ఏపీ అభివృద్ధికి.. విశాఖ సదస్సు ఆభరణమే.. !
విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండు రోజుల భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలక ఆభరణంగా మారుతుందనడంలో సందేహం లేదు.
By: Garuda Media | 14 Nov 2025 5:16 PM ISTవిశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండు రోజుల భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలక ఆభరణంగా మారుతుందనడంలో సందేహం లేదు. 17 మాసాల పాలనలో తీసుకువచ్చిన పెట్టుబడులు.. ఇప్పుడు జరుగుతున్న సదస్సు.. వంటివి కీలకంగా మారాయి.ఈ రెండు రోజులు జరిగే ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు.
వివిధ దేశాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ సంస్థలకు చెందిన ఛైర్మన్లు, ప్రతినిధులు ఈ సదస్సుకు రానున్నారు. 50కు పైగా దేశాల నుంచి 3000 మందికి పైగా ప్రతినిధులు హజరవుతున్నారు. తద్వారా ఏపీ రాష్ట్ర ప్రగతి, విశాఖ ఉన్నతి కూడా వారికి తెలిసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యూకే, యూఏఈ, సౌదీ ఆరేబియా, రష్యా, బెహ్రెయిన్, ఖతార్, న్యూజిలాండ్, సింగపూర్ సహా మరికొన్ని దేశాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు భాగస్వామ్య సదస్సులో పాల్గొంటున్నారు.
ఆసియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఓషేనియా వంటి ప్రాంతాలకు చెందిన వివిధ విదేశీ సంస్థల ప్రతినిధులు పార్టనర్ షిప్ సమ్మిట్ కు హజరవుతున్నారు. ఈ సదస్సులో మొత్తంగా 45కు పైగా సెషన్స్ నిర్వహించేలా ప్రణాళికను సిద్దం చేశారు. తొలి రోజున సుమారు 25 సెషన్స్ జరగనున్నాయి. ఒకే సమయంలో నాలుగు సెషన్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇక విశాఖలోని రెండు రోజుల భాగస్వామ్య సదస్సుపై భారీ అంచనాలే ఉన్నాయి.
భవిష్యత్తు బంగారం..!
ట్రేడ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రీయలైజేషన్, సస్టెయినబులిటీ అండ్ క్లైమెట్ యాక్షన్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గ్రోత్, జియో ఎకనమిక్ ఫ్రేమ్ వర్క్, ఇంక్లూజన్ వంటి అంశాలపై సదస్సులో వివిధ స్థాయిల్లో చర్చలు జరపనున్నారు. ఆయా అంశాలపై చర్చలు జరుపుతూనే... వివిధ పారిశ్రామిక వేత్తలతో విడివిడిగా నిర్వహించే వరుస భేటీల్లో పెట్టుబడులను ఆకర్షించనున్నారు. తద్వారా భవిష్యత్తును బంగారు మయం చేయనున్నారనడంలో సందేహం లేదు.
