Begin typing your search above and press return to search.

పరిమితి పాతాళంలో.. ఖర్చు ఆకాశంలో.. పొంతన లేని ఎన్నికల ఖర్చులు

అయితే ఎన్నికల సంఘం విధించిన ఈ పరిమితి ఏమూలకూ చాలదని, నామినేషన్ వేయడానికి ముందే ఈ ఖర్చులు అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   14 Oct 2026 12:23 PM IST
పరిమితి పాతాళంలో.. ఖర్చు ఆకాశంలో.. పొంతన లేని ఎన్నికల ఖర్చులు
X

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం అలుముకుంది. నోటిఫికేషన్ విడుదలకు ముందు ఎన్నికల కమిషన్ ఒక్కొక్క పని చక్కబెడుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, జడ్పీ, మండలాలు, పంచాయతీలకు ఈ రోజు సాయంత్రం కల్లా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయని అంటున్నారు. ఇక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులపై పరిమితి విధిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల సంఘం విధించే పరిమితులకు వాస్తవంగా అయ్యే ఖర్చుకు ఎక్కడా పొంతన ఉండటం లేదని చెబుతున్నారు. ఎన్నికలు అంటేనే ధన బలం ఎక్కువగా చూపాల్సి వుంటుందని అంటున్నారు. ఎన్నికలలో డబ్బు దుర్వినియోగం కాకుండా, ప్రలోభాలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల సంఘం నిఘా వేసిన అదంతా తూతూ మంత్రంగానే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులపై పరిమితులు ఆసక్తి రేపుతున్నాయి. పది వేల జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచులు రూ.2.5 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలు ఖర్చు చేయాల్సివుంటుందని అంటున్నారు. అదే సమయంలో పది వేల కన్నా ఎక్కువ జనాభా ఉండే పంచాయతీల్లో సర్పంచులు రూ.4 లక్షలు, వార్డు సభ్యులు లక్ష చొప్పున ఖర్చు చేసుకోవచ్చునని ఎన్నికల సంఘం సూచించింది. అదే సమయంలో జడ్పీటీసీ అభ్యర్థులు రూ.8 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు రూ.20 లక్షలు, కౌన్సిలర్లు రూ.7.5 లక్షలు, విశాఖ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి 40 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థులు 25 లక్షలు, కార్పొరేటర్లు విశాఖలో రూ20 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.10 లక్షల చొప్పున ఖర్చు చేయాల్సివుంటుంది.

అయితే ఎన్నికల సంఘం విధించిన ఈ పరిమితి ఏమూలకూ చాలదని, నామినేషన్ వేయడానికి ముందే ఈ ఖర్చులు అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి పనికి డబ్బు ఖర్చు చేయాల్సివుండటం, డబ్బు పెట్టకపోతే కనీసం ఒక్క కార్యకర్త కూడా పలికే అవకాశం లేకపోవడంతో పోటీ చేసే అభ్యర్థులు భారీగా వెచ్చించాల్సివుంటుందని అంటున్నారు. నామినేషన్ వేసేటప్పుడు జన సమీకరణ నుంచి వారికి భోజనాలు, మద్యం పంపిణీతో కలుపుకుంటే తొలిరోజే మున్సిపల్ కార్పొరేషన్లలో కోట్లలో ఖర్చు చేయాల్సివుంటుందని అంటున్నారు. కనీసం ప్రతి కార్యకర్తకు రూ.500 నుంచి ఇచ్చుకోవాల్సివుంటుందని అంటున్నారు. ఇక ఎన్నికల ముగిసే వరకు కార్యకర్తలను ప్రసన్నం చేసుకోడానికి ఓటరు దేవుడిని ఆకట్టుకోడానికి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.40 లక్షల వరకు ఖర్చు చేయొచ్చని ఎన్నికల సంఘం పరిమితి విధించగా, ఇక్కడ దాదాపు 40 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కడప, కర్నూలు వంటి నగరాల్లోనూ ఖర్చు కోట్లపైనే ఉంటుందని అంటున్నారు. మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రత్యక్ష పద్దతిలో ఎన్నుకోవడం వల్ల డబ్బు మరింత ఖర్చు పెట్టాల్సివుంటోందని అంటున్నారు. గతంలో ఈ పదవులకు పరోక్ష విధానంలో ఎన్నికలు జరిగేవని, దీనివల్ల కౌన్సిలర్ అభ్యర్థులు స్థానికంగా మేనేజ్ చేసుకుని కాస్త తక్కువ ఖర్చుతో బయటపడేవారని చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ సారి ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల మేయర్, చైర్మన్ పదవులకు ప్రతిష్ఠ పెరిగిందని, ఐదేళ్లు పదవిలో ఉండే అవకాశం ఉండటం వల్ల అభ్యర్థులు కూడా తమ వ్యక్తిగత పరువు ప్రతిష్టల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.