మున్సిపోల్స్ రీ షెడ్యూల్ : నవంబర్ 1న పోలింగ్... 3న కౌంటింగ్
మరో వైపు చూస్తే ఏపీలో 19 చోట్ల తమకు నామినేషన్లు వేసుకునే అవకాశం ఇవ్వలేదని వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్ళింది.
By: Satya P | 22 Oct 2026 11:03 PM ISTఏపీలో మునిసిపాలిటీలకు జరిగే ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. మారిన దాని ప్రకారం చూస్తే అక్టోబర్ 28వ తేదీన జరగాల్సిన పోలింగ్ నవంబర్ 1న జరుగుతాయి. అలాగే అక్టోబర్ 30న జరగాల్సిన కౌంటింగ్ నవంబర్ 3న జరగనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన మీద ఎస్ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
నాలుగు చోట్లే గడువు పొడిగింపు :
మరో వైపు చూస్తే ఏపీలో 19 చోట్ల తమకు నామినేషన్లు వేసుకునే అవకాశం ఇవ్వలేదని వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే నిర్ణయం తీసుకోమని ఎస్ఈసీని కోరింది దాంతో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికను కోరిన ఎస్ఈసీ వాటిని గురువారం అధ్యయనం చేసిన మీదట నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్ల ప్రక్రియను మరో రెండు రోజులు పొడిగించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతిలో 48 గంటల పాటు నామినేషన్ల గడువును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అక్కడ ఈ నెల 23, 24 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. అదే విధంగా తుది జాబితాను 25న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.
వైసీపీ రియాక్షన్ :
తాము మొత్తం పందొమ్మిది చోట్ల నామినేషన్లు తీసుకోలేదని కోర్టుకు వెళ్తే నాలుగు చోట్ల మాత్రమే రెండు రోజుల గడువుతో నామినేషన్ల స్వీకరణకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేయడం పట్ల వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇది వైసీపీకి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. వాస్తవానికి 19 చోట్ల మాత్రమే కాదని మరిన్ని చోట్ల కూడా నామినేషన్లు వేయనీయలేదని వైసీపీ అంటోంది. మొత్తం అధ్యయనం చేసి ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని వైసీపీ నేతలు భావిస్తూ వచ్చారు. ఇపుడు నాలుగు అంటే నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్లు స్వీకరణ చేపడతామంటే వైసీపీ స్పందన ఏమిటి అన్నది ఆసక్తి నెలకొంది.
మరోసారి జగన్ :
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మరో సారి ఎస్ఈసీ అనిల్ కుమార్ పునేఠాను శుక్రవారం కలుస్తారు అని అంటున్నారు. ఆయన దానితో పాటు కీలక ప్రెస్ మీట్ నిర్వహిస్తారు అని చెబుతున్నారు. ఇక ఎస్ఈసీని జగన్ కలసి ఏమి కోరుతారు అన్నది కూడా చర్చగా ఉంది. ఎస్ఈసీని వైసీపీ తరఫున నివేదిక ఇస్తారా అన్నది కూడా చర్చిస్తున్నారు.
సుప్రీం దాకా :
అదే విధంగా ఎస్ఈసీకి విన్నవించిన తరువాత ఫలితం రాకపోతే మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు కూడా వైసీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఎక్కడెక్కడ నామినేషన్లు తీసుకోలేదు అన్నది పూర్తి ఆధారాలతో సుప్రీంకోర్టుకు వెళ్ళాలని కూడా వైసీపీ ఆలోచిస్తోంది అని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
