Begin typing your search above and press return to search.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఆ రోజే ?

అయితే ఈ కేసులు అనీ ఈ నెలాఖరులోగా ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. అందుకే అక్టోబర్ లో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కసరత్తుని ముమ్మరం చేసింది అని అంటున్నారు.

By:  Satya P   |   11 Sept 2026 9:51 PM IST
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఆ రోజే ?
X

ఏపీలో మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఒక విధంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పుకోవాలి. ఇప్పటికి ఇరవై రోజుల వ్యవధిలో ఏపీలో మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది అని అంటున్నారు. అంటే అక్టోబర్ 3 లేదా 4వ తేదీలలో కచ్చితంగా నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టులో కేసులు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల మీద అలాగే సర్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత వచ్చే కొత్త ఓటర్ల జాబితాను తీసుకుని ఎన్నికలు జరపాలని వేసిన పిటిషన్ల మీద కోర్టులో ఏ రకమైన తీర్పు వస్తుంది అన్నది ఉంది. అయితే ఈ కేసులు అనీ ఈ నెలాఖరులోగా ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. అందుకే అక్టోబర్ లో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కసరత్తుని ముమ్మరం చేసింది అని అంటున్నారు.

కొత్త పెన్షన్లను ఇచ్చేస్తూ :

ఇక ఏపీలో కొత్త పెన్షన్లు అక్టోబర్ 1న ఇచ్చే సామాజిక పెన్షన్ లతో కలిపి ఇస్తారని అంటున్నారు. ఏపీ మొత్తంగా కొత్తగా మూడు లక్షల దాకా పెన్షన్లు ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెలాఖరుతో పూర్తి అయి అర్హుల జాబితాని తీసుకుని ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తుంది అని అంటున్నారు. ఇక అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ఉంటుంది. దాంతో 3న లేదా 4వ తేదీన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుందని అంటున్నారు. కొత్త పెన్షన్లు మరో మూడు లక్షలను ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేసినట్లుగా భావిస్తోంది. ఆ విధంగా స్థానిక ఎన్నికల్లో అది సానుకూలం అవుతుందని కూడా భావిస్తోంది.

పదిహేను రోజులలోనే :

ఇక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తీసుకుంటే మొత్తం 15 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. నోటిఫికేషన్ జారీ చేసిన వేంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ వరసగా తొలి వారంలో జరిగిపోతాయి. ఆ తరువాత మలి వారం అంతా ఎన్నికల ప్రచారానికి ఉంటుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అక్టోబర్ 17 లేదా 18 తేదీల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తి చేయాలని పట్టుదలగా రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది అని అంటున్నారు.

ఎన్నికల సమరమే :

ఇదిలా ఉంటే ఏపీలో మొత్తం 17 దాకా కార్పోరేషన్లు అలాగే 100 పట్టణ స్థానిక సంస్థలకు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఇందులో ఇప్పటికే గడువు ముగిసిన 87 పురపాలక సంస్థలతో పాటు 2026 నవంబర్ నాటికి గడువు ముగియనున్న మరో 13 సంస్థలు ఉన్నాయి. కోర్టు కేసులు న్యాయపరమైన చిక్కులు ఉన్న మిగిలిన 23 స్థానిక సంస్థల ఎన్నికలను తదుపరి దశలో చేపట్టనున్నారని చెబుతున్నారు. మున్సిపల్ చట్టాల సవరణ ప్రకారం ఈసారి మేయర్లు, మున్సిపల్ నగర పంచాయతీ చైర్‌పర్సన్లను ప్రజలే నేరుగా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ పదవులను మాత్రం పరోక్ష పద్ధతిలోనే భర్తీ చేస్తారు.