కూటమి అభివృద్ధి మండళ్ళు ....బంపర్ ఆఫర్ మరి
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు ఉండేవి. ఆనాడు ఇరవై మూడు జిల్లాలను ప్రాంతాల వారీగా విభజించి అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసింది.
By: Satya P | 1 Dec 2025 9:23 AM ISTఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు ఉండేవి. ఆనాడు ఇరవై మూడు జిల్లాలను ప్రాంతాల వారీగా విభజించి అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసింది. అలా నాలుగైదు జిల్లాలను కలిపి ఏర్పాటు చేసే ఎలె అభివృద్ధి మండళ్ళకు చైర్మన్లుగా కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ సీనియర్లను నియమించి వారికి ఒక హోదా గౌరవం ఇచ్చేది. అలా వారిని కూడా మంత్రులతో సమానంగా చూస్తూ ఒక రకంగా పదవుల విషయంలో సమ న్యాయం చేసేది.
వైసీపీ హయాంలోనూ :
ఇక వైసీపీ విషయం తీసుకుంటే వికేంద్రీకరణ మీద తెగ ముచ్చట ఆ పార్టీది అన్నది తెలిసిందే. ఏ పార్టీకి లేని విధంగా రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థ వైసీపీకి ఉంది. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక సందర్భంలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయాలని సీరియస్ గానే ఆలోచించింది అని ప్రచారం సాగింది. ఎందుకంటే మంత్రులు కావాలని వైసీపీ హయాంలో చాలా మంది ఆశలు పెంచుకున్నారు. రెండు విడతలుగా మంత్రి పదవులు తీసుకున్నా మొత్తంగా 45 మంది దాకానే అవకాశాలు దక్కాయి. దానిని మించి ఎంతో మంది ఆశావహులు ఉండడంతో వారిని అకామిడేట్ చేసేందుకు అభివృద్ధి మండలను తీసుకుని వచ్చి కేబినెట్ హోదా ఇవ్వాలని భావించింది అని అపుడు అనుకున్నారు. కానీ దాని వల్ల అధికార కేంద్రాలు ఎక్కువై వర్గ పోరు ఇంకా హెచ్చి ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు వస్తాయని పాలన విషయంలో సైతం ఇక్కట్లు వస్తాయని భావించి విరమించుకున్నారు అని ప్రచారం సాగింది.
టీడీపీ కూటమి తీరు :
ఇదిలా ఉంటే టీడీపీ కూటమి ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళకు సృష్టి చేస్తుందా అన్నది చర్చగా ఉంది. దానికి నాందిగా ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా మూడు జోన్లుగా ఏపీని విభజించడం దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడాన్ని చూస్తున్నారు ఏపీలో మొత్తం జిల్లాలను మూడు జోన్లుగా చేశారు. విశాఖ జోన్ లో తొమ్మిది జిల్లాలు అమరావతి జోన్ లో మరో ఎనిమిది జిల్లాలు, రాయలసీమ జోన్ లో తొమ్మిది జిల్లాలు ఉన్నాయి. ఈ విధంగా చేస్తూ విశాఖ జోన్ కి సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి యువరాజ్, అలాగే అమరావతికి మీనా, రాయలసీమకు క్రిష్ణబాబు వ్యవహరిస్తారు. ఈ మేరకు వారి నియామకాలని ఆమోదించారు. రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు. ఎకనామిక్ జోన్లుగా వీటిని చెబుతున్నారు ఇక ప్రత్యేక బోర్డులను కూడా నియమిస్తారు అని అంటున్నారు.
అధికారులతోనేనా :
ఇదంతా అధికారుల నియామకంతోనే ఉంది. అయితే ప్రజా ప్రతినిధులు ఇందులో ఉంటారని అంటున్నారు. మరి వారంతా మెంబర్లుగా ఉంటారా లేక వేరే విధంగా వారికి చోటిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇక సీఈఓలుగా ఐఏఎస్లు ఉన్న ఈ జోన్లలో చైర్మన్లు ఉంటారా ఉంటే కనుక ఆ పదవులు రాజకీయ నేతలకే అప్పగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అదే కనుక జరిగితే మరింతమందికి కీలక పదవులు దక్కినట్లే. ఒక విధంగా బంపర్ ఆఫర్ కూడా వారికి దక్కినట్లే అని అంటున్నారు. అయితే ఈ జోన్ల ఏర్పాటు ఏపీని మూడు ప్రాంతాలలో సమగ్రమైన అభివృద్ధి దిశగా నడిపించడం కోసం అన్నది ఉద్దేశ్యంగా ఉంది. చూడాలి మరి రానున్న రోజులలో వీటి పూర్తి వివరాలు ఏ విధంగా ఉంటాయో.
