ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 'ముస్తాబు'.. ఏంటిది?
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించింది.
By: Garuda Media | 22 Dec 2025 7:00 AM ISTఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు సహా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విద్యాలయాల్లోనూ ఈ కార్యక్రమా న్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విశాఖపట్నం జిల్లాలోని తాళ్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో దీనిని ఆయన స్వయంగా ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని.. దీనికి తాను భరోసా ఇస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను పాఠశాలల్లో ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.
ఈ క్రమంలోనే `ముస్తాబు` కార్యక్రమాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండడంతోపాటు.. విద్యలో ముందుండాలని తాను భావిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కేవలం చదువులోనే కాదు.. అన్ని విషయాల్లోనూ విద్యార్థులు బాగుండాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పంగా చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి అవసరం వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. నేరుగా కలెక్టర్లకు చెప్పే వెసులుబాటును కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రతి అంశాన్నీ కలెక్టర్లు నిశితంగా గమనించాలనిసీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్థులను అన్ని విధాలా కాపాడాలని ఆయన సూచించారు.
ఏంటీ ముస్తాబు..?
విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకు చేరుకున్న తర్వాత.. వారి జుట్టు చెరిగిపోవడం.. ముఖమంతా దుమ్ము ధూళితో కొట్టుకుపోవడం కామన్. ముఖ్యంగా పల్లెటూర్లు, గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. దీంతో వారు క్లాస్ రూముల్లో ఆహ్లాదంగా కూర్చొని పాఠాలు వినేప రిస్థితి ఉండదు. దీనిని గుర్తించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్.. వెంకట రమణారెడ్డి.. జిల్లాలో గత రెండు మాసాలకిందట `ముస్తాబు` పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ప్రతి పాఠశాలకు.. ఒక అద్దం.. రెండు దువ్వెనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు స్కూలుకు చేరుకున్న తర్వాత.. తలలు దువ్వుకుని.. ఆహ్లాదకర వాతావరణంలో తరగతి గదుల్లోకి ప్రవేశిస్తారు. ఇదీ.. ఇతమిత్థంగా ముస్తాబు కార్యక్రమం లక్ష్యం.
ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్య జిల్లా కలెక్టర్ చేసిన ప్రయొగం.. సత్ఫలితాలు ఇస్తున్నట్టు సీఎం చంద్రబాబు గుర్తించారు. దీనిని ఆయన ప్రశంసించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నిపాఠశాలలు, గురుకులాల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పారు. దీనికిగాను రూపాయి కూడా ఖర్చు కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తానే స్వయంగా శనివారం జోక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు.. 50 వేలకుపైగా అద్దాలు.. 1.5 లక్షల దువ్వెనలను సరఫరా చేశారు. విశాఖలో స్వయంగాచంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
