కొత్త పెన్షన్ల గడువు పొడిగిస్తారా... లక్షల్లో అర్హులు !
ఇదిలా ఉంటే కొత్త పెన్షన్లకు పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయని అంటున్నారు. ఇప్పటికే 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి.
By: Satya P | 14 Sept 2026 4:00 PM ISTఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కొత్త దరఖాస్తుల స్వీకరణకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 16 దరఖాస్తులకు చివరి తేదీగా ఉంది. కొత్త పెన్షన్ల కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సహా వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. అర్హులైన వారు అంతా వివిధ కేటగిరీలలో సామాజిక పెన్షన్లు అందుకునేందుకు దరఖాస్తు చేయాల్సి ఉండగా దానికి సంబంధించి గడువు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. కొత్త పెన్షన్ కోరుకునే వారు అంతా తొందర పడాల్సి ఉంది అని అంటున్నారు. కొత్త పెన్షన్ల కోసం ఎంతో కాలంగా వేచి చూసిన వారందరికీ ఇపుడు ఒక బంగారు అవకాశం వచ్చింది. ఈ నెల 7 నుంచి దరఖాస్తులు స్వీకరించే ఘట్టం మొదలైంది.
అవసరమైన పత్రాలుండాలి :
కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు చూస్తే అర్హులైన లబ్ధిదారులు తమ సమీపంలోని స్వర్ణ గ్రామ లేదా స్వర్ణవార్డు సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం కావలసిన పత్రాలుగా ఆధార్ కార్డ్, రైస్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, సంబంధిత కేటగిరీ పత్రాలు ఉండాలి. ఇక వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం, దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 16 తో దరఖాస్తులకు గడువు పూర్తి అయితె ఆ మరుసటి రోజు అయిన : సెప్టెంబర్ 17 నుంచి క్షేత్రస్థాయిలో అర్హతల పరిశీలన జరుగుతుంది. అర్హత సాధించిన కొత్త లబ్ధిదారులకు అక్టోబర్ 1 నుంచి పింఛన్లు అందజేస్తారు.
లక్షలలో దరఖాస్తులు :
ఇదిలా ఉంటే కొత్త పెన్షన్లకు పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయని అంటున్నారు. ఇప్పటికే 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. మరో వైపు చూస్తే సచివాలయాల్లో దరఖాస్తులు భారీగా వస్తుండటంతో గడువు పొడిగించాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 16నే ఆఖరి తేదీగా ఉంది. కాబట్టి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోదలచిన వారు వెంటనే తమ సచివాలయాన్ని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. మరో వైపు చూస్తే గడువు పొడిగిస్తేనే మేలు అన్న భావన వ్యక్తం అవుతోంది. కేవలం పది రోజులు మాత్రమే ఇచ్చారని అందులో కూడా రెండవ శనివారం, ఆదివారం వినాయక చవితితో మూడు రోజులు పోయాయని అంటున్నారు.
అప్పటి నుంచే కొత్త పెన్షన్లు :
అర్హులైన వారు లక్షలలో ఇంకా మిగిలి ఉన్నారని అంటున్నారు. వారికి ఈ సమయం సరిపోదని కూడా చెబుతున్నారు. దాంతో మరి కొంత కాలం గడువు పొడిగిస్తే అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందని అంటున్నారు. దీని మీద ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఆ మీదట స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతలలో ఉన్నాయి. దాంతో గడువు పెంచితే ఇప్పట్లో కొత్త పెన్షన్లు ఎవరికీ మంజూరు అయ్యే అవకాశాలు ఉండవని అంటున్నారు. మొత్తం మీద చూస్తే సెప్టెంబర్ 16 అన్నది చివరి గడువు గా భావించి అంతా దరఖాస్తు చేసుకోవడమే మేలు అని అంటున్నారు.
