'ఆ అధికారులు' అప్రూవర్లుగా మారతారా ..!
మళ్ళీ వచ్చే ఎన్నికలనాటికి వైసిపి పుంజుకుంటుంది అనే భావన గనక నాయకులు అధికారుల్లో వ్యక్తం అయితే ఆదిశగానే అడుగులు వేస్తారు.. తప్ప ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అయితే వాళ్ళు వాంగ్మూలాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండరు.
By: Garuda Media | 17 Dec 2025 8:00 PM ISTవైసిపి హయాంలో అక్రమాలు చేశారని, అన్యాయాలు చేశారని కొంతమంది అధికారులపై ప్రస్తుత ప్రభు త్వం కేసులు పెట్టింది. వీరిలో మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ముంబై నటి జత్వానికి కేసులో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయు లు, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటాలు విచారణ ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏపీపీఎస్సీ అక్రమాలు జరిగాయని పేర్కొంటూ నమోదు అయిన కేసులో ఐపీఎస్ సీతారామాంజనేయులు విచారణను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును వేధించారని, కస్టడీలో కొట్టారని ఆరోపిస్తూ నమోదయిన కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ కూడా తాజాగా విచారణకు హాజరయ్యారు, ఇక అక్రమ మద్యం కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి సహా అనేకమంది అధికారులు విచారణకు హాజరవుతున్నారు. కొన్నాళ్లు జైల్లో కూడా ఉన్నారు. అయితే వీరందరూ నిజాలు చెబుతారా.. నాడు ఏం జరిగింది అనేది వెల్లడిస్తారా అనేది సందేహంగా మారింది. ఎందుకంటే సాధారణంగా అధికారులు ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గనుల కుంభకోణం కేసులో ఇరుక్కున్నారు. అదేవిధంగా ఈ కేసులో కొంతమంది బయటకు వచ్చారు. అయితే, ఇప్పటివరకు ఆ కేసులు ఇంకా తేలలేదు. శ్రీలక్ష్మి పాత్ర ఉందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఆవిడ న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు జరుగుతున్న కేసుల్లో కూడా అదే తరహా పరిస్థితి కొనసాగుతుందన్న చర్చ నడుస్తుంది.
మళ్ళీ వచ్చే ఎన్నికలనాటికి వైసిపి పుంజుకుంటుంది అనే భావన గనక నాయకులు అధికారుల్లో వ్యక్తం అయితే ఆదిశగానే అడుగులు వేస్తారు.. తప్ప ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అయితే వాళ్ళు వాంగ్మూలాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండరు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఇటీవల ప్రభుత్వం తొలగించింది. అంతకుముందు వైసిపి హయాంలోనూ కొంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. అయితే వారంతా కూడా ఇలాగే వ్యవహరించారు.
ప్రస్తుత సునీల్ కుమార్ కేసులో కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఆయనను విచారణకు పిలిచారు. రఘురామకృష్ణ రాజు కేసులో ఏం జరిగిందన్నది ఆరా తీశారు. కానీ, ఆయన అన్నిటికి సమాధానాలు చెప్పలేదు. పైగా న్యాయపోరాటానికి కూడా ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఇదే జరిగితే మరిన్ని సంవత్సరాలు పాటు ఈ కేసు కొనసాగుతుంది తప్ప ముడి పడే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించడం లేదు.
మొత్తంగా అధికారులపై పెట్టిన కేసులు ఇప్పటివరకు పెద్దగా పుంజుకోలేదు అన్నది వాస్తవం. అదే విధంగా గత రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి తీసుకుంటే ఏ ఒక్క అధికారీ ఇప్పటివరకు శిక్ష పడిన సందర్భాలు కూడా లేదు. రిమాండ్ ఖైదీగా వెళ్తే వెళ్లి ఉండవచ్చు. కానీ శిక్ష పడిన అధికారులు కూడా ఎక్కడా లేకపోవడం విశేషం. కేవలం లంచాల కేసుల్లో మాత్రమే అధికారులు ఆధారాలతో సహా పట్టుబడుతున్నారు తప్ప ఇటువంటి రాజకీయ వ్యవహారాల్లో చిక్కుకున్న అధికారులు పెద్దగా శిక్ష అయితే అనుభవించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న విచారణలో కేసులు వంటివి ఎప్పటికీ తేలుతాయి అన్నది చూడాలి.
