ఏపీలో మున్సిపల్ ఎన్నికల మీద బిగ్ అప్డేట్
ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర జనాభా వివరాలు 2011 దాకానే ఉంది. ఆ తరువాత అయితే 2021లో జనాభా గణన కరోనా వల్ల జరగలేదు, ఇపుడు కేంద్ర ప్రభుత్వం జనాభా గణనను చేపట్టాలని చూస్తోంది.
By: Satya P | 7 Jan 2026 7:00 AM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు బాకీ ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది మొదట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే లోకల్ ఫైట్ లో తెలంగాణా తన పని తాను చేసుకుని పోతోంది. ఇక తెలంగాణాలో లోకల్ బాడీ ఎన్నికల గడువు కూడా ముగుస్తోంది. ఏపీలో అయితే ఇంకా మార్చి వరకూ మునిసిపాలిటీలకు కార్పోరేషన్లకు గడువు ఉంది. అలాగే జిల్లా పరిషత్ లకి జూన్ వరకూ టైం ఉంది. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయా అంటే కీలకమైన మ్యాటర్ బయటకు వచ్చింది.
జనగణన తరువాతనే :
ఏపీలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జనగణన తరువాతనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని మీద మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే స్పష్టత ఇచ్చేశారు. ఈ ఏడాది కేంద్రం జనగణన నిర్వహిస్తోంది అని ఆయన గుర్తు చేశారు. అదంతా పూర్తి కావడానికి ఈ ఏడాది డిసెంబర్ అవుతుందని చెప్పారు. అందువల్ల జనగణన ఆ వివరాలు అన్నీ చూసుకుని కొత్త డేటా ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. అందువల్ల 2027లో లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరుగుతాయని మంత్రి అంటున్నారు.
సామాజిక సమీకరణలు :
ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర జనాభా వివరాలు 2011 దాకానే ఉంది. ఆ తరువాత అయితే 2021లో జనాభా గణన కరోనా వల్ల జరగలేదు, ఇపుడు కేంద్ర ప్రభుత్వం జనాభా గణనను చేపట్టాలని చూస్తోంది. దీంతో ఎన్నికలు వాయిదా పడతాయని అంటున్నారు. కొత్త లెక్కలు వస్తే కనుక సామాజిక సమీకరణలు కూడా చూసుకుని పూర్తి సమాచారంలో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రిజర్వేషన్ కూర్పు కూడా ఉండొచ్చు అని అంటున్నారు. దాంతో పాటు బీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. దాంతో ఏపీ ప్రభుత్వం జనాభా గణన తరువాతనే ఎన్నికలు అని నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు.
ప్రత్యేక పాలనలోకే :
ఇక మార్చితో మునిసిపాలిటీలు, కార్పోరేషన్లకు గడువు తీరుతుంది. దాంతో పాలక మండళ్ళు రద్దు అవుతాయి. అయితే మరో తొమ్మిది నుంచి ఏడాది దాకా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే లోకల్ బాడీస్ పాలన సాగుతుందని అంటున్నారు. ఇక విజయవాడని గ్రేటర్ గా మార్చాలని ఒక ప్రతిపాదన ముందుకు వస్తోంది. అలాగే తిరుపతి కార్పోరేషన్ ని గ్రేటర్ చేయమంటున్నారు. వీటిని కూడా 2027లోనే పరిశీలిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది అయితే ఎన్నికలు ఉండవు. సో మ్యాటర్ వెరీ క్లియర్ అన్న మాట.
