Begin typing your search above and press return to search.

జగన్ వద్దన్నా అక్కడే ఏకగ్రీవాలు కాబోతున్నాయా ?

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలైంది.

By:  Satya P   |   18 Oct 2026 11:00 PM IST
జగన్ వద్దన్నా అక్కడే ఏకగ్రీవాలు కాబోతున్నాయా ?
X

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలైంది. అయితే నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు నుంచే రణరంగాన్ని తలపించేలా సన్నివేశాలు అనేక చోట్ల జరిగాయి. పుంగనూరుతో మొదలైన ఘర్షణలు పులివెందుల దాకా చేరాయి. అంతే కాదు అనేక చోట్ల విస్తరించాయి. వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా చెప్పుకునే రాయలసీమలో పలు చోట్ల నామినేషన్లను వైసీపీ అభయ్ధులు వేయకుండా అడ్డుకున్నారు అని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అంతే కాదు ఇదేమి ప్రజాస్వామ్యం అని అంటోంది. అయితే దీనిని కూటమి నేతలు తిప్పికొడుతున్నారు. వైసీపీయే అరాచకాలకు తెర తీసింది అని మండిపడుతున్నారు.

సీమలో సీన్ ఏంటి :

ఈ క్రమంలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం మూడు రోజుల పాటు సాగి ఆదివారంతో ముగిసింది. అయితే దీని తరువాత చూస్తే ఉత్తరాంధ్రా, ఉభయగోదావరి జిల్లాలు, కోస్తాలలో ఫరవాలేదు కానీ రాయలసీమలో మాత్రం వైసీపీ అనేక చోట్ల నామినేషన్లు వేయలేకపోయింది అని వార్తలు వస్తున్నాయి. అనేక మునిసిపాలిటీలలో వైసీపీ గుర్తు లేకుండానే ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో వైసీపీకి ఇది ఒక షాకింగ్ లాంటి పరిణామమే అని అంటున్నారు. వైసీపీ అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు అని ఆ పార్టీ విమర్శించవచ్చు కానీ అసలు ఎన్నికల్లో పోటీకి నామినేషన్లనే వేయకపోవడం వల్ల తొలి దశలోనే వైసీపీ వీగిపోయింది అన్న చర్చ కూడా వస్తోంది.

బలమున్న చోటనే :

నిజానికి చూస్తే వైసీపీకి రాయలసీమలో బలం గట్టిగా ఉంది. 2024 ఎన్నికల్లో అనేక కారణాల వల్ల మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాలలో చేదు ఫలితాలు వచ్చాయి. కేవలం ఏడు సీట్లు మాత్రమే దక్కాయి. అయితే ఈసారి అలా కాదని వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. అలాంటి చోటనే నామినేషన్లను వైసీపీ వేయలేకపోయింది అని అంటున్నారు. దాంతో వైసీపీ ఈ విషయాల మీద వ్యూహాత్మకంగా వ్యవహరించలేదా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అధికార పార్టీ దౌర్జన్యాలు చేసింది అని వైసీపీ ఎంత ఆరోపించినా వైసీపీ తొలి ప్రక్రియలోనే రేసులో లేకపోవడం మాత్రం ఇబ్బందిని కలిగించే పరిణామమే అని అంటున్నారు.

ఏకగ్రీవాలేనా :

మరి వైసీపీ నామినేషన్లు వేయని చోట ఆటోమేటిక్ గా కూటమి అభ్యర్ధులే విజయం సాధిస్తారు అన్నది నిజం. అయితే ఆయా చోట్ల ఇండిపెండెంట్లు కొన్ని చోట్ల వేశారని వార్తలు వస్తున్నాయి. దాంతో వైసీపీ ప్లాన్ బీని అమలు చేస్తుంది అని అంటున్నారు. అంటే ఇండిపెండెంట్లలో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడం ద్వారా కూటమిని నిలువరించే ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు. అయితే అధికార కూటమి అభ్యర్ధులు ఏకగ్రీవాల వైపుగా ఆలోచన చేస్తే ఎంత మంది ఇండిపెండెంట్లు రేసులో చివరి దాకా నిలబడతారు అన్నది మరో పెద్ద ప్రశ్న. ఒక రాజకీయ పార్టీగా వైసీపీయే నిలబడలేనపుడు ఇండిపెండెంట్లు ఏ మేరకు పోటీకి సిద్ధమవుతారు అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే నామినేషన్ల ఉప సంహరరణ తరువాత ఎన్ని ఏకగ్రీవాలు వచ్చాయన్నది లెక్క తేలనుంది. అదే కనుక జరిగితే వైసీపీ కానీ జగన్ కానీ ఏకగ్రీవాలు వద్దు అని పదే పదే చెప్పిన దానికి విరుద్ధంగా తొలి విడతలోనే చేదు అనుభవాలు ఎదురవుతాయా అన్నదే చూడాల్సి ఉంది.