అని అంటున్నారు. వైసీపీ ఈ విషయంలో పోటీ పడాలంటే ఏమి చేయాలో ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు.
