Begin typing your search above and press return to search.

పల్నాడులో ఘోరం.. నలుగురు ప్రాణాలు తీసిన రోడ్డు మధ్యలో ఆగిన లారీ

అందుకే అంటారు.. నువ్వెంత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతున్నా.. ఎదుటోడు నిర్లక్ష్యంగా వచ్చినా.. ప్రమాదకరంగా డ్రైవ్ చేసినా.. నీకు ప్రమాదమే. తాజా విషాద ఉదంతం ఈ కోవకు చెందిందే.

By:  Garuda Media   |   1 July 2026 11:23 AM IST
పల్నాడులో ఘోరం.. నలుగురు ప్రాణాలు తీసిన రోడ్డు మధ్యలో ఆగిన లారీ
X

అందుకే అంటారు.. నువ్వెంత జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతున్నా.. ఎదుటోడు నిర్లక్ష్యంగా వచ్చినా.. ప్రమాదకరంగా డ్రైవ్ చేసినా.. నీకు ప్రమాదమే. తాజా విషాద ఉదంతం ఈ కోవకు చెందిందే. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున (బుధవారం ఉదయం) చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమైన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం.. రోడ్డు మధ్యలో డీజిల్ అయిపోయిన కారణంగా ఆగిన లారీగా చెప్పాలి. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. చాలా మీడియా సంస్థల రిపోర్టులలో రెండు లారీలు ఢీ కొన్న కారణంగా జరిగిన ప్రమాదంగా చెబుతున్నారు.

కానీ.. అసలు వాస్తవం ఏమంటే.. ఈ ఘోర ప్రమాదానికి కారణం ఒక లారీ నిర్లక్ష్యంగా.. బాధ్యత లేకుండా రోడ్డు పక్కన ఆపేయటంగా చెప్పాలి. డీజిల్ అయిపోయిన కారణంగా లారీ రోడ్డు మధ్యలో ఆగితే.. దాని చుట్టూ ప్రమాదకర సంకేతాల్ని ఏర్పాటు చేయటం.. ఆ దారిలో వెళ్లే వాహనాలకు ఈ విషయం అర్థమయ్యేలా డేంజర్ గుర్తులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అవేమీ చేయని కారణంగా సంబంధం లేని మరో రెండు లారీలు ఢీ కొని.. నలుగురి అమాయకుల ప్రాణాలు పోయిన దుస్థితి.

పల్నాడు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం పంచాయితీ పరిధిలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఒక లారీ (ఏపీ 07 టీసీ 8679) హైవే మీద వెళుతున్నప్పుడు డీజిల్ అయిపోయింది. దీంతో రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దీన్ని అలానే వదిలేశారు. ఎలాంటి వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. రెండో లారీ (ఏపీ 39 డబ్ల్యూ ఎఫ్ 1959) చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపునకు వెళుతోంది. రోడ్డు మధ్యలో ఆగిన మొదటి లారీని రెండో లారీ డ్రైవర్ ఆఖరి నిమిషంలో గమనించి.. రోడ్డు మధ్యలో ఆగిపోయిన లారీని తప్పించే ప్రయత్నం చేశాడు. దీంతో లారీ అదుపు తప్పింది. డివైడర్ ను బలంగా ఢీ కొట్టి.. అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న మూడో లారీని అనూహ్య రీతిలో డివైడర్ ను దాటి దూసుకెళ్లిన రెండో లారీని బలంగా ఢీ కొట్టింది.

దీంతో డీజిల్ ట్యాంకులు పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ షాకింగ్ ఉదంతంలో లారీలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు.. ఇద్దరు క్లీనర్లు.. బయటకు రాలేని పరిస్థితి. అనూహ్యరీతిలో పెద్ద ఎత్తున విరుచుకుపడిన మంటలకు అక్కడికక్కడే ఆగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదానికి గురైన లారీల్లో ఒక లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన ఒక డ్రైవర్.. తనను కాపాడాలని.. తనకు పిల్లలు ఉన్నారని.. తనను రక్షించాలని ఆర్తనాదాలు పెడుతూనే కాలిపోయిన వైనం అక్కడి వారిని కంటతడి పెట్టేలా చేసింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. దీంతో.. వీరిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం విషాదానికి కారణమైన మొదటి లారీపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.