Begin typing your search above and press return to search.

మా వాళ్లదే తప్పు.. జగన్

సూపర్ 6 పథకాల అమలుతో.. జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో నానుతోంది. ఈ ప్రచార వైఫల్యమే తమ కొంపముంచిందని.. చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామని జగన్ వాపోయారు.

By:  A.N.Kumar   |   11 Sept 2025 12:08 PM IST
మా వాళ్లదే తప్పు.. జగన్
X

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయ్యింది. ఈ స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సూపర్ 6 పథకాల అమలుతో.. జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో నానుతోంది. ఈ ప్రచార వైఫల్యమే తమ కొంపముంచిందని.. చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామని జగన్ వాపోయారు.

ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రచారలోపంపై ఆందోళనగా ఉంది.. ఈ ఆందోళనను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ “మా హయాంలో మేము చేసిన పనులను ప్రజల ముందుంచలేకపోయాం. అదే మాకు పెద్ద మైనస్ అయింది” అని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయవర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

* సంక్షేమంపైనే అతి నమ్మకం

జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తమ పాలనలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రజలకు నేరుగా నగదు బదిలీ, వివిధ ఉచిత పథకాలతో తమ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవచ్చని వైసీపీ గట్టిగా నమ్మింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెరిగిన భారంపై విమర్శలు వచ్చాయి. అభివృద్ధి పనులు కూడా జరిగాయి కానీ వాటిని ప్రజలకు సమర్థవంతంగా వివరించడంలో వైఫల్యం చెందారు.

2024 ఎన్నికల సమయంలో సంక్షేమమే తమ బలం అనుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన, బీజేపీ కూటమి చేసిన ప్రచారం, వైసీపీపై వచ్చిన విమర్శలు ప్రజలను ప్రభావితం చేశాయి. ఫలితంగా ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

* కూటమి ప్రభుత్వం - బలం పెంచుకుంటూ..

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి - టీడీపీ, జనసేన, బీజేపీ - సమన్వయంతో ముందుకు సాగుతోంది. కేంద్రం సహకారం పొందడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుండగా, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజలకు వివరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెంచుతున్నారు. ఒకవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధి పనులను కళ్లకు కట్టినట్టు చూపించడం కూటమి పాలనకు బలాన్ని చేకూర్చింది.

* జగన్ ఆత్మవిమర్శ

ఇక వైసీపీ విషయానికి వస్తే - అభివృద్ధి, పాలన, పథకాల అమలుపై తగిన రీతిలో ప్రచారం చేయలేకపోవడం పార్టీకి చేటు చేసిందని జగన్ అంగీకరించడం ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చకు దారితీసింది. ఈ ఆత్మవిశ్లేషణ కాస్త ఆలస్యమైనప్పటికీ, ఇది పార్టీలో ఒక కొత్త ఆలోచనకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ పునర్నిర్మాణానికి.. ప్రజలతో మళ్లీ అనుసంధానం కావడానికి ఒక మంచి మార్గం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీడియాను, అనుకూల మీడియాను తయారు చేసుకునేందుకు ఒక చక్కటి మార్గాన్ని కనుగొనాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించారు.

మొత్తానికి కూటమి పాలన 15 నెలల్లోనే "సూపర్ హిట్" అని శ్రేణులు చెబుతుంటే, వైసీపీ మాత్రం “మా తప్పులే మాకు నష్టం చేశాయి” అని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఆత్మపరిశీలన ఆ పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.